-నిర్వాసితుల కోసమే పోలవరం జిల్లా
-23 నెలల్లో రూ.2,250 కోట్లు నిర్వాసితులకు చెల్లించాం
-పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం
-చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాకే మా సమస్యల పరిష్కారంపై నమ్మకం వచ్చింది: పోలవరం నిర్వాసితులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చిత్తుశుద్ధి ఉందని… పోలవరం నిర్వాసితుల పట్ల అభిమానంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శుక్రవారం పుట్టపర్తి పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న అనంతరం క్యాంప్ కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. పోలవరం నిర్వాసితులకు రూ.306.61 కోట్ల పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని సీఎం చంద్రబాబు అందించారు. అలాగే పలువురు లబ్దిదారులకు ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఇళ్ల తాళాలను అందించారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62.05 ఎకరాలు, ల్యాండ్ టూ ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. 23 నెలల్లో ఇప్పటికే మూడు దఫాలుగా నిర్వాసితులకు పరిహారం అందించిన సీఎం… శుక్రవారం నాలుగో విడతలో మరికొంతమంది నిర్వాసితులకు పరిహారం అందించారు. 2025 ఏడాదిలో సంక్రాంతి, దీపావళీ సందర్భంగా రెండు సార్లు 2026 ఏడాదిలో ఉగాది సందర్భంగా మూడోసారి, ఇవాళ కాటన్ దొర జయంతి సందర్భంగా నాలుగో విడత పోలవరం నిర్వాసితులకు ముఖ్యమంత్రి పరిహారం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 29,936 మంది నిర్వాసితులకు సుమారు రూ.2,250 కోట్ల పరిహారాన్ని పోలవరం నిర్వాసితులకు చెల్లించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”కాటన్ దొర జయంతి రోజున పోలవరం నిర్వాసితులతో సమావేశం కావడం… ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు ఇవ్వడం ఆనందంగా ఉంది. సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా పండుగలకు పోలవరం నిర్వాసితులకు నిధులు అందిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద కమిట్మెంట్ ఉంది.. నిర్వాసితుల మీద అభిమానం ఉంది. ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదు.. ఇబ్బందులు పడకూడదనేదే నా ఆలోచన. పోలవరం నిర్వాసితులు కోసమే పోలవరం జిల్లా ఏర్పాటు చేశాం. టెక్నాలజీ అనుసంధానం చేసి ప్రతీ కుటుంబ ఆదాయం పెంచుతాం. గిరిజన నియోజకవర్గాలైన పోలవరం, రంపచోడవరంను అన్ని విధాలా తీర్చిదిద్దుతాం. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తవుతుంది. నిర్వాసితుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. ప్రాజెక్టు, టౌన్ షిప్, ఇండస్ట్రీ ఇలా ఏం వచ్చినా త్యాగం చేసేది రైతులే. వారసత్వంగా వచ్చిన భూములు పోతే బాధపడతారు… నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వను. రంపచోడవరంలో బ్రహ్మాండమైన రోడ్లు నిర్మిస్తున్నాం. 2022లో వరదల సమయంలో పోలవరం ప్రాంతంలో నేను పర్యటించాను. వరద బాధితులకు కనీసం భోజనం, నీళ్లు కూడా నాటి ప్రభుత్వం ఇవ్వలేదు. విశాఖలో హుద్ హుద్ వచ్చినప్పుడు వారం రోజులు అక్కడే ఉండి పరిస్థితి చక్కదిద్దాం. 2019 కూడా తర్వాత మా ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం 2020కి పూర్తయ్యేది. గత ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం వల్ల డయా ఫ్రమ్ వాల్ దెబ్బతినేలా చేశారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం పెంచుతామని హామీ ఇచ్చి మోసం చేశారు. గత పాలకులు అధికారులను మార్చారు… కాంట్రాక్టరును మార్చారు… ప్రాజెక్టును నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టాం… 2027 పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకిత చేస్తాం. గోదావరి – కావేరి నదుల అనుసంధానం జరుగుతుంది. గంగా – కావేరి నదుల అనుసంధానం కావాలనేది నా కోరిక. ఇది చేస్తే దేశంలో నీటి ఎద్దడి అనేది ఉండదు”అని ముఖ్యమంత్రి అన్నారు
చంద్రబాబు సీఎం అయ్యాకే మాకు మంచి రోజులు: నిర్వాసితులు
సీఎం చంద్రబాబు పోలవరం నిర్వాసితులతో నిర్వహించిన ముఖాముఖిలో నిర్వాసితులు తమ అభిప్రాయాలను… క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు. గతంలో పరిహారం, ఆర్ అండ్ ఆర్ పనులు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయనే అంశాన్ని సీఎంకు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద… తమ పరిహారం మీద తాము పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద… తమకు అందే పరిహారం మీద నమ్మకం కలిగిందని నిర్వాసితులు చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాకే… 23 నెలల కాలంలో నాలుగు విడతలుగా పరిహారం చెల్లింపులు జరుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కూడా గత పాలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్వాసితులు వివరించారు. పోలవరం నిర్వాసితులకు డబ్బులివ్వలేనని… తాను ఏం చేయలేనని నాటి సీఎం జగన్ చెప్పడంతో తాము ఆందోళన చెందామని పోలవరం నిర్వాసితులు వివరించారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలకు గత ప్రభుత్వం రోడ్లు కూడా వేయలేదని పలువురు ముంపు గ్రామాల ప్రజలు సీఎంకు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్వాసితులుగా తమను పట్టించుకోకపోవడమే కాకుండా… వరదల సమయంలో సర్వం కోల్పోయిన తమకు కనీసం బియ్యం పంపిణీ కూడా చేపట్టలేదంటూ నాడు జరిగిన సంఘటనలను సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, జలవనరుల శాఖ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలవరం జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News