Breaking News

పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు

-మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-కుంకీలకు స్వయంగా ఆహారం అందించిన ఉప ముఖ్యమంత్రి
-జెండా ఊపి గుచ్చిమి క్యాంపుకు సాగనంపిన పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం పలికారు. గజరాజులకు మార్గమధ్యంలో పూలు చల్లి స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి, వాటికి స్వయంగా ఆహారం అందజేశారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీల రెండో అంచె ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు.
ఈ సందర్భంగా ప్రయాణంలో కుంకీల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులకు  పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. గుచ్చిమి క్యాంపునకు చేరిన అనంతరం నిపుణుల పర్యవేక్షణలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జయంత్, అభిమన్యుల సేవలు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మానవ-ఏనుగు ఘర్షణల నియంత్రణకు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలను కూటమి ప్రభుత్వం శాస్త్రీయ, మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు.
– ఒడిశా వైపు నుంచి ఏనుగులు
ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపులు తరచూ పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశిస్తూ పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో, మానవ-ఏనుగు ఘర్షణల నివారణకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ కుంకీ ఏనుగులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు. మానవ-ఏనుగు ఘర్షణల నివారణ చర్యల్లో భాగంగా కుంకీ ఏనుగులైన జయంత్, అభిమన్యులను వినియోగిస్తారు.
గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కీలక ఆపరేషన్లలో ఈ రెండు కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషించాయి. అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో ఎంతో చురుకుగా వ్యవహరించాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *