– అచీవర్ (ఏ ప్లస్) స్థాయిని నిలబెట్టుకోవాలి
– సూచికల్లో ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి
– స్వర్ణాంధ్ర విజన్ కేపీఐల సమీక్షలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర విజన్ @ 2047కు సంబంధించిన కీలక ప్రగతి సూచికల లక్ష్యాలను అన్ని శాఖలు పూర్తిస్థాయిలో సాధించాలని, ఏ ప్లస్ స్థాయిని నిలబెట్టుకునేందుకు కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. కీలక ప్రగతి సూచికల్లో జిల్లా ముందంజలో ఉందని.. ఇదే స్ఫూర్తితో జిల్లాను సమగ్రాభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషిచేయాలన్నారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర విజన్ – కేపీఐల లక్ష్యాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాస్థాయి స్కోరు 90 ఉందని.. దీన్ని ఇంకా మెరుగుపరుచుకొని ప్రగతి పథంలో పయనించేలా చూడాలన్నారు. కంచికచెర్ల, వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం తదితర ఏ గ్రేడు మండలాలు ఏ ప్లస్ గ్రేడ్ సాధించేందుకు కృషిచేయాలని.. సూచికల వారీగా ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ముందడుగు వేయాలన్నారు. వివిధ శాఖల్లో కొన్ని సూచికల్లో ఇంకా బి,సి గ్రేడులలో ఉన్నాయని, ఇవి తప్పనిసరిగా ఏ గ్రేడ్ లోకి రావాలని ఆదేశించారు. సాధించిన ప్రగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ.. ప్రకృతి సేద్యం, పంటల బీమా, నూనె గింజల సాగు తదితర సూచికలపై దృష్టిపెట్టాలని.. అదేవిధంగా కౌలు రైతులకు రుణాలు సకాలంలో మంజూరయ్యేలా చూడాలన్నారు. ఇదేవిధంగా పాఠశాల విద్య, పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమం తదిత శాఖలు ఆయా శాఖలకు సంబంధించిన సూచికల్లో ప్రతి ఒక్కటీ అచీవర్ స్థాయికి చేరుకునేలా క్షేత్రస్థాయి అధికారులతో కలిసి సమష్టిగా సరైన కార్యాచరణ ప్రణాళికతో కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సమావేశంలో గణాంక అధికారి డీవీఎస్ఆర్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News