Breaking News

మడ అడవుల సంరక్షణతోనే మానవ మనుగడకు భరోసా

-ప్రకృతి సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత
-వృక్ష సంపద పరిరక్షణకు వాల్టా చట్టం పటిష్టంగా అమలు చేస్తాం
-అవనిగడ్డ నియోజకవర్గం సంఘమేశ్వరంలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నాగబాబు
-సంఘమేశ్వరంలో స్వయంగా మడ మొక్కలు నాటిన నాగబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మడ అడవుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణకే కాకుండా, మానవ మనుగడకు కూడా అత్యంత కీలకమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నాగబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు పొయ్యిలో కట్టెల కోసం మడ అడవులను విచ్చలవిడిగా నరికివేసి, సహజంగా ఏర్పడిన విలువైన వృక్ష సంపదను నాశనం చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రసాదించిన సంపదను కాపాడుకోవాల్సింది పోయి, దానిని ధ్వంసం చేయడం ద్వారా మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నామన్నారు. మడ అడవులను సంరక్షిస్తే అవి భవిష్యత్తులో మనకు గొప్ప జీవనాధారంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. మంగళవారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని సంఘమేశ్వరంలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. 100 హెక్టార్ల విస్తీర్ణంలో మూడు లక్షల మడ మొక్కలను నాటే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో నాగబాబు  స్వయంగా మొక్కలు నాటి, మడ అడవుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా  నాగబాబు మాట్లాడుతూ… “ కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చెట్లను నరికివేయాలంటే అనేక ఆంక్షలు ఉంటాయి. ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలోనూ వృక్ష సంపద పరిరక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు త్వరలోనే వాల్టా చట్టాన్ని మరింత క్రియాశీలంగా అమలు చేస్తాం.
మొక్క విలువ వెలకట్టలేనిది
ఒక్కో మొక్క పర్యావరణానికి అందించే ప్రయోజనాలు వెలకట్టలేనివి. అయినప్పటికీ, మన చుట్టూ ఉన్న చెట్లను, విలువైన మడ అడవులను నరికివేస్తూ ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నా పట్టించుకోకపోవడం ఆందోళనకరం. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి, వృక్ష సంపదను కాపాడేందుకు ముందుకు రావాలి. మనం చెట్లను కాపాడితే.. అవే మనల్ని కాపాడతాయి. ప్రకృతిని పరిరక్షించడం మనందరి బాధ్యత.
భూమిని కాపాడుకోవడం మనందరి బాధ్యత
ఇల్లు నచ్చకపోతే మరో ఇంటికి మారవచ్చు.. ఊరు నచ్చకపోతే మరో ఊరికి వెళ్లవచ్చు.. దేశం నచ్చకపోతే మరో దేశానికి వెళ్లిపోవచ్చు. కానీ భూమి నివాసయోగ్యంగా లేకపోతే మనం ఎక్కడికి వెళ్లగలం? భూమి మనుగడకు అనుకూలంగా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవడం ఒక్కటే మార్గం. పర్యావరణ కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతూ, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతోంది. అదే విధంగా, గోదావరి జిల్లాల్లో నీటి కాలుష్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య సమస్యలను అరికట్టి, ప్రజారోగ్యాన్ని కాపాడాలంటే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి.
సమస్త జీవరాశులతో సహజీవనమే లక్ష్యం
ప్రకృతిలోని ప్రతి చెట్టు, ప్రతి జీవీ పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తాయి. భూమిపై జీవించే హక్కు మానవులతో పాటు సమస్త జీవరాశులకూ ఉంది. ఆ హక్కును గౌరవిస్తూ ప్రకృతితో సహజీవనం చేయాలి. మడ అడవులు, వృక్ష సంపద, జల వనరులను పరిరక్షించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చు. ప్రకృతిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే” అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీన్ కమిషనర్ శ్రీ బి.ఎన్.ఎన్. మూర్తి, అటవీశాఖ సలహాదారులు మల్లికార్జున రావు, డిఎఫ్ఓ త్రిమూర్తుల రెడ్డి, ప్రజా ప్రగతి సేవా సంఘ ప్రెసిడెంట్  వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపాలెంలో పార్క్ ప్రారంభం, రహదారి పనులకు శంకుస్థాపన
అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామంలో రూ. 15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పార్క్‌ను నాగబాబు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు, పిల్లలు ఆటపాటలతో ఆనందంగా గడపడానికి, పెద్దలు సేదతీరడానికి వీలుగా ఈ పార్కును గ్రామ మాజీ సర్పంచ్, జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహక దళ్ సభ్యులు పండ్రాజు లంకమ్మ ప్రసాద్ ఏర్పాటు చేశారు. అలాగే, అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి వెంకట కృష్ణారావు నూతన విగ్రహాన్ని  నాగబాబు ఆవిష్కరించారు. అంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపండుగ 1.0, పల్లెపండుగ 3.0 కార్యక్రమాల ద్వారా సుమారు రూ. 54.60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు సీసీ రోడ్లు, ఒక బీటీ రోడ్డు నిర్మాణ పనులకు నాగబాబు శంకుస్థాపన చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …