-2 రజత, 7 కాంస్య పతకాలతో జిల్లా ఖ్యాతిని చాటిన మహిళా అథ్లెట్లు
-క్రీడాకారులకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నంలో జూలై 4, 5 తేదీలలో నిర్వహించిన ఖేలో ఇండియా అస్మిత మహిళల లీగ్ – సౌత్ జోన్ 2026 పోటీలలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, అండమాన్ & నికోబార్ దీవులు, కర్ణాటక, కేరళ, మణిపూర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళా క్రీడాకారిణులు పాల్గొన్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక పోటీలలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 2 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ లక్ష్మీశ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారిణులు మరింత ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి, జిల్లాకు మరిన్ని విజయాలు తీసుకురావాలన్నారు . మహిళలు క్రీడల్లో, ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్ క్రీడల్లో మరింతగా రాణించేలా శిక్షణ, ప్రోత్సాహం, అవసరమైన సహకారాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ విజయానికి ఎన్టీఆర్ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) కె. కోటేశ్వరరావు నాయకత్వం, కోచ్లు ఎం. శ్రీను, చందూరి తేజ అందించిన నాణ్యమైన శిక్షణ, నిరంతర మార్గదర్శకత్వం ప్రధాన కారణమయ్యాయి. వారి కృషి, అంకితభావం క్రీడాకారిణుల విజయానికి కీలకంగా నిలిచాయి.
ఖేలో ఇండియా అస్మిత మహిళల లీగ్ పోటీలు ఉత్తర, దక్షిణ జోన్లలో నిర్వహించబడుతున్నాయి. ఈ జోనల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను ఆగస్టు 2026లో మధ్యప్రదేశ్లో నిర్వహించనున్న ఖేలో ఇండియా అస్మిత మహిళల లీగ్ జాతీయ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News