Breaking News

జనసేన లక్ష్యదళ్, నిర్వాహక్ దళ, పరిపాలక్ దళ్ లు సమర్థంగా పార్టీని నడిపిస్తాయి

-సంస్థాగత నిర్మాణంతో జనసేనకు కొత్త బలగం
-కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగేందుకు జనసేన వేదిక
– అన్ని విభాగాలకు, నియోజకవర్గాలకు ప్రత్యేక కమిటీలు
-తమిళనాడు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు
-జనసేన ఏడు సిద్ధాంతాల భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-కూటమి పొత్తులో జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం తగ్గించను
-స్థానిక సంస్థల ఎన్నికలకు బలంగా ముందుకు వెళ్దాం
-ప్రధాన మంత్రి మోదీ  చెప్పే పొదుపు చర్యలు పాటిద్దాం
-జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘జనసేన పార్టీ – సిద్ధాంతాల మీద ముందుకు నడిచే పార్టీ. సిద్ధాంత భావజాలం మాత్రమే మనందరినీ ఐక్యం చేయాలి. ఓ కుటుంబమో, ఓ వ్యక్తో పార్టీని నడిపించే పద్ధతి ఉండకూడదు. జనసేన ఏడు సిద్ధాంతాలను జాగ్రత్తగా అర్ధం చేసుకొని ముందుకు నడిపించే పార్టీ సంస్థాగత సైన్యాన్ని తయారు చేసేందుకు నాకు పుష్కరకాలం పట్టింది. ఈ స్ఫూర్తిని మరింత సమర్థంగా, సమన్వయంతో నడిపించాల్సి బాధ్యత జన సైనికులు, వీర మహిళలపైనే ఉంద’ని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  పునరుద్ధాటించారు. 2007 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ అప్పటికప్పుడు పదవులు తీసుకోవాలనే ఆలోచన లేదు. బాగా నలగాలి.. ప్రజల్లో నడవాలి.. ప్రజలు నమ్మాలి అనే ఆలోచనతోనే 2018 వరకు క్రియాశీలక ఎన్నికల రాజకీయాలు చేయలేదని, 2019లో బలమైన నమ్మకంతో పోటీ చేసినా ఆశించిన ఫలితం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ రాజకీయాల్లో బలమైన సైద్ధాంతిక మార్పు తీసుకురావాలనే ఆకాంక్షతో జనసేన ప్రయాణం మరింత పట్టుదలతో చేశామని చెప్పారు. జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశం మంగళగిరిలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “జనసేన పార్టీ ఈ 12 ఏళ్ల కాలంలో ఎంత బలమైన భావజాలం కలిగిన నాయకత్వాన్ని తయారు చేసిందంటే విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన సభలో నేనే మా ఊరికి పవన్ కళ్యాణ్ అనే ధైర్యంగా యువతను తయారు చేశాం. విజయనగరంలో హుస్సేన్ అనే ఓ మధ్యతరగతి యువకుడు నిస్వార్థంగా ప్రతి మంగళవారం ప్రజా సమస్యల్ని అధికారులకు చెప్పడంతో మంగళవారం హుస్సేన్ గా పేరు పడిపోయాడు. బాబురావు అనే ఏజెన్సీ ప్రాంతానికి చెందిన యువకుడు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయి మావోయిస్టుల్లో కలిసిపోదాం అనుకున్న సమయంలో జనసేన పార్టీ భావజాలాన్ని నమ్మి ప్రజాస్వామ్యహితంగా పోరాడి ఉప సర్పంచ్ అయ్యాడు. ఓ నల్లమల యూరేనియం సమస్యను తీసుకొచ్చిన శివ, కర్ణాటకలో అవినీతి మీద పోరాటం చేయడానికి జనసేన పార్టీ అండ కావాలని అడుగుతున్న ఓ వీర మహిళ వంటి వారిని… జనసేన పార్టీ సమాజాన్ని కాపాడే ఆయుధాలుగా తయారు చేసింది. ఈ పుష్కర కాలంలో జనసేన ఓ నిండు భావజాలాన్ని నమ్మే ఓ సమూహాన్ని తయారు చేసింది. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధమైన వ్యక్తులను తయారు చేశాం. ఆఖరికి ఉత్తరప్రదేశ్ లో కూడా జనసేన పార్టీ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమయ్యే సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
