Breaking News

రైతు కష్టానికి అండగా కూట‌మి ప్రభుత్వం… కేంద్రంతో ఫలించిన చర్చలు

– జీఎస్టీ తగ్గింపు, అదనపు సాయంపై కేంద్రం నుంచి శుభసూచనలు
– వాస్తవాలు తెలుసుకుని కూడా జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
– వైసీపీ కార్యకర్తలకు కండువాలు కప్పి రైతులంటారా?
– క్రిమినల్ రాజకీయాలకు వైసీపీ ప్రతీకగా మారింది
– అధికార దుర్వినియోగం చేసిన వారిని ఉపేక్షించేది లేదు
– వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధ‌వారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెండు రోజులు ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌, ల‌ల‌న్ సింగ్ , శివ‌రాజ్ సింగ్ చౌహ‌న్ ల‌తో విస్తృతంగా చర్చలు జరిపామని, రైతులకు ఊరటనిచ్చే నిర్ణయాలు త్వరలో వెలువడనున్నాయని వెల్లడించారు. ముడి పొగాకుపై జీఎస్టీ తగ్గింపు, అదనపు ఆర్థిక సాయం, ఆక్వా ఫీడ్ ధరల నియంత్రణ వంటి కీలక అంశాలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు.

గత ఏడాది పొగాకు ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఈసారి టొబాకో బోర్డు అనుమతించిన 1.44 మిలియన్ కిలోల ఉత్పత్తికి దాదాపు రెట్టింపు స్థాయిలో సాగు చేశారని తెలిపారు. అదే సమయంలో అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, ముడి పొగాకుపై జీఎస్టీ 27 శాతం నుంచి 40 శాతానికి పెరగడం వంటి పరిణామాలు రంగంపై తీవ్ర ప్రభావం చూపాయని వివరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు సమీక్షలు నిర్వహించి, కంపెనీలు రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని ఆదేశించారని చెప్పారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతార‌మన్ తో సమావేశమై పొగాకు రైతుల సమస్యలను వివరించామని, ముడి పొగాకుపై జీఎస్టీని తగ్గించాలని కోరామని, ఆ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశ ఎజెండాలో చేర్చి సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా టొబాకో బోర్డు వద్ద రైతుల నుంచి వసూలు చేసిన సుమారు రూ.750 కోట్ల సెస్ నిధుల నుంచి కిలోకు రూ.15 చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఇప్పటికే చర్చలు జరిగాయని, రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పొగాకు కొనుగోళ్లపై ఐటీసీ సహా ప్రధాన పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడి రైతుల వద్ద ఉన్న మొత్తం పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయగా, అందరూ సానుకూలంగా స్పందించి కొనుగోళ్లకు హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఆక్వా రంగానికి సంబంధించి ఫీడ్ ధరలు తగ్గించే దిశగా కూడా కేంద్రంతో చర్చలు జరిపామని, ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్‌లో దేశీయ అవసరాలకు కనీసం 50 శాతం నిల్వ ఉంచి మిగిలిన పరిమాణాన్ని మాత్రమే ఎగుమతి చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే ఆక్వా ఫీడ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతులపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. తోతాపురి మామిడి ధరలు తగ్గిన సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి కిలోకు రూ.4 ప్రోత్సాహక సాయం అందించి రైతులను ఆదుకుందని, ఇదే ప్రభుత్వ స్పందనకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.

రాజకీయ నాటకాలతో రైతులను తప్పుదోవ పట్టించొద్దు

గొడ్డ‌లి పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి వ్యవసాయ, ఆక్వా, పొగాకు సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఇప్పుడు రైతుల పేరుతో రాజకీయాలు చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. పొగాకు రైతుల సమావేశాల పేరుతో నిజమైన రైతులను కాకుండా వైసీపీ కార్యకర్తలకు కండువాలు కప్పి రైతులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భీమవరంలో జరిగిన ఆక్వా రైతుల ముఖాముఖి కార్యక్రమంలో కూడా డబ్బులు ఇచ్చి మహిళలు, వృద్ధులను తీసుకొచ్చి రైతుల సమావేశంగా ప్రచారం చేశారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన రెండు ఘటనలను ప్రస్తావించిన మంత్రి, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉందని, ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుందని తెలిపారు. అలాగే మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం భూ ఆక్రమణ ఆరోపణలపైనా చట్టబద్ధ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బాధితుల‌ను కాకుండా త‌ప్పుచేసిన వారిని ప‌రామ‌ర్శ‌ల పేరుతో ధ‌ర్మాన సోద‌రులు ర్యాలీలు చేయ‌డం విడ్డురంగా ఉంద‌న్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వ భూములకు కాపలాదారుడిగా వ్యవహరిస్తానని, నిజాయితీగా పనిచేసినందుకే గతంలో ఎదురైన ఇబ్బందులను ఎదుర్కొని నిర్దోషిగా బయటకు వచ్చానని మంత్రి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో తప్పు చేసిన వారు సొంత కార్యకర్తలైనా చర్యలు తప్పవని, గుంటూరులో మహిళపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. అయితే వైసీపీలో మాత్రం తప్పు చేసిన వారికి పదవులు ఇవ్వడం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు రాజకీయాల పేరుతో మోసపోకుండా వాస్తవాలను గుర్తించాలని, అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *