Breaking News

20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనకు ఎంఎస్ఎంఈలు కీలకం

-“మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్” మన లక్ష్యం
-23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలు కల్పించే 800 ప్రాజెక్టులతో ఒప్పందాలు
-మూడు నెలల్లో 100 కంపెనీలు ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యేలా ఎంఎస్ఎంఈ శాఖ పని చేయాలి
-ఎన్ఎస్ఈ, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సిఐఐ నిర్వహించిన ఎస్ఎంఈ ఐపిఓ అవగాహన సదస్సులో మంత్రి నారా లోకేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్” లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (NSE), ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన “SME IPO – Alternative Funding Option For Growth” అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈలకు మూలధన మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

యువగళం పాదయాత్రే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ప్రేరణ
యువగళం పాదయాత్రలో తనకు ఎదురైన ఒక సంఘటన 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ప్రేరణగా నిలిచిందని మంత్రి లోకేష్ తెలిపారు. “226 రోజులు, 3132 కిలోమీటర్లు నడిచిన యువగళం పాదయాత్రలో ఎన్నో కుటుంబాల కష్టాలు, ఆశలు, ఆకాంక్షలను దగ్గరగా చూశాను. ఒకరోజు పెనుగొండలో కియా వద్ద సెల్ఫీలు దిగేందుకు దారుణమైన ఎండల్లో 23 కి.మీ నన్ను జాతీయ రహదారిపై నడిపించారు. అక్కడే కియా అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న పద్మావతి అనే చెల్లి నాతో కలిసి నడిచింది. కియా, అనుబంధ పరిశ్రమలు రాకముందు ఆమె గృహిణి. బాగా చదువుకుంది కానీ ఉద్యోగం చేయలేదు. కియా అనుబంధ సంస్థలు వచ్చిన తరువాత కుటుంబ సభ్యులను ఒప్పించి ఉద్యోగంలో చేరింది. నెలకు రూ.30 వేలు సంపాదిస్తోంది. అప్పటివరకు భర్త మీద ఆధారపడిన ఆమె, ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని కూడా చూసుకుంటోంది. ఆమె కథ విన్న తరువాత నాకు ఉద్యోగ కల్పన ఎంత ముఖ్యమో అర్థమైంది. ఆ ఆలోచనల నుంచే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం పుట్టింది. మేము ఇచ్చిన మ్యానిఫెస్టో ‘సూపర్ 6’ హామీల్లో కూడా మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పనే. ఈ లక్ష్య సాధన కోసం అందరం పని చేస్తున్నాం.” అని పేర్కొన్నారు.

పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్
“గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌లా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు కుదిరాయి. గూగుల్ రూ.1.35 లక్షల కోట్లు, ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చాయి. వాటికి శంకుస్థాపనలు జరిగాయి. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. రాయలసీమలోని పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కేంద్రం ‘AMCA’ ప్రాజెక్టు కూడా ఏపీలో ఏర్పాటు కానుంది” అని వెల్లడించారు.

గూగుల్ వల్లే క్యారియర్ ఏపీకి వచ్చింది – ఇదే మల్టిప్లయర్ ఎఫెక్ట్
“ప్రతి పెట్టుబడి వెనుక ఒక ప్రత్యేక కథ ఉంటుంది. డేటా సెంటర్లు వస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయని చాలా మంది నన్ను ప్రశ్నించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా డేటా సెంటర్లు ఏర్పాటుకు విశాఖ నగరానికి అనేక కంపెనీలు క్యూ కట్టాయి. ఇప్పటికే గూగుల్ కంపెనీ శంకుస్థాపన జరగగా, మరికొద్ది రోజుల్లో ఇంకో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానుంది. దానికి కూడా మంత్రివర్గం త్వరలో ఆమోదం తెలపనుంది. డేటా సెంటర్ ఎంత ముఖ్యమో, డేటా సెంటర్‌కు కావాల్సిన ఎకోసిస్టమ్ కూడా అంతే ముఖ్యం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కావడంతోనే రాయలసీమకు క్యారియర్ కంపెనీ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ నిర్వహణకు భారీ స్థాయిలో కూలింగ్ సిస్టమ్స్ అవసరం అవుతాయి. ఆ అవసరాన్ని తీర్చేందుకు క్యారియర్ కంపెనీ శ్రీసిటీలో పెట్టుబడులు పెడుతోంది. దీనినే మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు. ఒక పెద్ద పెట్టుబడి వస్తే, దాని చుట్టూ అనేక అనుబంధ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. పెద్ద కంపెనీలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. వాటిని సపోర్ట్ చేయాలంటే ఎస్ఎంఈలు చాలా ముఖ్యం. కంపెనీల టర్నోవర్‌లను పెంచే సామర్థ్యం మీ వద్ద ఉంది. మా ప్రభుత్వానికి ఎస్ఎంఈలపై బాధ్యత ఉంది. వారిని ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ శాఖ కృషి చేస్తుంది” అని వివరించారు.

క్లస్టర్ మోడల్‌తో అభివృద్ధి వికేంద్రీకరణ
“మొదటిసారిగా మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కలిసికట్టుగా పని చేస్తున్నాం. ‘ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ’ ప్రభుత్వ లక్ష్యం. మన ఎకానమీ 200 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. దాని కోసం క్లస్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్ల అభివృద్ధి ప్రణాళిక రూపొందించాం. రాయలసీమలో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టికల్చర్; కోస్తాంధ్రలో CBG ప్లాంట్లు, ఆక్వా; అమరావతిలో క్వాంటం టెక్నాలజీ; ఉత్తరాంధ్రలో ఫార్మా, డేటా సెంటర్లు, మెడికల్ ఎక్విప్‌మెంట్, ఐటీ రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టాం. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈలు కీలకం
“పెద్ద కంపెనీలతో పాటు ఎంఎస్ఎంఈల అభివృద్ధి కూడా ముఖ్యం. నాకు గూగుల్ ఎంత ముఖ్యమో, రూ.50 లక్షలతో ప్రారంభమయ్యే ఎంఎస్ఎంఈ కూడా అంతే ముఖ్యం. నాకు ఆర్సెలార్ మిట్టల్ ఎంత ముఖ్యమో, కోటి రూపాయలతో ప్రారంభమయ్యే చిన్న సంస్థ కూడా అంతే ముఖ్యం. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం సాధించాలంటే ఎంఎస్ఎంఈల పాత్ర కీలకం. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొనే సమస్యలు ప్రభుత్వానికి తెలుసు. అందుకే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు అడుగులు వేస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం పేపర్ మీదో లేదా పెద్ద కంపెనీల వరకే పరిమితం కాకూడదు. ప్రతి ఎంఎస్ఎంఈకి అది వర్తించాలి. అనుమతుల నుంచి రాయితీల వరకు అన్ని ప్రక్రియలను సరళీకృతం చేస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్లు ఎక్కడికీ వెళ్లకుండా అన్ని అనుమతులు ఆన్‌లైన్‌లోనే ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష. రాష్ట్రంలోని చిన్న కంపెనీలు పెద్ద సంస్థలుగా ఎదగాలి. ‘మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్’ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు 20 లక్షలకు పైగా ఉన్నాయి. వాటన్నింటినీ ప్రోత్సహించే బాధ్యత ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిదే. ఇది సాధ్యం కావాలంటే ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు కావాలి. ఔత్సాహికవేత్తలుగా తయారవ్వడం తెలుగువారి రక్తంలోనే ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు ‘ఆంధ్రప్రెన్యూర్’ అని చంద్రబాబు నామకరణం చేశారు. ఈ సెమినార్ చూస్తుంటే నాకు 1995 రోజులు గుర్తుకొస్తున్నాయి. నాడు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనేక సెమినార్లు నిర్వహించి కంపెనీలను ప్రోత్సహించారు. అందులో భాగంగానే జీఎంఆర్ గ్రూప్ సంస్థకు ఎయిర్‌పోర్ట్ నిర్మాణ బాధ్యతలను అప్పగించి ప్రోత్సహించారు. ఫార్మా, రియల్ ఎస్టేట్, ఐటీ, సైన్సెస్, బయోటెక్ వంటి అన్ని రంగాల్లో అనేక పరిశ్రమలను ప్రోత్సహించి వాటి అభివృద్ధికి కృషి చేశారు. తిరిగి ఆ మ్యాజిక్‌ను చేయగలిగే సత్తా మనందరిలో ఉంది. ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వాటి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అదే ప్రభుత్వ లక్ష్యం” అని తెలిపారు.

మూడు నెలల్లో 100 కంపెనీలు NSEలో లిస్ట్ అవ్వాలి
“NSE ద్వారా చిన్న కంపెనీలు పెద్ద సంస్థలుగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు NSEలో 723 కంపెనీలు లిస్టై రూ.22,415 కోట్ల నిధులు సమీకరించాయి. అందులో 158 సంస్థలు మెయిన్ బోర్డుకు చేరాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు కేవలం మూడు సంస్థలు మాత్రమే NSEలో లిస్ట్ అయి రూ.100 కోట్ల నిధులు సమీకరించాయి. వచ్చే మూడు నెలల్లో కనీసం 100 కంపెనీలు NSEలో లిస్ట్ అవ్వాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ శాఖ పనిచేయాలి” అని సూచించారు.

ఔత్సాహికవేత్తల్లో పోటీతత్వం.. పట్టుదల ఉండాలి
“మేము ఏదైనా సాధిస్తే, మమ్మల్ని ఐదు నిమిషాలు కూడా చంద్రబాబు సంతోషంగా ఉండనివ్వరు. చంద్రబాబుతో పని చేయడం చాలా కష్టం. మేము ఎక్కడ విశ్రాంతి తీసుకుంటామోనని ఎప్పుడూ మాకు ఏదో ఒక పని అప్పగిస్తుంటారు. ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు ఎదుర్కొనే కష్టాలు నాకు బాగా తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయగాథను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ‘హెరిటేజ్‌కు ముందు చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా వెనక్కి తగ్గలేదు. 34 సంవత్సరాల కృషితో హెరిటేజ్‌ను విజయవంతం చేశారు. అంచెలంచెలుగా హెరిటేజ్ సంస్థ ఎదిగింది. రాత్రికి రాత్రే విజయం రాదు. కష్టపడాలి. నాణ్యమైన ఉత్పత్తులు ఇవ్వాలి. అప్పుడే పోటీలో నిలబడగలం. చంద్రబాబు 30 సంవత్సరాల ముందుచూపుతో ఉంటారు. మన అమ్మ ప్రేమతో పెరిగినా, కొన్ని సంవత్సరాలకి నాన్న కష్టం, విలువ ఏమిటో అర్థమవుతుంది. చంద్రబాబు కూడా రాష్ట్రానికి తండ్రిలాంటి వారు. హైదరాబాద్‌లో ఐటీ అంటే కంప్యూటర్లు కూడు పెడతాయా అని అవహేళన చేశారు. నేడు హైదరాబాద్ ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాం. అలానే ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యాన్ని కూడా మనం సాధించగలం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టి ఔత్సాహికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంపీలు కృషి చేయాలి. భవిష్యత్ ఔత్సాహికవేత్తలను తయారు చేసే బాధ్యత మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ది. వేరే రాష్ట్రాలను చూసి అసూయ పడడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే ప్రపంచం మన రాష్ట్రం వైపు చూస్తోంది. దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికి రావడం గర్వకారణం. పారిశ్రామికవేత్తలకు ఏ కష్టం వచ్చినా ఒక మెసేజ్ దూరంలో నేను ఉంటా. పరిశ్రమలకు డోలో టాబ్లెట్‌లా పని చేస్తా. ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న కంపెనీలు ప్రపంచ స్థాయి పెద్ద సంస్థలుగా ఎదగాలి. మరిన్ని ఉద్యోగాలు, మరిన్ని పారిశ్రామికవేత్తలు, మరిన్ని విజయగాథలు సృష్టిద్దాం” అని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు NSE సీఈఓ, ఎండీ ఆశిష్ కుమార్ చౌహాన్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, కేశినేని శివనాథ్ (చిన్ని), ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఓ ఎం. విశ్వ, SEBI, NSE, ఇండోరెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, స్టీల్ సిటీ సెక్యూరిటీస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *