– 1,50,747 మంది రైతుల నుంచి 2,84,045.60 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు
– అధికారిక లెక్కలను దాచిపెట్టి కూటమి ప్రభుత్వంపై జగన్ , సాక్షి విషప్రచారం
– ఆగస్టు 17నే ఖరీఫ్ కొనుగోళ్ల ప్రతిపాదన.. సెప్టెంబరు 23న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ లేఖ
– సకాలంలో చెల్లింపుల కోసం 15 శాతం రివాల్వింగ్ ఫండ్, రూ.300 కోట్ల ఆర్థిక సహాయం ప్రతిపాదన
– రైతుల పేరుతో రాజకీయాలు మానాలి.. వాస్తవాలపై జగన్ బహిరంగ చర్చకు రావాలి – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రైతులకు మద్దతుగా చేపట్టిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లను, వాటికి విడుదలైన నిధులను దాచిపెట్టి కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం జగన్ కు , ఆయన మానస పుత్రిక సాక్షికి అలవాటుగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను విస్మరించి, జగన్, వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొనుగోళ్ల లెక్కలు ఉన్నాయి.. నిధుల విడుదల వివరాలు ఉన్నాయి.. కేంద్రానికి పంపిన ప్రతిపాదనల తేదీలు ఉన్నాయి. ఇవన్నీ పక్కనపెట్టి ప్రభుత్వంపై నిందలు వేస్తే అబద్ధం నిజమైపోతుందా? అని ప్రశ్నించారు. 2024–25 ఖరీఫ్ నుంచి 2025–26 రబీ వరకు మొత్తం 1,50,747 మంది రైతుల నుంచి 2,84,045.60 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చెల్లింపులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నాఫెడ్, ఎన్సీసీఎఫ్ ద్వారా ఏపీ మార్క్‌ఫెడ్‌కు మొత్తం రూ.1,944.43 కోట్లు విడుదల చేసిందని వివరించారు. 2024–25లో 71,376 మంది రైతుల నుంచి 1,22,970.60 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేయగా, అందుకు రూ.821.37 కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. 2025–26లో 79,371 మంది రైతుల నుంచి 1,61,075 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేయగా, అందుకు రూ.1,123.06 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. కందులు, శనగలు, మినుములు, పెసలతోపాటు ఉల్లిపాయలు, పొగాకుకు సంబంధించిన కొనుగోళ్ల వివరాలు కూడా మార్క్‌ఫెడ్ సమర్పించిన గణాంకాల్లో ఉన్నాయని చెప్పారు.
2024–25 ఖరీఫ్‌లోనే 53,640 మంది రైతుల నుంచి 79,993 మెట్రిక్ టన్నుల కందులను రూ.603.95 కోట్ల విలువకు కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు. 2025–26 ఖరీఫ్‌లో 37,058 మంది రైతుల నుంచి 59,296.70 మెట్రిక్ టన్నుల కందులను రూ.474.37 కోట్ల విలువకు కొనుగోలు చేశామని తెలిపారు. అదే ఏడాది రబీలో 32,541 మంది రైతుల నుంచి 83,470.50 మెట్రిక్ టన్నుల శనగలను రూ.490.39 కోట్ల విలువకు, 7,731 మంది రైతుల నుంచి 14,518.90 మెట్రిక్ టన్నుల పెసలను రూ.127.30 కోట్ల విలువకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఇంత స్పష్టమైన గణాంకాలు ఉన్నా రైతులకు ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్లు చిత్రీకరించడం వెనుక ఉద్దేశం ఏమిటి? రైతులకు జరిగిన మేలును గుర్తించడానికి జగన్‌కు, సాక్షికి మనసు రాదా? అని నిలదీశారు. జగన్! నీ నీచ రాజకీయాలకు రైతులను పావులుగా వాడుకోవడం మానుకోవాలని మంత్రి హెచ్చరించారు. వైసీపీ పాలన గురించి గొప్పలు చెప్పుకునే ముందు, కూటమి ప్రభుత్వం చేపట్టిన కొనుగోళ్ల లెక్కలను చూడండి. ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే వాస్తవాలతో చేయాలి. మీకు అనుకూలమైన కథనం కోసం వాస్తవాలను తొక్కిపెట్టే హక్కు ఎవరిచ్చారు? అబద్ధానికి పెద్ద శీర్షిక పెట్టినంత మాత్రాన అది నిజం కాదు. రైతుల పేరుతో ప్రభుత్వంపై బురద చల్లడం రైతు సేవ అనిపించుకోదు. జగన్, వైసీపీ నేతలు రైతు సంక్షేమంపై చర్చకు వస్తే అధికారిక గణాంకాలతోనే సమాధానం చెబుతాం అని మంత్రి స్పష్టం చేశారు.
ఖరీఫ్–2026 కొనుగోళ్ల విషయంలోనూ మార్క్‌ఫెడ్ సకాలంలో చర్యలు తీసుకుందని అచ్చెన్నాయుడు తెలిపారు. పీఎం–ఆశా ధరల మద్దతు పథకం మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 20న జారీ చేసిన సూచనలకు అనుగుణంగా ఆగస్టు 17నే రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర కొనుగోలు ప్రతిపాదన సమర్పించినట్లు వివరించారు. రైతులకు నిర్దేశిత గడువులో చెల్లింపులు జరిగేలా, అంచనా ఉత్పత్తి లేదా అనుమతించే కొనుగోలు పరిమాణానికి సంబంధించిన కనీస మద్దతు ధర విలువలో కనీసం 15 శాతానికి సమానమైన రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి అమల్లోకి తేవాలని కోరినట్లు తెలిపారు. కొనుగోళ్లకు సంబంధించిన అనుబంధ వ్యయాలకు కూడా నిధులు సమకూర్చాలని ప్రతిపాదించిందని చెప్పారు. కేంద్ర నోడల్ సంస్థల నుంచి నిధులు లేదా రీయింబర్స్మెంట్ అందేలోపు కొనుగోళ్లు నిరాటంకంగా కొనసాగేందుకు, అర్హులైన రైతులకు తక్షణమే ఆన్లైన్లో చెల్లింపులు చేసేందుకు ధరల స్థిరీకరణ నిధి లేదా వర్కింగ్ క్యాపిటల్ సహాయంగా రూ.300 కోట్లు మంజూరు చేయాలని మార్క్‌ఫెడ్ కోరినట్లు మంత్రి తెలిపారు. రైతులకు చెల్లింపుల్లో జాప్యం రాకుండా ముందస్తు నిధుల కోసం ప్రతిపాదించడం బాధ్యతాయుతమైన చర్య. రైతులకు సకాలంలో డబ్బు అందాలనే ఉద్దేశంతో తీసుకున్న చర్యలను కూడా నిర్వాకంగా చిత్రీకరించడం సాక్షి వక్రీకరణకు నిదర్శనం అని విమర్శించారు. మార్క్‌ఫెడ్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 23 న కేంద్ర ప్రభుత్వానికి పంపి, ఖరీఫ్–2026 కొనుగోళ్లకు అనుమతి కోరినట్లు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, కొర్రలు, వేరుశనగలను ఈ ప్రతిపాదనలో చేర్చినట్లు తెలిపారు. రైతులు తక్కువ ధరలకు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితిని నివారించి, కనీస మద్దతు ధర ద్వారా ఆదుకోవడమే ఈ ప్రతిపాదన లక్ష్యమన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆమోద ఉత్తర్వులు రావాల్సి ఉందని వెల్లడించారు.
ఆగస్టులో మార్క్‌ఫెడ్ ప్రతిపాదన ఇచ్చింది. సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఇప్పుడు కేంద్ర అనుమతి రావాల్సి ఉంది. ఈ ప్రక్రియను దాచిపెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్లు కథనం రాయడం రైతులను తప్పుదారి పట్టించడమే. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల పంటకు మద్దతు ధర, సకాలంలో చెల్లింపుల కోసం పనిచేస్తోంది. జగన్, వైసీపీ అసత్య ప్రచారానికి అధికారిక రికార్డులతోనే సమాధానం ఇస్తాం. రైతుల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను సహించబోం అని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Prajavartha Online Telugu News