-హస్తకళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-హస్తకళాకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యం
-నగర ప్రజలు హస్తకళా ఉత్పత్తులు కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలి
-శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాచీన హస్తకళల వారసత్వ పరిరక్షణతోపాటు కళాకారులకు స్థిరమైన జీవనోపాధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) ఆధ్వర్యంలో “ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం–2026” ను శుక్రవారం విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని పంటకాలువ రోడ్డులో ఉన్న మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మెహన్ రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం హస్తకళాకారుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. నైపుణ్యం కలిగిన హస్తకళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉచితంగా స్టాళ్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రదర్శనలో పాల్గొనే హస్తకళాకారులకు ప్రయాణ వ్యయాలతో పాటు టీఏ, డీఏ సౌకర్యాలను కూడా ప్రభుత్వమే భరిస్తూ వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇది హస్తకళాకారుల జీవనోపాధిని బలోపేతం చేయడంతో పాటు సంప్రదాయ కళలను పరిరక్షించేందుకు దోహదపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తకళల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, కళాకారులకు వివిధ రాయితీలు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం అభినందనీయమని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి ఉపాధి, సాంస్కృతిక ప్రదర్శనలు పెద్దగా నిర్వహించలేదని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే తన చేతుల మీదుగా ఐదుకు పైగా హస్తకళా ప్రదర్శనలు విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందని గుర్తు చేశారు.
ముప్పై సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా కొనసాగుతున్న తనకు హస్తకళా రంగ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలపై పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. హస్తకళాకారుల సంక్షేమం, సాంప్రదాయ కళల పరిరక్షణ, వాటిని భావితరాలకు అందించే దిశగా నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ఆయన హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ప్రదర్శనలో దేవతా విగ్రహాలు, సంప్రదాయ కళాఖండాలు, చేనేత చీరలు తదితర అనేక ఆకర్షణీయమైన హస్తకళా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరూ వీటిని కొనుగోలు చేసి హస్తకళాకారులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు.
లేపాక్షి మేనేజరు ఎమ్. సురేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, లేపాక్షి ఎండీ విశ్వ మనోహర్ ల కృషితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామన్నారు. రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయ కళలను సజీవంగా నిలబెడుతున్న హస్తకళాకారులను ప్రోత్సహించేందుకు నగర ప్రజలు, విద్యార్థులు, కొనుగోలుదారులు, ఎగుమతిదారులు, హస్తకళా ప్రేమికులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ నాలుగు రోజుల మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో లేపాక్షి మేనేజర్ (అడ్మిన్) డిల్లీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News