Breaking News

గ్రామీణాభివృద్ధికి రహదారుల బలోపేతం కీలకం

-ఆత్మకూరులో రూ. 8.91 కోట్లతో నాలుగు లేన్స్ రహదారి అభివృద్ధి
-రహదారికి వాయుపుత్ర మార్గ్ గా నామకరణం
-మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, ఎన్‌హెచ్‌-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు రూ. 8.91 కోట్ల వ్యయంతో నాలుగు లేన్స్ రహదారిని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మొత్తం 2.2 కిలోమీటర్ల మేర ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ రహదారికి వాయుపుత్ర మార్గ్ గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. మంగళవారం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఆత్మకూరు రహదారిని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నమైన NH-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు సాకారం కావడం ఎంతో సంతోషకరం. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో మొత్తం రూ. 8.91 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టాం. గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు చేపట్టిన ఈ పనుల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ. 6.31 కోట్ల వ్యయంతో 2.2 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారిని విస్తరించాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిధుల ద్వారా రూ.2.60 కోట్లతో సెంట్రల్ డివైడర్, వీధి దీపాలు, సుందరీకరణ తదితర పనులు చేపట్టనున్నాం.
ఆత్మకూరు పట్టణ ప్రజలు నిత్యం జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-67కు చేరుకునేందుకు ఈ మార్గంపైనే ఆధారపడేవారు. ఇరుకైన రహదారి, గుంతల కారణంగా స్థానికులు, విద్యార్థులు, రైతులు రాకపోకల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టడంతో జాతీయ రహదారిని తలపించేలా నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ రహదారిని అభివృద్ధి చేశాం. ఈ రహదారి సమీపంలోని ఆలయంలో 50 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం కొలువై ఉంది. భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక భావాలకు ప్రతీకగా నిలిచిన ఈ విగ్రహం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, రహదారికి వాయుపుత్ర మార్గ్ అని నామకరణం చేస్తున్నాం.
పల్లె పండుగతో గ్రామీణ రహదారుల అభివృద్ధి
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రహదారులను బలోపేతం చేసేందుకు పల్లె పండుగ 1.0, 2.0 కార్యక్రమాల కింద 9 వేల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు నిర్మించగా, మరో 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల మంజూరు చేశాం. ఆ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా మరో 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశాం. వ్యవసాయ క్షేత్రాలకు రాకపోకలు సులభతరం చేసేందుకు 161 డొంక రోడ్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, రైతులు, విద్యార్థులు, స్థానిక ప్రజల ప్రయాణ ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది” అన్నారు.
వీర్లగుడిపాడు వంతెన నిర్మాణానికి చర్యలు వేగవంతం
సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామానికి వెళ్లే మార్గంలో వంతెన నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కోరగా, ఈ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు, అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ని ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశించారు. అదేవిధంగా, తాగునీటి సమస్యను ప్రస్తావించగా.. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద ఇప్పటికే రూ.72 కోట్లతో 391 సింగిల్ విలేజ్ స్కీమ్స్‌ను ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారు ఆన్ లైన్ ద్వారా హాజరయ్యారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్రీ బాలూ నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …