Breaking News

ప్రజలకు చేరువగా ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం

-సమస్యల వేగవంతమైన పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ
-ప్రజల వ్యయ, ప్రయాసలకు స్వస్తి పలుకుతున్న ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు
-జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను స్థానికంగానే స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, స్థానిక శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ్మోహ‌న్, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, అధికారుల‌తో క‌లిసి పాల్గొని ప్రజల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలు, వినతిపత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, ఒక్కో నియోజకవర్గంలో నాలుగు శుక్రవారాలు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే రెండు విడతలుగా విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. గత రెండు విడతలుగా నిర్వహించిన పీజిఆర్ఎస్ సమావేశాల్లో వరుసగా 94, 66 అర్జీలను స్వీకరించడం జరిగిందని, ఈ రోజు స్వీకరించిన 86 దరఖాస్తులతో కలిపి మొత్తం 246 అర్జీలను స్వీకరించడం జరిగిందని, వీటిలో ఇప్పటి వరకు 57 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, మిగతా దరఖాస్తులు వివిధ పరిష్కార దశల్లో ఉన్నాయని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమయం, డబ్బు వృథా చేసుకోకుండా, ప్రభుత్వమే వారి వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలను తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని వివరించారు. అధికారులు ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని పూర్తిగా చదివి, నాణ్యమైన పరిష్కారం అందించాల్సిన బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఒకే సమస్యపై ప్రజలు పదేపదే దరఖాస్తులు చేసుకునే పరిస్థితి రాకుండా సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గo శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి తీసుకునే కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం కూడా ఒకటి అన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లి అర్జీలు సమర్పించడం ప్రజలకు కొంత ప్రయాసతో కూడుకున్న విషయమని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలోనే పీజీఆర్ఎస్ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసిందన్నారు. జిల్లా స్థాయి అధికారులందరూ నియోజకవర్గానికి రావడం, స్థానిక అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల సమస్యల పరిష్కారం మరింత వేగవంతంగా, సులభంగా జరుగుతుందని శాసనసభ్యులు తెలిపారు. సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు అధికారులకు అభినందనలు తెలిపారు. నూటికి 90 శాతంకు పైబడి పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరుకు, 10% దరఖాస్తులు వ్యక్తిగత సమస్యలు వస్తున్నాయని తెలిపారు. రానున్న ఒకటి, రెండు నెలల్లో 2.50 లక్షల పెన్షన్లు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాల మంజూరుకు కూడా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈరోజు అందిన 86 దరఖాస్తుల్లో 30 దరఖాస్తులు ఇళ్ల స్థలాలు మంజూరుకు, 47 దరఖాస్తు పింఛన్లు మంజూరుకు అందగా, మిగిలిన దరఖాస్తులు వివిధ సమస్యలపై అందినట్లు శాసనసభ్యులు వివరించారు.

కార్యక్రమం ప్రారంభానికి ముందు జిల్లా కలెక్టర్ స్వయంగా వివిధ కౌంటర్ల వద్ద జరుగుతున్న అర్జీల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. అర్జీదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సావధానంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు కౌంటర్ల వద్దకు వచ్చినప్పుడు వారికి కూర్చునే సౌకర్యం కల్పించి, ప్రాధాన్యతతో సేవలు అందించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో వెన్నెలశ్రీను, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, విఎంసి జోనల్ కమిషనర్ షామీ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వార్డు స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *