-పార్టీ కేంద్ర కార్యాలయంలో భౌతికంగా… జిల్లాల్లో వర్చువల్ గా మహానాడు
-దేశ ప్రస్తుత పరిస్థితులు… ప్రధాని సూచనలతో మహానాడు నిర్వహణలో కీలక నిర్ణయం
-కోవిడ్ సమయంలో 2 సార్లు వర్చువల్ గా మహానాడు నిర్వహించిన టీడీపీ
-ప్రత్యేక పరిస్థితుల్లో హైబ్రీడ్ పద్దతిలో 2026 మహానాడు
-సీఎం చంద్రబాబు నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్సులో హైబ్రిడ్ పద్దతికే మొగ్గు చూపిన లీడర్లు
-మహానాడు నిర్వహణకు క్లస్టర్ల వారీ ఏర్పాట్లు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పసుపు పండుగ ‘మహానాడు’ను ఈ ఏడాది హైబ్రీడ్ పద్దతిలో చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా, ప్రధాని సూచనలు చేసిన క్రమంలో నెల్లూరులో జరిపే మహానాడు నిర్వహణపై గత 2 రోజుల నుంచి చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు… అండమాన్ నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు మూడు రోజుల మహానాడు కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నెల్లూరులో మూడు రోజుల మహానాడు నిర్వహణకు పెద్ద ఎత్తున వాహానాలను వినియోగించాల్సి వస్తోంది. ప్రధాని సూచనల మేరకు పొదుపు మంత్రం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పిలుపు ఇచ్చింది. ఈ మేరకు స్వయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పొదుపు చర్యలు మొదలుపెట్టారు. తమ కాన్వాయిలోని వాహనాలను తగ్గించుకున్నారు. ఈ పరిస్థితుల్లో నెల్లూరులో మూడు రోజల మహానాడు కోసం అందరూ సమావేశం కావడం… దీని కోసం పెద్ద ఎత్తున వాహనాలను వినియోగించడం సబబు కాదనే అభిప్రాయాన్ని టీడీపీలోని కొందరు నేతలు వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ముఖ్య నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు నిర్వహణ విషయంలో వారి అభిప్రాయాలను సీఎం చంద్రబాబు స్వీకరించారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మహానాడు నిర్వహణ చేపట్టడం సబబు కాదనే భావనను దాదాపు అందరూ వ్యక్తం చేశారు. దీంతో పార్టీ సెంట్రల్ ఆఫీస్ కేంద్రంగా రెండు రోజుల పాటు అంటే ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడును హైబ్రిడ్ పద్దతిలో జరపాలనే నిర్ణయానికి టీడీపీ అధినాయకత్వం వచ్చింది. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో హైబ్రీడ్ పద్దతిలో మహానాడును నిర్వహించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో భౌతికంగా సమావేశం జరపనుండగా… క్షేత్రస్థాయి వరకు పార్టీ శ్రేణులు వర్చువల్ పద్ధతిలో అనుసంధానమయ్యేలా సాంకేతిక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీల సభ్యులతో పాటు అధికార ప్రతినిధులు ఆహ్వానితులుగా హాజరవుతారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తమ తమ నియోజకవర్గాల నుండే ఆన్‌లైన్ విధానం ద్వారా ఈ చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు.
కార్యకర్తల భాగస్వామ్యం కోసం క్లస్టర్ల వారీ ఏర్పాట్లు
ఇక ఈ మహానాడులో కార్యకర్తలను భాగస్వామ్యం చేసే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,848 క్లస్టర్ల పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయా క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వర్చువల్ గా మహానాడును వీక్షించేలా, తమ అభిప్రాయాలను పంచుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గతంలో కోవిడ్ విపత్తు సమయంలో 2020, 2021 సంవత్సరాల్లో వర్చువల్ పద్దతిలో మహానాడును నిర్వహించారు. ఇప్పుడు అదే తరహాలో కార్యకర్తలంతా మహానాడు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పార్టీ అధినాయకత్వం సూచించింది. వేదిక మారినప్పటికీ మహానాడు ప్రాముఖ్యత, స్ఫూర్తి ఏ మాత్రం తగ్గకుండా నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. రాజకీయ తీర్మానాలు, ప్రజా అంశాలపై చర్చలు లోతుగా చేపట్టాలని సూచించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ, పార్టీ శ్రేణులందరూ డిజిటల్ పద్ధతిలో రెండు రోజుల మహానాడు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ అధినాయకత్వం కోరింది.
Prajavartha Online Telugu News