-ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థుల అడుగులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“బడి పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా విజయవాడ నియోజకవర్గంలో చైతన్య విద్యా రథయాత్రను ఘనంగా పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రభుత్వ విద్యపై అవగాహన పెంపొందించి, ప్రభుత్వ పాఠశాలల్లో అధిక సంఖ్యలో ప్రవేశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ యాత్ర చేపట్టబడింది.
ఉదయం 8 గంటలకు జీఎన్ఆర్ హైస్కూల్ నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్, డీఎస్ఎం హై స్కూల్, భవానిపురం, ఎస్ ఎం ఏకే హైస్కూల్, స్వాతి సెంటర్, ఊర్మిళా నగర్, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్ట్, కేఎల్ రావు నగర్, అన్నపూర్ణాదేవి పాఠశాల, కొత్తపేట ఎస్కేపీవీ హిందూ పాఠశాల, ఎంఏఎంసీ పాఠశాల మీదుగా గాంధీజీ పాఠశాల వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందడం విశేషంగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్య, ఆధునిక సౌకర్యాలు, మౌలిక వసతులు, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేయడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఈ చైతన్య యాత్రలో విజయవాడ వెస్ట్ మండలంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్లు, సమగ్ర శిక్ష సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
Prajavartha Online Telugu News