-ఆయుర్వేద, యునాని, నేచురోపతి కళాశాలలు, ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులతో ప్రాచీన వైద్యానికి పునర్ వైభవం
-1500 ఆయుష్ డిస్పెన్స్రీల ఆధునికీకరణ పనులు
-మొత్తం రూ. 414 కోట్ల వ్యయo
-ఔషధ మొక్కల పెంపకానికి ప్రోత్సాహం
-వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయుష్ వైద్యానికి ఆంధ్రప్రదేశ్ ను హబ్ గా మారుస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అత్యంత నిరాదరణకు గురైన ప్రాచీన ఆయుష్ వైద్యానికి పునరుజ్జీవం తెచ్చేందుకు రూ. 414 కోట్లతో అభివృద్ధి చర్యల్ని చేపట్టామని చెప్పారు.
విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బుధవారం “ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు” అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆయుష్ (ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, నేచురోపతి, హోమియోపతి) విభాగం పరిధిలో భారీ అంచనా వ్యయంతో వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. కేవలం రోగం వచ్చిన తర్వాత చికిత్స అందించే ‘రియాక్టివ్–క్యూరేటివ్’ విధానం నుంచి, రోగాలను ముందుగానే గుర్తించి నివారించే ‘ప్రెడిక్టివ్–ప్రివెంటివ్–వెల్నెస్ సెంట్రిక్’ ఆరోగ్య విధానం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో ప్రాచీన ఆయుష్ వైద్య సేవల విస్తరణలో భాగంగా రూ. 280 కోట్లతో నాలుగు కొత్త ఆయుష్ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ధర్మవరం, పిఠాపురంలలో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ప్రొద్దుటూరులో యునాని కళాశాలలు రాబోతున్నాయని చెప్పారు. ఒక్కో కళాశాలకు రూ. 70 కోట్లు వ్యయం చేస్తామని చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నంలో నేచురోపతి మెడికల్ కళాశాల నిర్మాణ పనులు (మొత్తం రూ. 280 కోట్లు) పూర్తికావొచ్చాయని తెలిపారు. అదేవిధంగా తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరంలలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఇంజిగ్రేటెడ్ ఆసుపత్రులకు ఒక్కో దానికి రూ. 90 కోట్లు వెచ్చిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 44 కోట్లతో తలపెట్టిన1,500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. త్వరలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి రాష్ట్ర పర్యటనకు రానున్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. మరోవైపు ప్రభుత్వ ఆరోగ్య సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు సుమారు 20 శాతం పెరిగాయన్నారు. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 255 ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం ప్రభుత్వ వైద్య సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ కృషి కారణంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబిబియస్ సీట్లు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.
ఔషధ మొక్కల పెంపకానికి మంచి డిమాండ్
ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, నేచురోపతి వంటి భారతీయ వైద్య విధానాలపట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఔషధ మొక్కల పెంపకం ద్వారా రైతుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. మునగ, అలోవెరా వంటి మొక్కలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని చెప్పారు. రైతు ఉత్పత్తుల్ని విలువ ఆధారిత ఔషద మొక్కల ద్వారా డిమాండ్ పెరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అశ్వగంధ, మునగాకు, ఉసిరి వంటి ఔషధ మొక్కలకు అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రైతులు, విద్యార్థులు ఈ రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేసి ఔషధ మొక్కల సాగును మరింత ప్రోత్సహిస్తాయని తెలిపారు.
శాస్త్రీయ ప్రమాణాలను అనుసరించాలి
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ మాట్లాడుతూ ఇటీవల తాను హిమాలయాల పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ వేల సంవత్సరాల చరిత్ర గల దేవదారు మరియు ఇతర అద్భుతమైన ఔషధ మొక్కల్ని డిపార్ట్మెంట్ వారు ఎలా సంరక్షిస్తున్నారో స్వయంగా చూశానన్నారు. సాంప్రదాయ వైద్యం గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా, దాన్ని ప్రజలు భయం లేకుండా వాడాలంటే ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ నిబంధనల ప్రకారం శాస్త్రీయ ప్రమాణాలు, సర్టిఫికేషన్ అవసరమన్నారు. మందులను ఎంత మోతాదులో వాడాలో, ఎవరు వాడకూడదో స్పష్టమైన లేబులింగ్, గైడ్‌లైన్స్ ప్రొడక్ట్స్‌పై ముద్రించాలనారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కేవలం 30,000 నుండి 35,000 ఎకరాల్లోనే ఔషధ మొక్కల సాగు జరుగుతోందని. దీనిని అటవీశాఖ సహకారంతో లక్షల ఎకరాలకు విస్తరించాలన్నారు. రైతులకు కేవలం అవగాహన కల్పించడమే కాకుండా, సాధారణ పంటల కంటే ఎక్కువ లాభాలు వచ్చేలా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించి, ల్యాబ్ లు అందుబాటులోకి తెచ్చినప్పుడే రైతులు ఈ సాగు వైపు ఉత్సాహంగా ముందుకు వస్తారన్నారు. ఈ దిశగా తమ శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
నకిలీ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కెవియన్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ వంటింట్లోనే సహజ సిద్ధమైన మందులున్నాయన్నారు. ‘నేచురల్’ పేరుతో మార్కెట్లో విక్రయించే ఉత్పత్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలని కోరారు. అరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు ప్రచురించిన నివారణ వైద్యానికి సంబంధించిన విజ్ఞానాన్ని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారు (యోగా అండ్ నేచురోపతి), డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ రుషుల జీవన విధానం గురించి వివరించారు. మొక్కల పెంపకం ద్వారా సహజ సద్ధమైన ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని, ఆ దిశగా ప్రజలు ఆలోచించాలన్నారు.ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆవుల చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2,200 ఎకరాల్లో అశ్వగంధ ఔషధ మొక్కల్ని పెంచేందుకు విత్తనాల్ని బోర్డు ద్వారా పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమ వేదికను అలంకరించిన వారిలో ప్రభుత్వ సలహాదారు(పర్యావరణ, అటవీ శాఖ) పి.. మల్లికార్జున రావు, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి, ఏపీ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ పి.వి.లక్ఝ్మయ్య ప్రభృతులు ఉన్నారు.
వెబ్ సైట్, గ్రంథాల ఆవిష్కరణ
ఈ సదసులో ఔషధ, సుగంధ మొక్కల ప్రోత్సాహానికి రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి సత్యకుమార్ ప్రారoభించారు. అలాగే ప్రపంచ రికార్డు గుర్తింపు పొందిన ఆయుర్వేద, ఔషధ మొక్కల గ్రంథాలను ఆవిష్కరించి, రైతులకు ఔషధ, సుగంధ మొక్కలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నేచురోపతి) డా. మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ… ప్రకృతి ఆధారిత జీవన విధానమే ఆరోగ్యానికి మూలమని అన్నారు. తులసి, వేప, పుదీనా, లెమన్ గ్రాస్, అరికా పామ్, పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలు ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ స్వచ్ఛతకు కూడా దోహదపడతాయని తెలిపారు. ప్రకృతి సంపదను సంరక్షిస్తూ, సాంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి. వీరపాండ్యన్ మాట్లాడుతూ.. మానవ ఆరోగ్యం ప్రకృతితో ముడిపడి ఉందని, ఔషధ మొక్కల వినియోగం శాస్త్రీయ ప్రమాణాలు, నాణ్యత ధ్రువీకరణతో ప్రజలకు అందుబాటులోకి రావాలని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30–35 వేల ఎకరాల్లో ఉన్న ఔషధ మొక్కల సాగును అటవీ శాఖ సహకారంతో మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు మార్కెటింగ్ అనుసంధానం, ప్రయోగశాల సదుపాయాలు కల్పిస్తే ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సెకండరీ హెల్త్ డైరెక్టర్ డా. కె.వి.ఎన్. చక్రధర బాబు మాట్లాడుతూ.. ఆయుర్వేదం, సిద్ధ, యునాని, హోమియోపతి వంటి సాంప్రదాయ వైద్య విధానాలు భారతదేశానికి చెందిన అమూల్యమైన వైద్య సంపద అని అన్నారు. అత్యవసర పరిస్థితులు, శస్త్రచికిత్సలకు అల్లోపతి వైద్యం ఎంతో అవసరమైనప్పటికీ, రసాయన మందుల అధిక వినియోగం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అందువల్ల సహజసిద్ధమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని సుస్థిర జీవన విధానాన్ని పాటించాలని సూచించారు.
‘నేచురల్’ పేరుతో మార్కెట్లో విక్రయించే ఉత్పత్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలని కోరారు. అరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు ప్రచురించిన నివారణ వైద్యానికి సంబంధించిన విజ్ఞానాన్ని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేయాలని డా. కె.వి.ఎన్. చక్రధర బాబు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ఔషధ మరియు సుగంధ మొక్కల బోర్డు (Andhra Pradesh Medicinal and Aromatic Plants Board – APMAPB) ముఖ్య కార్యనిర్వహణాధికారి (ఏపీఎంఏపీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆవుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పర్యావరణ కాలుష్యం వల్ల తగ్గుతున్న ఆయుష్షును పెంచడంతో పాటు ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఔషధ మొక్కలపై నిర్వహించిన పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో పాటు ప్రతిష్ఠాత్మక అవార్డులు, వరల్డ్ బుక్ రికార్డులు దక్కాయని చెప్పారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు, మార్కెటింగ్ సౌకర్యాలు అందించేందుకు ప్రత్యేక ల్యాబొరేటరీ, మ్యూజియం, సీడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఔషధ మొక్కల సాగును విస్తరించి రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బోర్డు కృషి చేస్తోందని ఆవుల చంద్రశేఖర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో పర్యావరణ, అడవులు, సైన్స్ & టెక్నాలజీ శాఖ ప్రభుత్వ సలహాదారు పి. మల్లికార్జునరావు, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, రైతులు, వైద్య విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News