• కార్యకర్తలే పార్టీకి బలమైన పునాదులు
జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా అన్ని విభాగాల్లోనూ తగిన కమిటీలు, బాధ్యతలు ఉంటాయి. జనసేన లక్ష్య దళ్ పేరుతో క్షేత్రస్థాయిలో పని చేసే ప్రధాన బలాన్ని, బలగాన్ని తయారు చేస్తాం. జనసేన భావజాలాన్ని వీరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. అలాగే క్షేత్రస్థాయిలో గుర్తించే అంశాల మీద, పార్టీ విధానాన్ని ముందుకు నడిపించేలా జనసేన నిర్వాహక్ దళ్ పనిచేస్తుంది. పార్టీకి సంబంధించిన విధానాలు, అంశాలు రూపొందించేలా, జనసేన లక్ష్యదళ్, నిర్వాహక్ దళ్ ను సమన్వయం చేసుకుని, పరిపాలనపరమైన విషయాలు చూసేలా జనసేన పరిపాలక్ దళ్ పనిచేస్తుంది. పార్టీకి మొదటి నుంచి అండగా నిలిచిన వారు, ఎవరు నన్ను వదిలేసినా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పని చేస్తున్న వారు అందరికీ తగిన న్యాయం జరుగుతుంది. నియోజకవర్గాల వారీగా కూడా ఓ ఇంఛార్జితోపాటు ఫైవ్ మెన్ కమిటీ ఉంటుంది. వీరిలోనూ వివిధ బాధ్యతలు సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, కోశాధికారి వంటివి ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని మరింత ముందుకు నడిపించేలా ఈ కమిటీలన్నీ సమన్వయంతో పనిచేయాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం పూర్తిగా సిద్ధాంతపరమైన భావజాలం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కు పనిచేసిన బీఎల్ సంతోష్ తన రాజ్యసభ పదవీకాలం అయిపోగానే మళ్లీ ఆర్ఎస్ఎస్ సాధారణ నాయకులుగా మారిపోయి పనిచేస్తారు. అలాంటి గొప్ప సైంద్ధాంతిక బలం జనసేనకు ఉండాలి. జనసేన ప్రాంతీయ పార్టీ అయనప్పటికీ దేశ ప్రయోజనాలు, దేశ ఉన్నతి, దేశ సమగ్రతను కోరుకునే ఆలోచనతో ఉంటుంది.
ఒకప్పుడు 150 మందితో మొదలైన జనసేన ప్రస్థానం నేడు 21.05 లక్షల మందితో ఓ అతి పెద్ద సమూహంగా మారింది. ప్రతి కార్యకర్త నాయకుడుగా మారడానికి జనసేన పార్టీ వేదిక అవుతుంది. విభాగాలకు సమన్వయకర్తగా కాకుండా సంధాతగా పేరు పెట్టాం. అలాగే ఏవైనా సమస్యలు ఉంటే తీర్చేందుకు వివాద విమోచన మండలి ఉంటుంది. ఏ సమస్య అయినా మీలో మీరు తీర్చుకునేలా నియోజకవర్గ స్థాయిలో ఇది పనిచేస్తుంది. మొదటి 30 నియోజకవర్గాల్లో నేను త్వరలో ఈ విభాగాలను ప్రారంభిస్తాను.
• నా ఆరోగ్యం బాగుంది
ఇటీవల కాలంలో నా ఆరోగ్య ఇబ్బందులతో కొంతకాలం మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కరోనా సమయంలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అలాగే ఉండిపోవడంతో అది సైనస్ గా మారింది. దుమ్ము, ధూళిలో తిరగడంతో అది మరింత తీవ్రమైంది. అలాగే భుజాలకు సంబంధించిన నొప్పి తీవ్రం అయింది. మీ ప్రేమతో దగ్గరకు వచ్చినపుడు నన్ను గట్టిగా లాగేయడంతో భుజాలకు సమస్య ఏర్పడింది. దీంతో పాటు స్పైనల్ కార్డ్ సమస్య గతంలో ఉంది. ఈ సమస్యల వల్ల కొంతకాలం పాలనకు, పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. ఆరోగ్యం సరిగా ఉంది. నాకోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు.
• తమిళ రాజకీయాలు వేరు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు
తమిళనాడులో ఇటీవల కొత్తగా పెట్టిన ఓ రాజకీయ పార్టీ విజయం సాధించడంతో ఇక్కడ కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. 2019లో జనసేన అలాంటి ప్రయత్నమే చేసింది. కానీ నేను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడించారు. తమిళనాడు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు వేరు. నాకు పదవే ముఖ్యం అనుకొని రాజకీయాల్లోకి వచ్చి ఉంటే 2008లోనే యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా ఉండి 2009లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీ పోటీ చేసే వాడిని. నేనెప్పుడూ పదవి గురించి ఆలోచించలేదు. రాజకీయాల్లో నలగాలి.. ప్రజల నమ్మకం చూరగొనాలి. అందుకే దశాబ్దంగా పాటు నలిగి, బలంగా నడిచాను. 2019లో గెలుస్తానో, ఓడుతానో తెలీదు. కానీ ప్రయత్నం చేశాను. ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప పార్టీని నడపలేం. జనసేన పార్టీని ఏ పార్టీతో పోల్చవద్దు. మేం రైట్ వింగ్ కాదు.. లెఫ్ట్ వింగ్ కాదు. మంచి ఎక్కడుందో దాన్ని అన్ని వింగ్స్ నుంచి తీసుకొనే విధానం ఉన్న పార్టీ. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో ఒక వ్యక్తి పార్టీ పెట్టి సీఎం అవగానే నాతో పోలిక పెట్టారు. ఊర్లో పెళ్లికి ఏదో హడావుడి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. మన ఊర్లో పెళ్లి జరుగుతుంటే. చిన్న పిల్లలు పరుగులు పెడుతుంటారు.. అలా ఉంది వారి ప్రచారం. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు.. అక్కడి పరిస్థితులు వేరు. 2019 లో నేను పోటీ చేస్తే రెండు చోట్లా ఓడించారు.. నాతో ఉన్న నాయకులు వెళ్లిపోయారు. పొంతన లేని పోలికలు పెట్టి.. ప్రచారం చేయడం మానుకోండి.
• కులం కోసం రాజకీయాలు చేయను
కులాల్లో ఉన్న అసమానతలు, మతాల్లో ఉన్నబేధాభిప్రాయాలను చర్చిస్తేనే అసలైన కుల, మత రహిత సమాజం సాధ్యం. చాలామంది దీన్ని దాట వేస్తారు. జనసేన పార్టీకి ఆ భయం లేదు. ఉన్నది ఉన్నట్లుగా చర్చించాలన్నదే మా విధానం. ఓట్ల రాజకీయాల కోసం నిజాన్ని దాటేయం.. దాచేయం. నేను కావాలని ఓ కులంలో పుట్టలేదు. నేను పుట్టిన కులం గురించే నేను పనిచేయను. కులాల నిర్మూలన జరగాలంటే మొదటగా విద్యార్థులకు సంబంధించిన కులాల ప్రత్యేక వసతిగృహాలు ఆపేయాలి. కులం మనలో వ్యవస్థీకృతమైపోయింది. నేను అన్ని కులాల ఉన్నతి కోసం ఆలోచిస్తాను. దాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు అర్ధం చేసుకోవాలి.
వైసీపీ నేతలు కాపులకు నువ్వేమి చేశావని నన్ను అడుగుతున్నారు. నేను ఒక్క కాపు ల గురించే ఆలోచన చేయను.. రెల్లి కోసం, ఎస్సీ ఎస్టీ, బీసీ కోసం కూడా నేను పని చేస్తాను. మీరంతా ఎదురు దాడి చేయండి.. వారికి గట్టిగా సమాధానం చెప్పండి. ఈ మధ్య టీవీల్లో చాలా మంది గట్టిగా గొంతు చించుకుని అరుస్తున్నారు. మాట్లాడితే వంగవీటి రంగా పేరు తెస్తారు. రంగా ఆనాడు ప్రాణ హాని ఉందంటే.. ఎంతమంది స్పందించారు. ఈ రోజు గొంతు చించుకుంటున్న వాళ్లు.. రంగా కి రక్షణగా పద్మ వ్యూహంలా ఎందుకు నిలబడలేదు. మనిషిని బతికి ఉన్నప్పుడు రక్షించుకోలేని వారు. చనిపోయాక ఎన్ని కథలు చెబితే ఎవరు నమ్ముతారు? కులం చూస్తే.. మరి నేను రెండు చోట్లా ఓడిపోకూడదు కదా.. కానీ ఎవరూ కులం చూసి ఓట్లు వేయరు. మాయావతి కూడా బ్రాహ్మణల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు.
నేడు సమాజంలో కులం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా మతం మార్పిడి అనేది.. ఇష్టపూర్వకంగా ఉండాలి. డబ్బులు ఇచ్చి.. ప్రలోభ పెట్టి మత మార్పిడులు చేస్తే మాత్రం సహించం. తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నించడమే జనసేన విధానం. ఎవరి మతాచారాలు వారికి గొప్పవి. ఒకరికొకరు గౌరవించుకోవాలి. అంతే కానీ సనాతన ధర్మాన్ని నశింప చేస్తాం అంటే.. ఈ నేల పరిస్థితి అర్దం చేసుకోకపోవడమే. ఎన్నికల సమయంలో సనాతన ధర్మం గురించి ఒక్కరు మాట్లాడరు. ఎన్నికలు అయిపోయాక మాత్రం సనాతన ధర్మాన్ని ఉంచమని మాట్లాడతారు. వేల యేళ్ల చరిత్ర కలిగిన సనాతన ధర్మాన్ని ఎవరూ నశింప చేయలేరు. సనాతన ధర్మం గురించి మాట్లాడితే చాలా మందికి నచ్చడం లేదు.
వినాయక చవితి ఉత్సవాల్లో వినాయకుడి పాటలు పెట్టకుండా అబ్బనీ తీయని దెబ్బ పాటలు పెడుతున్నారు. ఇతర మతాలవారు ఇటువంటి పాటలు పెడతారా? మన తప్ప ఏంటో మనం తెలుసుకోవాలి. మతం వచ్చినప్పుడు మైకులు లేవు . అది ప్రజలకు అర్దమయ్యేలా చెప్పండి. మతం విషయంలో కూడా నేను మీ జోలికి రాను.. మీరు మా జోలికి రాకండి అనే విధానం ఉండాలి. అలాగే ఇతర మతాలకు వారి మతాలపై ఉన్న గౌరవం.. హిందూవులకు ఉండాలి. భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి గొంతెత్తి తీసుకెళ్లాలి. భారతదేశాన్ని తిట్టిన వారిని, దేశ సమగ్రత మీద ఇష్టానుసారం మాట్లాడే వారిపై మాత్రం జనసేన తీవ్రంగా స్పందిస్తుంది. జనసేన ఏడు సిద్ధాంతాలను, దాని వెనుకున్న భావజాలాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలి.
• ప్రధాని మోడీ చెప్పినట్లు భవిత కోసం పొదుపు ముఖ్యం
పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇప్పటి వరకు భారతదేశం పైనా ఎలాంటి ప్రభావం లేకపోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ జాగురకత, ముందుచూపు చాలా ఉంది. అయితే దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ఇంధన పొదుపు చర్యలు చాలా ఉన్నతమైనవి. దానిని దేశం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ పాటించాలి. అంతర్జాతీయ పరిణామాలు, జరుగుతున్న విషయాలను జనసైనికులు, వీర మహిళలు ఎప్పటికప్పుడు అర్ధం చేసుకోవాలి. అంతర్జాతీయ పరిణామాలు కూడా మన మీద ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని తెలియని వారికి పార్టీ గళంగా తెలియజేయాలి. దేశ భవిత కోసం ప్రతి పౌరుడు తగిన విధంగా ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలి. ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్లుగా విదేశీ మారకం కాపాడుకునేందుకు కొద్ది రోజులు బంగారం కొనుకుండా ఉండండి. ప్రజా రవాణా వినియోగం మంచిది. ఇంధన వినియోగం తగ్గించే చర్యలు దేశానికి మేలు చేస్తాయి. ఇంధన పొదుపు గురించి చెప్పినా, అంతర్జాతీయ పరిణామాల వల్ల ఇంధనం ధరలు పెరిగినా కూడా అరకొర జ్ఞానం ఉన్న వైసీపీ వాళ్ళు ప్రధాని మోడీ ని విమర్శిస్తారు. వైసీపీ వాళ్ళ ఇళ్ళలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఉండవు కదా. అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలి.
• మీ ఆత్మగౌరవం తగ్గించను
2024 ఎన్నికల ముందు తెలుగుదేశం – జనసేన – బీజేపీ పార్టీల పొత్తు మంచి ఫలితాలను ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో జైల్లో ఉన్న సమయంలో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లి, పొత్తు ప్రకటన చేశాను. అప్పటి వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే ఎవర్ని మిగిల్చేవారు కాదు. ఇళ్లలోకి చొరబడి మన ఆడపిల్లలపై ఘోరాలు చేసేవారు. ఓ మాజీ ముఖ్యమంత్రి భార్యను అసెంబ్లీలో ఘోరంగా అవమానించే స్థాయికి వైసీపీ నాయకులు దిగజారారు. దీంతోనే అప్పటి పరిస్థితికి అంచనా వేసి మూడు పార్టీలతో కూటమి ఏర్పాటు చేశాం. మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందోనే ఆలోచనతో కూటమి కట్టాం. క్షేత్రస్థాయిలో కూటమిలోని ఇబ్బందులు నాకు తెలుసు. ప్రతి విషయం నా దృష్టిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసైనికులు, వీర మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా దేన్ని ఒప్పుకోను. త్రికరణశుద్ధితో మనం పొత్తు ఏర్పాటు చేసుకున్నాం. క్షేత్రస్థాయి లోపాలుంటే కచ్చితంగా సరిదిద్దుతానని మాటిస్తున్నాను. మీ కోసం నిలబడతాను. మీ ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వను. ఈ రెండు సంవత్సరాలు పరిపాలనలోనూ అంశాలను క్షుణ్నంగా తెలుసుకున్నాను. ఇక నుంచి పార్టీ మీద కూడా పూర్తిస్థాయిలో దృష్టి ఉంటుంది’’ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *