-గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీపై దృష్టి
-మ్యూల్ అకౌంట్ హంటర్ ఏఐ లాంటి టూల్స్ వినియోగం
-ఆధార్ సహా బయోమెట్రిక్స్ ద్వారా సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు
-సైబర్ మోసాలపై ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించాలి
-సైబర్ నేరాల్లో తక్షణ స్పందన- నియంత్రణా వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేరాల ద్వారా బాధితుల సొమ్మును రాబట్టేందుకు గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ టెక్నాలజీలపై దృష్టి పెట్టాలని పోలీసు అధికారులు, బ్యాంకింగ్ అధికారులకు సూచనలు ఇచ్చారు. సచివాలయంలో బుధవారం సైబర్ నేరాల్లో తక్షణ స్పందన- ఏపీలో నియంత్రణా వ్యవస్థలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్ధిక నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఇతరుల బ్యాంక్ ఖాతాలను వినియోగించకుండా చేపట్టే చర్యలు, గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. ఏపీలో సైబర్ నేరాలు, ఆర్ధిక నేరాలు జరగకుండా బ్యాంకులు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై రిజర్వు బ్యాంకును సంప్రదించాలని సీఎం సూచించారు. ఆర్ధిక, సైబర్ నేరాల్లో ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయనే అంశంపై సీఎం కొన్ని సూచనలు చేశారు. ఆథార్ ఆథంటికేషన్, కేవైసీ లాంటివి లేకుండా షెల్ కంపెనీలను కొందరు ప్రారంభిస్తున్నారని… ఇలాంటి ఘటనలపై అధ్యయనం చేయాలన్నారు. బ్యాంకర్లు, పోలీసు విభాగం, ఏపీటీఎస్, ఆర్ధిక శాఖలు సమన్వయంతో ఆన్ లైన్ ఆర్ధిక మోసాల విషయంలో ఓ నియామవళిని సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. అనుమానిత మ్యూల్ బ్యాంకు ఖాతాలను ఫ్లాగ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ సైబర్, ఆర్ధిక నేరాల్లో ఖాతాదారుల ప్రయోజనాలు రక్షించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
సైబర్ ఫ్రాడ్స్ నుంచి రక్షణకు టెక్నాలజీ టూల్స్
యూపీఐ పేమెంట్స్ ద్వారా మిలియన్ల సంఖ్యలో ఆర్ధిక లావాదేవీలు క్షణాల్లో జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ అంశంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశంపై మరిన్ని సాంకేతికపరమైన నూతన ఆవిష్కరణలు రావాల్సి ఉందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సైబర్ నేరాల నియంత్రణలో ఏపీటీఎస్ ముఖ్య భూమిక పోషించాలని… జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీలను అధ్యయనం చేయాలని సూచించారు. అన్ని బ్యాంకులు వారాంతాల్లో పెద్ద మొత్తంలో జరిగే ఆర్ధిక లావాదేవీలపై దృష్టి పెట్టాలన్నారు. కొన్ని నిబంధనల్ని మార్చుకునే విషయంలో రిజర్వు బ్యాంకును సంప్రదించాలని అన్నారు. రిజర్వు బ్యాంకు తీసుకువచ్చిన మ్యూల్ ఆకౌంట్ హంటర్ ఏఐ లాంటి టూల్స్ ను నకిలీ ఖాతాలను గుర్తించేందుకు వినియోగించాలన్నారు. హర్యాణా, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో ఉత్తమ విధానాల్ని అధ్యయనం చేసి ఓ నిర్దుష్టమైన కార్యాచరణ సిద్ధంచేయాలన్నారు. దీంతో పాటు సైబర్, ఆన్ లైన్ ఆర్ధిక మోసాలపై ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా ప్రభుత్వ వెబ్ సైట్లకు రక్షణ
ఏపీలో సైబర్, ఆర్ధిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదులు వచ్చినట్టు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. సైబర్, ఆర్ధిక నేరాల బారిన పడి ఏపీలో ఇప్పటి వరకూ రూ.652 కోట్లను బాధితులు కోల్పోయినట్టు తెలిపారు. సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం-బ్యాంకర్లతో కలిసి రూ.116 కోట్ల పైచిలుకు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లకు చేరకుండా కాపాడగలిగామని స్పష్టం చేశారు. పిషింగ్, విషింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు, ఆన్ లైన్ లోన్ ఫ్రాడ్స్ సహా డిజిటల్ అరెస్టుల్లో బాధితులు సొమ్మును కోల్పోతున్నట్టు అధికారులు తెలిపారు. సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో సీఐడీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పని చేస్తోందని.. విజయవాడ, విశాఖ, తిరుపతిలలో సైబర్ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు ఏపీలో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా డేటాకు రక్షణ కల్పిస్తున్నామని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సీఎంకు వివరించారు. ఈ సమీక్షకు మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఏపీ ఫోరెన్సిక్స్ సలహాదారు కెపీసీ గాంధీ, రిజర్వు బ్యాంకు సహా వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News