Breaking News

టమాటా ధరలపై తప్పుడు ప్రచారం.. రైతుల ప్రయోజనాలతో చెలగాటమా?: మంత్రి అచ్చెన్నాయుడు

– వాస్తవాలు తెలుసుకోకుండా రైతుల సమస్యలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదు
– రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా మార్కెట్ పరిస్థితులపై నిరంతర సమీక్ష
– జూలై 5 నుంచి 261 టన్నుల టమాటా కొనుగోలు.. రైతు బజార్లలో నో లాస్–నో ప్రాఫిట్ విధానంలో విక్రయాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
టమాటా ధరలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా రైతులకు కిలోకు కేవలం రూ.2 మాత్రమే లభిస్తోందంటూ వైసిపి పార్టీ తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి రైతులను అయోమయానికి గురిచేసేలా ప్రచారం చేయడం సరికాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టమాటా సగటు ధర కిలోకు రూ.10.55గా ఉందని, అన్నమయ్య జిల్లాలో రూ.10.58, మదనపల్లె మార్కెట్‌లో రూ.11గా ధర నమోదవుతోందని మంత్రి తెలిపారు. నిన్నటి మార్కెట్ ధరలను పరిశీలిస్తే వివిధ మార్కెట్లలో కనిష్టంగా రూ.6 నుంచి గరిష్టంగా రూ.16 వరకు ధరలు ఉన్నాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా టమాటా రైతులకు కిలోకు కేవలం రూ.2 మాత్రమే లభిస్తోందని చెప్పడం వాస్తవ విరుద్ధమని అన్నారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్‌లో సరఫరా, డిమాండ్‌ను సమతుల్యం చేసేందుకు వ్యవసాయ మార్కెటింగ్, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఏడాది అధిక దిగుబడుల కారణంగా మార్కెట్లకు టమాటా రాక పెరిగినప్పటికీ, ముందస్తు ప్రణాళికలో భాగంగా సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించడం, దశలవారీగా నాట్లు వేయించడం వంటి చర్యల ద్వారా ఒకేసారి అధిక సరఫరా ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. జూలై నెలలో మార్కెట్లకు రోజువారీగా సగటున 5,000 నుంచి 5,500 మెట్రిక్ టన్నుల టమాటా రాకలు నమోదవుతున్నాయని, నిన్న వివిధ మార్కెట్లకు సుమారు 6,000 నుంచి 7,000 మెట్రిక్ టన్నుల వరకు రాకలు వచ్చాయని మంత్రి తెలిపారు. 12,225 మెట్రిక్ టన్నుల టమాటా రాకలు నమోదయ్యాయని, రాప్తాడు మార్కెట్‌లో భారీ స్థాయిలో లావాదేవీలు జరిగాయని ప్రచారం చేయడం కూడా వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రాప్తాడు మార్కెట్‌లో టమాటా రాకలే నమోదు కాలేదని తెలిపారు.

గత రెండేళ్లలో మొత్తం సీజన్‌లో టమాటా ధరలు కిలోకు రూ.3 నుంచి రూ.6 మధ్యే ఉన్నాయంటూ చేస్తున్న ప్రచారం కూడా వాస్తవాలను వక్రీకరించేదేనని మంత్రి అన్నారు. 2024, 2025 సంవత్సరాల్లో పలు నెలల్లో టమాటా ధరలు ఈ స్థాయికి మించి గణనీయంగా నమోదయ్యాయని వివరించారు. రైతుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి ప్రచారం చేయకుండా, క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపడుతున్న మార్కెట్ జోక్య చర్యల్లో భాగంగా ఈ ఏడాది జూలై 5 నుంచి ఇప్పటివరకు సుమారు 261 టన్నుల టమాటాను సేకరించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సేకరించిన టమాటాలను రాష్ట్రంలోని రైతు బజార్లలో ‘నో లాస్–నో ప్రాఫిట్’ విధానంలో వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.

రైతుల కష్టాలను రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడం కాకుండా, వారి సమస్యలకు పరిష్కారం చూపడంపై దృష్టి పెట్టాలని మంత్రి హితవు పలికారు. నిరాధార ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం కాదని, వారికి అండగా నిలిచి వారి ప్రయోజనాలను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *