-కార్యక్రమానికి హాజరైన అయ్యంకి మనవడు మురళీకృష్ణ, మల్లెతీగ కలిమిశ్రీ
-‘మనిషి కోసం’ పుస్తకాన్ని ఆవిష్కరించి, స్వయంగా స్వీట్లు పంచిన అయ్యంకి మురళీకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘పౌర గ్రంథాలయాలే జ్ఞాన దేవాలయాలు’ అనే నినాదంతో ఊరూరా గ్రంథాలయ చైతన్యోద్యమం నడిపిన గ్రంథాలయోద్యమ పితామహుడు, పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణయ్య అని విశ్రాంత ఆచార్యులు, వెంకట రమణయ్య మనవడు అయ్యంకి మురళీకృష్ణ అన్నారు. అయ్యంకి వెంకటరమణయ్య 136వ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ బందరురోడ్డులో గల ఠాగూర్ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారిణి రమాదేవి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మురళీకృష్ణ, నవమల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వెంకట రమణయ్య చిత్రపటానికి, శిలాఫలకానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కలిమిశ్రీ మాట్లాడుతూ- నిరక్షరాస్యత, అజ్ఞానం, మూఢ నమ్మకాలు, ఛాందస భావాల నివారణకు గ్రంథాలయాల స్థాపనే పరిష్కారమార్గమని ఎంచి గ్రంథాలయాల వ్యాప్తికి అయ్యంకి వెంకటరమణయ్య నడుం కట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పడాల నీలా రమేష్ గౌతమ్ రాసిన ‘మనిషి కోసం’ వ్యాస, కవితా సంపుటిని అయ్యంకి మురళీకృష్ణ- కలిమిశ్రీ ఆవిష్కరించారు. గ్రంధాలయాధికారిణి రమాదేవి మాట్లాడుతూ- ఆ మహనీయుడు ఏర్పాటు చేసిన గ్రంధాలయాలు నేడు యువతరానికి పఠన కేంద్రాలుగానే కాక ఉద్యోగ ప్రసాదిత కేంద్రాలుగా కూడా ఉపయోగపడుతున్నాయన్నారు. మరో ప్రభుత్వ కార్యక్రమంలో వుండి రాలేకపోయిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఫోను ద్వారా పంపిన నివాళి సందేశాన్ని రమాదేవి చదివి వినిపించారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికీ అయ్యంకి మురళీకృష్ణ స్వయంగా స్వీట్లు పంచారు. పుస్తక రచయిత పడాల నీలా రమేష్ గౌతమ్ ని గ్రంధాలయం పక్షాన అతిధులు సత్కరించారు. కార్యక్రమంలో రచయిత, ప్రొఫెసర్ షేక్ సలీమ్ బాబు, సీనియర్ జర్నలిస్టు చొప్పా రాఘవేంద్రశేఖర్, సీనియర్ ఫొటో జర్నలిస్టు వై. డి. ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News