• భక్తిప్రపత్తులతో పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్న ఉప ముఖ్యమంత్రి
* దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించిన పవన్ కళ్యాణ్
• ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించిన వేద పండితులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణంలో మోపిదేవిలో వెలసిన ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం శ్రీ వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి మధ్యాహ్న సేవలో పాల్గొన్నారు. తొలిసారి ఈ ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కి వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కి… ఆలయ ఆవరణలో ఉన్న నాగ పుట్టను దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి మొదట పుట్టలో పాలు పోసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి మొక్కులు చెల్లించుకుని పడగలకు మొక్కారు. అనంతరం ప్రదక్షిణగా వచ్చి అంతరాలయంలోని వేయి పడగలతో లింగమూర్తిగా వెలసిన మూలవిరాట్టుకి పంచామృతాలతో అభిషేకాదులు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ సుబ్బరాయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
• ఆలయ విశిష్టతను ఆసక్తిగా ఆలకించిన పవన్ కళ్యాణ్
పూజల అనంతరం ఘనాపాటి నవుడూరి విశ్వనాథ శర్మ ఆలయ విశిష్టతను, చరిత్రను పవన్ కళ్యాణ్ కి వివరించారు. శ్రీ సుబ్రహ్మణ్వేశ్వర స్వామి వారు స్వయంభువుగా వెలసిన క్షేత్రం అని, ఆలయం వెలుపల పుట్టలో పోసిన పాలను లింగాకార మూర్తి కింద సర్పరూపంలో ఉన్న స్వామి వారు స్వీకరిస్తారని తెలిపారు. సంవత్సరానికి రెండు, మూడు సార్లు స్వామి వారు వెలుపలికి వచ్చి భక్తులకు విశ్వరూప దర్శనమిస్తారని వివరించారు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా పేరున్న మోపిదేవి క్షేత్రానికి వారాంతాలు, ప్రతి మంగళవారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని చెప్పారు. నివార్ తుపాను సమయంలో రైతులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో ఆలయం వెలుపలి నుంచి వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. తమిళనాట ఉన్న ఆరు విఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం తర్వాత మోపిదేవి సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని దర్శించుకునే భాగ్యం కలిగిందని అన్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. పవన్ కళ్యాణ్ తోపాటు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర , పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి , స్థానిక శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News