– ఈ నెల 20వ తేదీలోగా ఖాతాతో ఎన్‌పీసీఐ అనుసంధానం పూర్తిచేయాలి
– జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 22న తల్లికి వందనం నిధులు ఖాతాల్లో జమకానున్నాయని.. అయితే ఎన్‌టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 1,667 మంది ఎస్‌సీ విద్యార్థులు ఇంకా బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయలేదని.. వీరందరూ వెంటనే ఖాతాలు ప్రారంభించాలని జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. విద్యార్థులు సమీప గ్రామంలోని పోస్టాఫీసులో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాను రూ. 200తో ఓపెన్ చేయొచ్చన్నారు. ఖాతాను ప్రారంభించేందుకు ఆధార్ కార్డు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబరు, జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మార్కుల జాబితా పత్రాలు తీసుకొని వెళ్లాలన్నారు. పోస్టల్ బ్యాంకు ఖాతాను ప్రారంభించిన వెంటనే బ్యాంకు ఖాతాను ఎన్‌పీసీఐ పోర్టల్‌తో అనుసంధానించడం జరుగుతుందన్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేసుకోవాలన్నారు. జిల్లాలోని ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ సమాచారాన్ని మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్‌సీ విద్యార్థులకు తెలియజేయాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు సహాయసహకారాలకు తిరువూరు, విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికారత అధికారి జ్యోతిలక్ష్మీదేవి సూచించారు.
Prajavartha Online Telugu News