-ఆత్మనిర్భర్ లక్ష్యంలో ఆమ్కా ప్రాజెక్టు ముందడుగు
-36 రోజుల్లో జెట్ స్పీడ్ లో ఈ ప్రాజెక్టుకు అనుమతులు
-ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు ఉద్యమానికి ఏపీ సారధ్యం
-త్వరలో బంగారం ఉత్పత్తికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
-కేంద్ర మంత్రి రాజ్ నాధ్‌సింగ్‌తో కలిసి ఆమ్కా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
-ఏపీ అంటే అడ్వాన్స్డ్‌ప్రదేశ్ : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కితాబు
పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు సహా వివిధ డిఫెన్సు యూనిట్లతో దేశానికి రక్షణ కవచంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోని ఆమ్కా ప్రాజెక్టుతో ప్రధాని మోదీ ఆశిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆమ్కా ప్రాజెక్టు సహా ఇతర రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. డీఆర్డీఓలో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోని అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఇరువురు నేతలు ఆవిష్కరించారు. త్రివిధ దళాలకు రక్షణ ఉత్పత్తులను తయారు చేయనున్న కల్యాణీ స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఆధ్వర్యంలోని ఆగ్నేయాస్త్ర ఎనర్జిటిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్ సీఎల్ ప్రాజెక్టుల శిలాఫలకాలను కేంద్ర మంత్రితో కలిసి సీఎం ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలో ఏర్పాటు కానున్న 5 డ్రోన్ తయారీ, టెక్నాలజీ కంపెనీలను కూడా వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”సత్యసాయి బాబా బోధనలతో ఈ ప్రాంతం నుంచి విశ్వ శాంతికి బాటలు పడ్డాయి. ఇప్పుడు పుట్టపర్తిలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు రావటం ఎంతో కీలకంగా మారింది. దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా పుట్టపర్తి మారుతుంది. ఆమ్కా ప్రాజెక్టుతో ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యసాధనలో ఏపీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించటంతో పాటు బలోపేతం చేయటంపై ప్రధాని దృష్టి సారించారు. ఆధునిక తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేసేలా AMCA ప్రాజెక్టు ఏర్పాటు అవుతోంది. భారత రక్షణ శక్తిని ప్రపంచానికి చాటటంలో ఆపరేషన్ సింధూర్ ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఆపరేషన్ సింధూర్ లో వినియోగించిన డ్రోన్లు ఏపీలోనే తయారై, టెస్ట్ చేశారు. AMCA లాంటి ప్రాజెక్టును ఏపీకి కేటాయించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు ధన్యవాదాలు. రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టు వస్తుంది. ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్ తో పాటు ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రంగా పుట్టపర్తి మారుతుంది. అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేయటంలో రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాయి.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రోజుల వ్యవధిలోనే అమ్కా ప్రాజెక్టు సాకారం
“కేవలం 36 రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగలిగామని.. జెట్ స్పీడ్‌తో అనుమతులిచ్చామని సీఎం వివరించారు. ఏరోస్పేస్ రంగంలో కీలకమైన ఈ ప్రాజెక్టుతో పాటు మరికొన్ని డిఫెన్సు ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. భారత్ ఫోర్జ్, హెచ్ఎఫ్ సీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశాం. ఇటీవల యుద్ధాల్లో డ్రోన్లే కీలకంగా మారాయి. వ్యవసాయం నుంచి చాలా రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగింది. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీహరికోట అంతరిక్ష శక్తి, నాగాయలంకలో క్షిపణిశక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తితో మొత్తం దేశానికే రక్షణ కవచంగా ఏపీ నిలుస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చాకే రాయలసీమకు నీరిచ్చి లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నాం. రాయలసీమలో ఇనుప ఖనిజం, సున్నపురాయి లాంటి ఖనిజ వనరుల్ని సమర్ధంగా వినియోగించుకుంటాం. కడప స్టీల్ ప్లాంటు 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం. స్టీల్, సిమెంట్ ప్లాంట్లు, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, స్పేస్ , ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ లాంటి పరిశ్రమలతో రాయలసీమ రతనాల సీమగా మారుస్తాం. కొప్పర్తి పారిశ్రామిక నోడ్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మారుతుంది. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్, శ్రీహరి కోట సమీపంలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తాం. కియా పరిశ్రమ ఏటా 18 లక్షల కార్లు తయారు చేస్తోంది. కరవు సీమలో తయారైన కార్లు 80 దేశాల్లో తిరుగుతున్నాయి. రాయలసీమలోని ఆర్డీటీ సంస్థకు విదేశీ విరాళాల విషయంలో సమస్య ఉత్పన్నం అయితే కేంద్రంతో మాట్లాడి మంత్రి లోకేష్ ఆ సమస్యను పరిష్కరించారని” సీఎం వెల్లడించారు.
గతంలో కేజీఎఫ్ ఇప్పుడు జేజీఎఫ్
“త్వరలో కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ నుంచి బంగారం ఉత్పత్తి జరుగుతుంది. JGFలో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది. రెండో ఏడాది 1,500 కిలోల బంగారం తయారవుతుంది. రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తికి ఏపీ కీలకంగా మారుతుంది. సమర్ధవంతమైన నీటి నిర్వహణతో జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. అభివృద్ధిని బుల్లెట్ స్పీడ్ తో తీసుకెళ్తున్నాం. అవకాశాలు తెచ్చే బాధ్యత మాది. వాటిని అందిపుచ్చుకునే బాధ్యత యువతది. గత పాలనలో విధ్వంసం చేశారు. పరిశ్రమలు తరిమేశారు. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మళ్లీ ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించాం. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటివల్ల 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఇక్కడే ఉద్యోగాలు రావాలి, ఇతరులకూ ఇక్కడే ఉపాధి కల్పించేలా పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రాజెక్టులు వచ్చాయి. రిలయన్స్, బీపీసీఎల్ లాంటి ప్రాజెక్టులు వస్తాయి.
విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా మూడు ఎకనామిక్ రీజియన్లలో పెట్టుబడులు వస్తాయి. చిప్ నుంచి షిప్ వరకూ మన దేశంలోనే తయారు కావాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు.
ఏపీలో డిజైన్ చేయండి, పెట్టుబడులు పెట్టండి, ఉత్పత్తులు తయారు చేయండి అని పారిశ్రామిక వేత్తల్ని కోరుతున్నాను. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏపీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం… వేగంగా అనుమతులు ఇస్తున్నాం. దేశానికి తిరుగులేని శక్తిగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తయారవుతాయి.” అని ముఖ్యమంత్రి వివరించారు.
నాదేశం- నాబాధ్యత
“పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం మనపై కూడా పడిందని…ఇంధనం, బంగారం కొనుగోలుతో విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయని సీఎం అన్నారు. దేశానికి ఆర్ధిక భద్రత కూడా అత్యంత కీలకమని..ఇతర దేశాలు కూడా పొదుపు చర్యలు చేపట్టాయని తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన 7 అంశాలను ఆచరిద్దాం. పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నాం. దీనిపై ఓ కార్యాచరణను కూడా తీసుకువచ్చాం. వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి అంశాలను అమల్లోకి తీసుకు రావాలని కోరుతున్నాను. ప్రతీ భారతీయుడూ ప్రస్తుత సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలి. ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు ఉద్యమానికి ఏపీ సారధ్యం వహించాలని” ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఏపీ ఇక అడ్వాన్స్ డ్ ప్రదేశ్- రాజ్ నాధ్ సింగ్
ఆమ్కా ప్రాజెక్టు ఏపీ సహా దేశ రక్షణలో ఓ చారిత్రాత్మక అధ్యాయాన్ని జోడిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీలతో పాటు రక్షణ రంగ పరిశ్రమల్ని ఆకర్షిస్తున్న ఏపీ పేరు అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. 5 జనరేషన్ ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాల్ని తయారు చేస్తున్న రాయలసీమను మిలటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సుగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. రూ.15 వేల కోట్ల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఇలాంటి ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రాలు కేవలం కొద్దిదేశాల వద్ద మాత్రమే ఉన్నాయని.. ఇప్పుడు భారత్ కూడా ఆ సరసన చేరిందని అన్నారు. అమ్కా ప్రాజెక్టుతో తయారైన ఆధునిక యుద్ధ విమానాలు మన రక్షణ శక్తిని చాటేలా మన గగనశక్తిని చాటేలా పుట్టపర్తి నుంచి టేకాఫ్ అవుతాయని కేంద్ర మంత్రి వివరించారు. ఆ తరహా యుద్ధ విమానాలను పుట్టపర్తి నుంచి తయారు చేయబోతున్నామని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా రూ.480 కోట్లతో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ వ్యవస్థలను, టార్పెడోలను ఉత్పత్తి చేస్తుందన్నారు. ఇప్పటి వరకూ దిగుమతి చేసుకుంటున్న చాలా పరికరాలను కూడా స్వదేశీయంగా తయారు చేసుకోగలమని చెప్పారు.
7 సంస్థలతో ఒప్పందాలు
అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, సీఎం చంద్రబాబు సమక్షంలో 7 సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. రూ. 4460 కోట్ల పెట్టుబడులు, 6400 మందికి ఉద్యోగాలు కల్పించేలా ఈ ఒప్పందాలు కుదిరాయి. భారత్ ఫోర్జ్, రఘువంశీ మెషీన్ టూల్స్ , సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ , ఎన్ఐబీఈ గ్రూప్, పీఎంటీ డిఫెన్స్, చక్రవ్యూహ్ డైనమిక్స్ , ఇండస్ బ్రిడ్జ్ వెంచర్స్ సంస్థలు ఈ ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ఆమ్కా ప్రాజెక్టులో నిర్మితం కానున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నమూనాతో పాటు భారత్ డైనమిక్స్ సహా వేర్వేరు సంస్థలు ఏర్పాటు చేసిన మిస్సైళ్లు, హ్యాండ్ గ్రెనేడ్ లు, టార్పెడో నమూనాలు, ఆధునిక తుపాకుల ప్రదర్శనను కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో కలిసి సీఎం తిలకించారు. శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, సవిత, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఏపీ సలహాదారు సతీష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News