Breaking News

జగన్‌ది రాజకీయ అవగాహన రాహిత్యం – ఎమ్మెల్సీ వర్ల రామయ్య

-మెగా డీఎస్సీపై అనుమానాలుంటే అధికారులను కలవాలి
-16 వేల మంది ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడొద్దు
-లోకేశ్‌ ప్రజాదరణ చూసి జగన్‌లో అసూయ.. బహిరంగ చర్చకు రావాలి
-ఏపీపీఎస్సీ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉంది.. తీర్పు కోసం వేచి చూడాలి
-బ్రిడ్జ్‌ క్రీడాకారులకు ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు.. ఒక్క దరఖాస్తూ రాలేదు
-బ్రిడ్జి కోర్స్ అంటే తెలియని బుద్ధిహీనులే వైసిపి నాయకులు- ఎంపీ చిన్ని
-ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న వర్ల రామయ్యకు అభినందనలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని
-పార్లమెంటు ను అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న ఎంపీని శాలువాతో సత్కరించిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారిగా తన కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య ను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని అభినందనలు తెలిపారు అనంతరం పార్లమెంటును అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న ఎంపీ చిన్నిని శాలువాతో సత్కరించారు ఎమ్మెల్సీ వల్ల రామయ్య అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాజకీయ అవగాహనతోపాటు విషయ పరిజ్ఞానం కూడా తక్కువగా ఉందని ఎమ్మెల్సీ వర్ల రామయ్య విమర్శించారు. మెగా డీఎస్సీ నియామకాలపై అనుమానాలు, సందేహాలు ఉంటే రోడ్డెక్కి ఆరోపణలు చేయకుండా సంబంధిత అధికారులను కలిసి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. మెగా డీఎస్సీపై ఇద్దరు మహిళా ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చారని, ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటామని వారు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు

..సందేహాలుంటే అధికారులను కలవాలి…

మెగా డీఎస్సీపై ఏవైనా అనుమానాలుంటే వాటిని ఆధారాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వర్ల రామయ్య అన్నారు. ‘ఏం అవకతవకలు జరిగాయో మా దగ్గరకు రండి.. వివరిస్తాం’ అని సంబంధిత ఉన్నతాధికారులు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఒక రాజకీయ నాయకుడిగా ముందుగా తన సందేహాలను అధికారులకు నివేదించి, వారు సమాధానం ఇవ్వకపోతే ప్రజల ముందుకు తీసుకురావడం సరైన విధానమన్నారు. కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల్లో అపోహలు కలిగించడం సరికాదన్నారు.యువనాయకుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రజల్లోకి వేగంగా వెళ్తున్నారని, ఆయనకు ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని వర్ల రామయ్య అన్నారు. లోకేశ్‌ ప్రజల్లో చొచ్చుకుపోతుండటాన్ని చూసి జగన్‌మోహన్‌రెడ్డిలో అసూయ, ఈర్ష్య, ఆక్రోశం పెరిగాయని ఆరోపించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ప్రజలు కేవలం 11 స్థానాలకు పరిమితం చేసిన విషయాన్ని గుర్తుంచుకుని రాజకీయంగా ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు. గతంలో 151 స్థానాలు ఇచ్చిన ప్రజలే తర్వాత 11 స్థానాలకు పరిమితం చేశారని, ఈ తీర్పు నుంచి పాఠం నేర్చుకోవాలని అన్నారు.

..లోకేశ్‌తో బహిరంగ చర్చకు రండి..

మెగా డీఎస్సీ, ఏపీపీఎస్సీ తదితర అంశాలపై ఏవైనా సందేహాలుంటే మంత్రి లోకేశ్‌తో బహిరంగ చర్చకు రావాలని వర్ల రామయ్య సవాల్‌ చేశారు. లోకేశ్‌ ప్రతి సందేహానికీ సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి లేదా ఆయన తరఫున ఎవరు వచ్చినా చర్చకు సిద్ధమన్నారు. రోడ్డుపై ఆరోపణలు, రాజకీయ విమర్శలు చేయడం కంటే బహిరంగ చర్చకు రావడం ద్వారా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 వ్యవహారం ఇప్పటికే హైకోర్టు పరిధిలో ఉందని వర్ల రామయ్య తెలిపారు. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ జరిపి నివేదికలు పరిశీలిస్తున్న నేపథ్యంలో తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సి ఉందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కొంతమంది గ్రూప్‌-1 అధికారులను నాన్‌ఫోకల్‌ పోస్టుల్లో ఉంచిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై వాస్తవాలు న్యాయస్థానం తీర్పుతోనే తేలుతాయని, రాజకీయ ఆరోపణలతో ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని సూచించారు.

..16 వేల మంది ఉద్యోగుల మనోభావాలతో చెలగాటమా?..

మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన సుమారు 16 వేల మంది అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసేలా ఆరోపణలు చేయవద్దని వర్ల రామయ్య అన్నారు. ఎంతో కష్టపడి చదివి, రాత్రింబవళ్లు శ్రమించి ఉద్యోగాలు సాధించిన యువత తమ నియామకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నందుకు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వారి కుటుంబాలు సంతోషించాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణల కారణంగా అనుమానాలు, ఆందోళనలకు గురవుతున్నాయని అన్నారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయని చెబుతున్న వారు అందుకు ఆధారాలను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. మెగా డీఎస్సీలో ‘బ్రిడ్జ్‌ కోర్సు’ చేసిన వారికి ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలను వర్ల రామయ్య ఖండించారు. బ్రిడ్జ్‌ క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చారనడానికి ఒక్క ఆధారం కూడా లేదని స్పష్టం చేశారు. బ్రిడ్జ్‌ క్రీడాకారుడిగా ఉద్యోగం ఇవ్వాలని ఒక్క దరఖాస్తు కూడా రాలేదని, అలాంటి అభ్యర్థికి ఒక్క నియామకం కూడా జరగలేదని పేర్కొన్నారు. బ్రిడ్జ్‌ క్రీడను పేకాటగా భావించి మాట్లాడటం అవగాహన లేమికి నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఉద్యోగ నియామకాల సమయంలో పరిగణనలోకి తీసుకునే క్రీడల జాబితాలో బ్రిడ్జ్‌ కూడా ఉందని తెలిపారు. అది నైపుణ్యాధారిత క్రీడ అని, దానిపై కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు.

..బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి..

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వర్ల రామయ్య తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తూ బీసీలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేసిన సందర్భాలున్నాయని, వాటిని కూడా పరిశీలించి న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

…ఈడీ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి..

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ప్రారంభించడాన్ని వర్ల రామయ్య ప్రస్తావించారు. ఆలస్యమైనా దర్యాప్తు ప్రారంభం కావడం మంచిదేనని, విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న అంశాలు దర్యాప్తు సంస్థల ద్వారా బయటపడతాయని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *