Breaking News

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం
-ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు
-ప్రజల సహకారంపై ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సమీక్షలో ప్రశంసలు
-పొదుపు చర్యల్లో భాగంగా అధికారులతో సీఎం వర్చువల్ సమీక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గతేడాది జనవరి నుంచి నేటి వరకు ప్రతీ నెలా 3వ శనివారం నిర్వహిస్తోన్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం పరిశుభ్రత-పర్యావరణ విషయంలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల దగ్గర సంతోషం వ్యక్తం చేశారు. 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొంది, మరింత కష్టపడి పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై శుక్రవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి సమీక్షను ఆన్‌లైన్‌లో చేపట్టారు. మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఇంకా పలువురు ఐఏఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్ అధికారులు, సెర్ప్, మెప్మా, హెల్త్, పీసీబీ సహా సుమారు 150 మంది వరకు అధికారులు వర్చువల్‌గా సమీక్షలో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఇకపై అధికారులు రివ్యూలు సాధ్యమైనంత వరకు ఆన్లైన్ విధానంలో, లేదంటే హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని సీఎం ఈ సందర్భంగా కలెక్టర్లకు సూచించారు. అలాగే సాగునీటి విడుదలపై కార్యాచరణ సిద్ధం చేయాలని జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకు, కలెక్టర్లకు సీఎం సూచించారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ విజయాలు :

1. మన ప్రభుత్వం వచ్చాక 86 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్. మొత్తంగా ఈ 23 నెలల్లో 121 లక్షల టన్నుల చెత్త తొలగింపు. జూన్ కల్లా 100 శాతం క్లియర్.
2. డోర్ టు డోర్ కలెక్షన్ ద్వారా ప్రతీ రోజూ పట్టణాల్లో 7,527 టన్నులు, గ్రామాల్లో 1,430 టన్నుల చెత్త సేకరణ.
3. రూ.1,254 కోట్లతో 6 Waste-to-Energy ప్రాజెక్టులు, త్వరలో 6 CBG ప్లాంట్లు ఏర్పాటు.
4. చెత్త ప్రాసెసింగ్ కోసం రూ.603 కోట్లతో 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తాయి. అప్పుడు డంపింగ్ యార్డ్ అనేదే ఉండదు.
5. నెట్ జీరో లక్ష్యంలో భాగంగా నెట్ జీరో హెల్తీ క్యాంపస్ హాస్టళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్, కిచెన్ గార్డెన్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, కంపోస్టింగ్, వాటర్ టెస్ట్ కిట్స్, ముస్తాబు వంటి కార్యక్రమాల అమలు.
6. అన్ని పట్టణాల్లో ప్రతీ నెలా 10, 20 తేదీల్లో ఈ-వ్యర్థాలు సేకరణ. ఇప్పటివరకు 22 మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ సేకరణ.
7. చెత్త సేకరణకు 200 ఈ-ఆటోల వినియోగం. ఈ నెలాఖరు కల్లా కొత్తగా అందుబాటులోకి 5,000 పుష్ కార్ట్స్, 12,000 ట్రై సైకిళ్లు.
8. రాష్ట్రంలో ప్రస్తుతం 31.33 శాతానికి పెరిగిన గ్రీన్ కవర్‌. దీనిని 2030 నాటికి 37 శాతానికి, 2047 కల్లా 50 శాతానికి పెంచాలని లక్ష్యం.
9. 650 స్వచ్ఛ రథాలతో గ్రామాల్లో రోజుకు 125 టన్నుల పొడి చెత్త సేకరణ. ఇప్పటివరకు వ్యర్ధాలు డిపాజిట్ చేసిన వారికి రూ.8 కోట్ల విలువైన నిత్యావసరాల అందజేత.
10. కొత్తగా గ్రీన్ షాప్స్‌ ప్రారంభం. ప్రజలు అక్కడికి వెళ్లి ప్లాస్టిక్, ఐరన్ వంటి వ్యర్థాలను ఇచ్చి… తిరిగి తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు పొందే సౌలభ్యం.
11. ‘స్వచ్ఛ పథం’ పేరుతో ప్రతీ బుధవారం రహదారులు, డంపింగ్ యార్డులు శుభ్రం.
12. WOW – పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహణ.
13. నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరులో నిర్మాణంలో సర్క్యులర్ ఎకానమీ పార్కులు.
14. వినియోగంలోకి 50 ప్లాస్టిక్ వ్యర్థ యూనిట్లు. జూన్ నాటికి అందుబాటులోకి మరో 210 యూనిట్లు.
15. రాష్ట్రానికి పెద్దఎత్తున స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు
16. క్లైమేట్ యాక్షన్ విభాగంలో చిత్తూరు జిల్లా కందులవారిపల్లెకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అవార్డు.

పంచాయతీలకు అవార్డులపై సీఎం అభినందన

గ్రామీణాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విజయాలకు గ్రామస్థాయి సిబ్బంది, పంచాయతీ అభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజల సమిష్టి కృషి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లను ఈ సందర్భంగా అభినందించారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

జాతీయ పంచాయతీ అవార్డుల వివరాలు :

1. 2025వ సంవత్సరానికి… సుపరిపాలన విభాగంలో అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామపంచాయతీకి ప్రథమ స్థానం – రూ.1 కోటి పురస్కారం
2. 2025వ సంవత్సరానికి… మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామపంచాయతీకి ప్రథమ స్థానం – రూ.1 కోటి పురస్కారం
3. 2025వ సంవత్సరానికి… పేదరిక నిర్మూలన, జీవనోపాధి మెరుగుదల విభాగంలో కడప జిల్లా ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లి గ్రామపంచాయతీకి ద్వితీయ స్థానం – రూ.75 లక్షల పురస్కారం
4. 2025వ సంవత్సరానికి… స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల విభాగంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గుండమాల గ్రామపంచాయతీకి జాతీయ స్థాయిలో తృతీయ స్థానం – రూ.50 లక్షల పురస్కారం
5. 2025వ సంవత్సరానికి… నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్‌లో చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేశవ్యాప్తంగా మూడో స్థానం – రూ.1.5 కోట్ల పురస్కారం
6. 2026వ సంవత్సరానికి… క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయత్ విభాగంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె గ్రామపంచాయతీకి ప్రథమ స్థానం – రూ.1 కోటి పురస్కారం
7. 2026వ సంవత్సరానికి… పంచాయత్ క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ సంస్థాన్ పురస్కార్ విభాగంలో చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ దేశంలో ప్రథమ స్థానం – రూ.1 కోటి పురస్కారం
8. 2026వ సంవత్సరానికి… ఆత్మనిర్భర్ పంచాయత్ స్పెషల్ అవార్డు కింద చిత్తూరు జిల్లా ఇరాల మండలం కాణిపాకం గ్రామపంచాయతీకి ద్వితీయ స్థానం – రూ.75 లక్షల పురస్కారం

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రెండు రోజుల పాటు హైబ్రిడ్ పద్దతిలో మహానాడు

-పార్టీ కేంద్ర కార్యాలయంలో భౌతికంగా… జిల్లాల్లో వర్చువల్ గా మహానాడు -దేశ ప్రస్తుత పరిస్థితులు… ప్రధాని సూచనలతో మహానాడు నిర్వహణలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *