Breaking News

వైద్యరంగంలో జయప్రద ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎనలేనివి… : మంత్రి సత్య కుమార్ యాదవ్ 

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా జయప్రద ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం రాత్రి విజయవాడలోని ఎన్ ఎ సి కళ్యాణ వేదిక లో జయప్రద ఫౌండేషన్ వారి సేవా సంకల్పం-2026 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండపు దశరథ జనార్దన్ రావు ఈ ఫౌండేషన్ అనతి కాలంలోనే ప్రజలకు చేరువ చేశారన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాయన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా వైద్యరంగంలో జయప్రద ఫౌండేషన్ ద్వారా టీడీ జనార్ధన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. తనకు విద్యార్థి దశ నుండే జనార్ధన్ తెలుసునని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుండి ఎన్టీ రామారావు కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు అత్యంత సమీపంగా పనిచేస్తూ తాను చేపట్టిన ప్రతి రంగంలోనూ ఒక క్రమశిక్షణతో ఒక లక్ష్యంతో పనిచేసి పేరు గడించారన్నారు. తాను దత్తత తీసుకున్న మూడు గ్రామాలతో పాటు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జయప్రద ఫౌండేషన్ విస్తృతంగా తమ వైద్య సేవలను అందిస్తున్నందుకు అభినందించుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దీనిలో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలల్లో 28% ఓపి పెరిగినట్లు పేర్కొన్నారు. ఇదేవిధంగా ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రభుత్వ వైద్యశాల పట్ల ఆప్పటివరకు ఉన్న 60 శాతం నమ్మకాన్ని 76% వరకు పెరిగిందని తెలిపారు. త్వరలో 104 సర్వీస్ ద్వారా 3500 రూపాయలు విలువ చేసే41 రకాల వైద్య పరీక్షలు గ్రామాల్లో ప్రజలకు చేరువ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 18 బోధన ఆసుపత్రులలో క్యాన్సర్ వైద్యశాలలను నెలకొల్పుతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడాదికి 15 లక్షలు క్యాన్సర్ కేసులు నమోదు అవుతుండగా వీరిలో 7,80,000 మంది మృతి చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలో గుర్తిస్తే తగు చికిత్స లభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15 నుండి సంజీవిని ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించుకొని యోగాని మానవ జీవితంలో ఒక ఆరోగ్యవంతమైన భాగంగా రూపొందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కార్యక్రమాలు కూడా తోడవడంతో త్వరగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని పేర్కొన్నారు. జయప్రద ఫౌండేషన్ చైర్మన్ టి డి జనార్దన్ మాట్లాడుతూ 2018వ సంవత్సరంలో తమ కుమారుడు, కుమార్తె స్థాపించిన ఈ ఫౌండేషన్ అనతి కాలంలోనే అందరి సహకారంతో విశేషంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పట్టణాల్లో ఉన్న కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ ఫౌండేషన్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, క్యాన్సర్ స్క్రీనింగ్లు, గుండెకు సంబంధించిన, ఇతర వ్యాధులకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలు, అవసరమైన మందులను ఉచితంగానే అందిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ టీడీ జనార్ధన్ తాను చేపట్టిన ప్రతి పనిని క్రమశిక్షణతో అంకితభావంతో చేయడం ద్వారా మంచి గుర్తింపు పొందారున్నారు. ఫౌండేషన్ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు, ఎన్టీఆర్ లిటరేచర్ కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తలకు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ఎల్లవేళల వారి సమస్యలు పరిష్కరించడం చేస్తున్నట్లు తెలిపారు. జయప్రద ఫౌండేషన్ ద్వారా వేలాది రూపాయలు విలువచేసే ఆపరేషన్లను ఉచితంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి పులాల చంద్రశేఖర్, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీరామ్, విజయవాడ లేడీస్ సర్కిల్ చైర్ పర్సన్ ఐశ్వర్య, విజయవాడ రౌండ్ టేబుల్ చైర్మన్ కల్లూరి శ్రీకర్, రోటరీ క్లబ్ అమరావతి కార్యదర్శి డాక్టర్ సంధ్య, విద్యా భారతి ఉపాధ్యక్షులు వెలగపూడి రామకృష్ణ, మాజీ శాసన మండలి సభ్యులు చిగురుపాటి వరప్రసాద్, జయప్రద ఫౌండేషన్ మెంటర్ చాముండేశ్వరి, కోఆర్డినేటర్ కట్టా వెంకట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *