-‘ఇంటింటికీ తెలుగుదేశం’లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
29వ డివిజన్ మధురానగర్ నేతాజీ రోడ్డులోని రమాదేవి స్కూల్ నుంచి సోమవారం ‘రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి’ కార్యక్రమంలో భాగంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్థానిక ప్రజలను కలుసుకుని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం గత 24 నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. టీడీపీ శ్రేణులతో పాటు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని బొండా ఉమ తెలిపారు. రూ.3,000గా ఉన్న సామాజిక భద్రతా పింఛన్‌ను రూ.4,000కు పెంచామని, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రయోజనం అందించామని చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.6,000కు పెంచడంతో పాటు బెడ్రిడెన్లకు రూ.10,000, తలసేమియా బాధితులకు రూ.15,000 అందిస్తున్నామని తెలిపారు. మహిళల కోసం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పులు, లోటు బడ్జెట్ వంటి అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పేదలు, సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి లోటు లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని బొండా ఉమ అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని బొండా ఉమ అన్నారు. గత 24 నెలల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు రూ.550 కోట్ల నిధులు ఖర్చు చేశామని తెలిపారు. ROBలు, రా వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్లు, రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, పాఠశాల భవనాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టామని చెప్పారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. “అధికారం మాకు అలంకారం కాదు.. బాధ్యత” అని స్పష్టం చేశారు.
29వ డివిజన్లోని నేతాజీ కాలనీ, తుంగం రాములు వీధి, నర్సరాజు రోడ్ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యకు ప్రత్యేకంగా జీవో 306 తీసుకువచ్చి రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని బొండా ఉమ తెలిపారు. కోట్ల రూపాయల విలువైన ఇళ్లకు యాజమాన్య హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. ప్రస్తుతం ప్రజల దృష్టికి వచ్చిన సీలింగ్ ల్యాండ్స్ సమస్యను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి, ప్రతి కుటుంబానికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మధురానగర్ ప్రాంతంలో సుమారు రూ.10 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని బొండా ఉమ తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలిచామని చెప్పారు.
మధురానగర్ ఏలూరు కాలువ కట్టపై వాకింగ్ ట్రాక్, గ్రీనరీ గార్డెన్ ఏర్పాటు, సుందరీకరణ పనులను రూ.80 లక్షలతో చేపట్టామని తెలిపారు. సాయిబాబా కాలనీ, నేతాజీ కాలనీ, ఇంద్ర కాలనీలలో దెబ్బతిన్న కల్వర్టుల పునరుద్ధరణకు రూ.18.54 లక్షలు, యు.వి. నరసరాజు రోడ్ వెంట ఏలూరు కాలువ కట్టకు GI లింక్ మెష్ ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ.17.54 లక్షలు వెచ్చించామని వివరించారు. మధురానగర్ RUB వద్ద వాంబే కాలనీ వైపు, BRTS వైపు రిటైనింగ్ వాల్స్‌పై మ్యూరల్ ఆర్ట్స్ పెయింటింగ్ పనులకు రూ.15.54 లక్షల చొప్పున నిధులు కేటాయించామని తెలిపారు.
బుడమేరు వరదల కారణంగా VV నరసరాజు రోడ్డులోని సాయిబాబా ఆలయం వద్ద దెబ్బతిన్న కల్వర్టుల పునరుద్ధరణకు రూ.4.90 లక్షలు, శ్రీకృష్ణ ఆలయం వద్ద కల్వర్టుల పునరుద్ధరణకు రూ.3.98 లక్షలు ఖర్చు చేశామని చెప్పారు. మధురానగర్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణానికి ఆటంకంగా ఉన్న UGD కనెక్షన్ల మార్పునకు రూ.3.24 లక్షలు, నేతా శ్రీ కాలనీ రోడ్ నుంచి పప్పుల మిల్లు రోడ్ వరకు ఏలూరు కాలువ కట్టకు ఫెన్సింగ్ కోసం పిల్లర్ల ఏర్పాటుకు రూ.3.13 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సామాజిక భద్రతా పింఛన్ల ద్వారా 865 మంది లబ్ధిదారులకు ప్రతినెల రూ.38.44 లక్షల చొప్పున 24 నెలల పాటు మొత్తం రూ.922.44 లక్షలు, అంటే సుమారు రూ.9.22 కోట్లు అందించినట్లు బొండా ఉమ తెలిపారు. పేద కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో P-4 కార్యక్రమం కింద 25 మంది లబ్ధిదారులకు తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు పంపిణీ చేసి వారి జీవనోపాధికి అండగా నిలిచామని చెప్పారు.
అదేవిధంగా 50 మంది దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, 15 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు పంపిణీ చేసి దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపుతూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడమే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని బొండా ఉమ గారు అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మధురానగర్‌ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి పద్మశాలి డైరెక్టర్ రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ సింగం వెంకన్న, 29వ డివిజన్ టిడిపి అధ్యక్షులు పెద్దిరెడ్డి వెంకటేశ్వరావు, సెక్రటరీ ఏవి రాంబాబు డివిజన్ ఇంచార్జి కొంగితల లక్ష్మీపతి, నారాయణమూర్తి, బర్మ శీను, అడపా కోటేశ్వరావు, మరియు జనసేన నాయకులు శ్యామ్ , రమణ సాధు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News