Breaking News

నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి

-ఆంధ్రా కార్పొరేట్ దిగ్గజాల హస్తముందనే ప్రచారం
-మాఫియా, అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలి
-ఎన్‌టీఏ సమగ్ర ప్రక్షాళన చేయాలి
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీట్-2026 పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని, పేపర్ లీక్ కి పాల్పడిన మాఫియా, అధికారులు, మధ్యవర్తులు, సంబంధిత సంస్థలపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
నీట్ లీక్ ల వ్యవహారంలో ఆంధ్రా కార్పొరేట్ దిగ్గజాల హస్తం ఉందనే ప్రచారం జోరుగా కొనసాగుతోందని, ఆ దిశగా రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్-2026 పేపర్ లీక్ అయిన ఘటన అత్యంత దారుణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది..కేవలం పేపర్ లీక్ కాదని, విద్యార్థుల భవిష్యత్తును అమ్ముకునే విద్యా మాఫియా కుట్ర అని అన్నారు. రాజస్థాన్‌లోని సికర్ ప్రాంతం నుంచి ఈ లీక్ ల నెట్‌వర్క్ బయటపడినట్లుగా సమాచారం ఉందన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల ద్వారా ఈ పేపర్ ప్రచారం అయిందని, తర్వాత అసలు నీట్ ప్రశ్నాపత్రంతో దానిని పోలిస్తే..100కు పైగా ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయని ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. పరీక్షలను సరిగ్గా నిర్వహించలేని రీతిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఉందని, తక్షణమే దానిని ప్రక్షాళన చేయాలన్నారు. దేశంలో ఇప్పటికే నిరుద్యోగం, కార్పొరేట్ విద్యా వ్యవస్థ, కోచింగ్ మాఫియా భారంతో ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులపై ఇది మరో మోసపూరిత దాడి అని తెలిపారు. పరీక్షకు ముందు ప్రశ్నాపత్రం బయటకు రావడం, అనేక ప్రశ్నలు అసలు పరీక్షతో సరిపోవడం, తదనంతరం పరీక్ష రద్దు వరకు వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే, డబ్బు, అవినీతి, కోచింగ్ మాఫియా, రాజకీయ సంబంధాల ఆధారంగా కొందరికి ప్రశ్నాపత్రాలు చేరడం అత్యంత ప్రమాదకర పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఏలో కొనసాగుతున్న అవినీతి, నిర్లక్ష్యం, ప్రైవేటీకరణ ధోరణులపై పూర్తిస్థాయి ప్రక్షాళన చేపట్టాలని, విద్యార్థుల మానసిక వేదన, ఆర్థిక నష్టానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, భవిష్యత్తులో జాతీయ స్థాయి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేలా బలమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, కోచింగ్ కార్పొరేట్ మాఫియాపై కేంద్ర ప్రభుత్వం కఠిన నియంత్రణలు విధించాలని, దేశ విద్యార్థులు,యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న పాలకుల వైఖరిని ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *