-ఆర్భాటంగా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టారే తప్ప ప్రయోజనం శూన్యం
-కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నిలిచిపోయిన పిహెచ్సిల నిర్మాణాలు
-గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని నిర్మిస్తున్నాం
-అసెంబ్లీలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం కొత్త పిహెచ్ సిలను నిర్మిస్తామంటూ ఆర్భాటంగా చేపట్టిన నాడు -నేడు కార్యక్రమం అసంపూర్తిగానే మిగిలిపోయిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కొత్త పిహెచ్సిల నిర్మాణంపై శాసనసభలో సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సక్రమంగా బిల్లులు చెల్లించనందువల్లే పనులన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. ప్రత్యేకించి విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు సబ్బవరం పిహెచ్ సికి సంబంధించి అడిగిన ప్రశ్నపై మంత్రి స్పందిస్తూ ఈ వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో రు.1.04 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారని, అయితే కాంట్రాక్టర్ మాత్రం రు.24 లక్షల మేర పనులు మాత్రమే చేసి, నాటి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో పనులు నిలిపివేశారన్నారు. తరువాత ఐదు సార్లు టెండర్లు పిలిచినప్పటికీ చేసిన పనులకు బిల్లులు రావన్న భయంతో కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాలేదన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొత్త పిహెచ్సిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిదని, త్వరలోనే అందుకు సంబంధించిన టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. సభ్యులడిగిన సిహెచ్సి అప్ గ్రేడేషన్ ప్రతిపాదనను కూడా తాము పరిశీలిస్తామన్నారు. ప్రతి పిహెచ్సికి రు.1.43 లక్షల వంతున కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు మంజూరు చేసిందని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం రు.670 కోట్ల అంచనా వ్యయంతో 1972 పిహెచ్సి ల నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ బిల్లుల చెల్లింపు సమస్యతో కాంట్రాక్టర్లు కేవలం రు.426 కోట్ల మేర పనులు మాత్రమే పూర్తి చేశారని, అందులో కూడా కేవలం రు.250 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. మిగిలిన బిల్లుల బకాయిలను గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా అప్పగించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పిహెచ్సిల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రు.276 కోట్లు విడుదల చేసిందన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాత పిహెచ్సిల పునరుద్ధరణ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం చేపట్టినప్పటికీ అది కూడా అసంపూర్తిగానే నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టటానికి వీలుగా నిధుల లభ్యతపై తమ ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. అసంపూర్తిగా వున్న విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణానికి కూడా తమ ప్రభుత్వం నిధులను మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాడు -నేడు కింద జరిగిన పనులన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయని, జరిగిన పనుల్లో కూడా నాణ్యత లేదని తమ పరిశీలనలో తేలిందని మంత్రి వివరించారు.
గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు
దేశ వ్యాప్తంగా లక్షా 50 వేల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టగా ఏపీలో అప్పటికే ఉన్న సబ్ సెంటర్లను అప్‌గ్రేడ్ చేస్తూ కొత్తగా 10,032 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లను నిర్మించాలనుకున్నారని, ఇందులో ఎన్ఆర్ జియస్ నిధుల కింద 3,105 పూర్తి చేశారని, మిగిలినవి అలాగే ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్(PMABIM) కింద 1760, 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 1500 విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఈ బడ్జెట్లో కొత్తగా చేపట్టనున్నామని, తొందర్లోనే టెంటర్లు పిలిచి పూర్తి చేస్తామని మంత్రి సభకు వివరించారు. గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల్ని సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాలలో నిర్మించడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవల్ని అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వీటి నిర్మాణానికి సంబంధించి టెండర్లు కూడా పిలిచామని, పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.