Breaking News

గుంటూరులో ‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ విజయోత్సవం

-ముఖ్య అతిథిగా హాజరైన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
-హీరో అఖిల్ కఠోర శ్రమ, అద్భుత నటనపై మంత్రి ప్రశంసల జల్లు!
-ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్
-కూటమి ప్రభుత్వ సహకారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్‌లకు నిర్మాత నాగవంశీ కృతజ్ఞతలు!
-ఆగష్టు 8,9 తేదీల్లో గుంటూరు లో జరిగే అమరావతి చిత్ర కళావీధి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్, హీరో అఖిల్, చిత్ర టీం, సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
హీరో అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, దర్శకుడు మురళి కిషోర్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాతలు అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన భారీ చిత్రం ‘లెనిన్’. గ్రామీణ నేపధ్యంలో మహాభారతంలోని ఒక కీలక ఘట్టాన్ని బేస్ చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం గుంటూరు నగరంలోని భాష్యం గ్రౌండ్స్‌లో అత్యంత వైభవంగా ‘లెనిన్ బ్లాక్‌బస్టర్ సెలెబ్రేషన్స్’ నిర్వహించింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి, చిత్ర యూనిట్‌కు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

సినిమా పరిశ్రమ అభివృద్ధికి సింగిల్ విండో అనుమతులు, సమగ్ర జీవో: మంత్రి కందుల దుర్గేష్

సభను ఉద్దేశించి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..”‘లెనిన్’ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించడం పట్ల చిత్ర బృందానికి నా అభినందనలు. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు విజయం సాధించినప్పుడే చిత్ర పరిశ్రమ మరింత ముందుకు సాగుతుంది. మన ఏపీ గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో అఖిల్ నటన చాలా బాగుంది. ఆయన పడిన కష్టాన్ని, కఠోర శ్రమను స్క్రీన్‌పై స్పష్టంగా చూడవచ్చు. తన అద్భుత నటనతో లెగసీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అఖిల్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, శివాజీ, గెటప్ శ్రీను తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఒక సినిమా హిట్ అయితే ఎందరికో ఉపాధి లభిస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ నుంచి తిరుపతి వరకు సినిమా రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. చిత్రాల షూటింగ్‌ల కోసం సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తున్నాం. పరిశ్రమ అభివృద్ధి కోసం త్వరలోనే ఒక సమగ్ర జీవోను కూడా తీసుకురాబోతున్నాం.మౌలిక సదుపాయాల కల్పనలకు ముందుకొచ్చే వారికి భూములు ఇస్తాం”అని స్పష్టం చేసారు..

పరిశ్రమకు కూటమి ప్రభుత్వం కొండంత అండ: నిర్మాత నాగవంశీ

చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “మంత్రి కందుల దుర్గేష్ సినీ పరిశ్రమ సమస్యలను, ప్రగతిని ఎంతో నిశితంగా ఫాలో అప్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు అందిస్తున్న మద్దతు వెలకట్టలేనిది. ఏపీలో షూటింగ్‌లు సజావుగా సాగేలా ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి చిత్ర యూనిట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.”అన్నారు.

ఈ వేదికగా అమరావతి చిత్ర కళావీధి పోస్టర్ ను మంత్రి కందుల దుర్గేష్, హీరో అఖిల్, చిత్ర టీం, సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి ఆవిష్కరించారు…

భారీ జనసందోహం మధ్య జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు, ప్రముఖులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *