Breaking News

విజయవాడ ఉత్సవ్ 2.0కు ప్రత్యేక ఆకర్షణగా ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్

-పున్నమి ఘాట్‌లో ఒకే వేదికపై పాల్గొన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
-తెలుగులో ప్రసంగం ప్రారంభించిన తమిళనాడు సీఎం విజయ్.. విజయవాడ ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు
-2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం ఖాయం: సీఎం చంద్రబాబు
-దక్షిణాది రాష్ట్రాల మధ్య భాష వేరైనా సంస్కృతి, సంప్రదాయాలు ఒక్కటే: ఎంపీ కేశినేని శివనాథ్

విజయవాడ( పున్నమిఘాట్), నేటి పత్రిక ప్రజావార్త:
కృష్ణమ్మ పరవళ్లు తొక్కే పున్నమి ఘాట్ వేదికగా జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలకు మంగళవారం ప్రత్యేక కళ సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఉత్సవాలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వివిధ కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, కళాకారుల ప్రతిభతో పున్నమి ఘాట్ సందడిగా మారింది. ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకే వేదికపైకి రావడంతో అభిమానులు, ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు విజయవాడ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆయన ప్రసంగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.

*తమిళనాడు సీఎం దళపతి విజయ్ మాట్లాడుతూ..*

అందరికీ నమస్కారం అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనడం, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజల మధ్యకు రావడం తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తనకు ఆహ్వానం పలికి, అపారమైన అభిమానాన్ని చూపించిన విజయవాడ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నదుల అనుసంధానంపై చర్చించేందుకు విజయవాడకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. విజయవాడ ప్రజలు చూపించిన ఆదరణ, అభిమానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

“థాంక్యూ విజయవాడ.. మీ అభిమానానికి, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

*సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..*

విజయవాడ ఉత్సవ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం విజయ్ సాధించిన విజయమని పేర్కొన్నారు.

రాష్ట్రాలు వేరైనా తమ అభిమతం ఒక్కటేనని, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఏదైనా సాధించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.

కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో పాటు భవిష్యత్తులో గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, కావేరి ఐదు నదులను అనుసంధానం చేసే లక్ష్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు.

2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ఉత్సవ్‌కు దళపతి విజయ్ రావడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని, శారీరక పరిమితులు ప్రతిభకు అడ్డంకి కావని కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా నిరూపించారని ప్రశంసించారు. ఉత్సవాల్లో నిర్వహించిన కళా ప్రదర్శనలు అద్భుతంగా ఆకట్టుకున్నాయని, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం, నాలెడ్జ్‌తో పాటు ఆధ్యాత్మికత కూడా సమాజానికి అవసరమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇటువంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉత్సవాల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన మరింత పెరుగుతుందని, విజయవాడ ఉత్సవ్‌తో పాటు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

*ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ..*

దక్షిణాది రాష్ట్రాల్లో భాషలు వేరైనా సాంస్కృతిక మూలాలు, సంప్రదాయాలు ప్రజలను కలిపి ఉంచుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ ఉత్సవ్ 2.0కు తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ రావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.

దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పాటు దేశవ్యాప్తంగా నదుల అనుసంధానానికి దిశానిర్దేశం చేస్తున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడిని అభివర్ణించారు.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై పాల్గొని విజయవాడ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడం ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రులిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు.

విజయవాడ ఉత్సవ్ 2.0 ద్వారా నగర సాంస్కృతిక వైభవాన్ని, ఆధ్యాత్మిక విశిష్టతను, కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం కొనసాగుతోందని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమ, వెనిగండ్ల రాము, ఎమ్మెల్సీ వల్లరామయ్య, కార్పొరేషన్ చైర్మన్లు పట్టాభి, తేజస్వి, టిడిపి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామీణాభివృద్ధికి రహదారుల బలోపేతం కీలకం

-ఆత్మకూరులో రూ. 8.91 కోట్లతో నాలుగు లేన్స్ రహదారి అభివృద్ధి -రహదారికి వాయుపుత్ర మార్గ్ గా నామకరణం -మంగళగిరి క్యాంపు …