Breaking News

గ్లోబల్ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్:మంత్రి కందుల దుర్గేష్

-న్యూఢిల్లీలో జరిగిన ఐఏటీఓ సమావేశంలో ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి గ్లోబల్ టూర్ ఆపరేటర్లు భాగస్వాములు కావాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపు
-గోదావరి పుష్కరాలు-2027 కు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం, ఏపీలో పర్యాటక అవకాశాలపై ఐఏటీఓ సమావేశంలో ప్రత్యేక చర్చ
-పుష్కరాల నాటికి ఆధ్యాత్మిక సర్క్యూట్లు, పంచారామ క్షేత్రాల దర్శనం, రివర్ క్రూయిజ్ అనుభవాలు, విలేజ్ అండ్ నేచర్ టూరిజం వంటి ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించాలని టూర్ ఆపరేటర్లను కోరిన మంత్రి దుర్గేష్
-సెప్టెంబరు 10 నుండి 13 వరకు విశాఖపట్నంలో పర్యాటక శాఖ, ఐఏటీవో సంయుక్తంగా నిర్వహించే ఐఏటీఓ వార్షిక సదస్సుకు హాజరుకావాలని దేశ, విదేశీ టూర్ ఆపరేటర్లకు మంత్రి దుర్గేష్ ఆహ్వానం

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే అత్యంత వైవిధ్యమైన పర్యాటక ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్(ఐఏటీవో), ట్రావెల్ ట్రేడ్ భాగస్వాములు, హోటల్ రంగానికి చెందిన ప్రముఖులతో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సోమవారం న్యూఢిల్లీలోని తాజ్ అంబాసిడర్ హోటల్ లో ఒక ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..రాష్ట్రంలో అపారమైన పర్యాటక అవకాశాలు ఉన్నాయని, అధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక, తీరప్రాంత, ప్రకృతి, వెల్నెస్, క్రూయిజ్ టూరిజం విరాజిల్లుతోందన్నారు. కేంద్ర సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని వివరిస్తూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడిదారుల అనుకూల పర్యాటక విధానాలు, మెరుగైన రవాణా వసతులను ఉపయోగించుకొని రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య, వారి బస సమయం మరియు ఖర్చును పెంచేలా వినూత్న టూర్ ప్లాన్లు, డెస్టినేషన్ ఆధారిత, అనుభవపూర్వక, సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దేశ విదేశీ టూర్ ఆపరేటర్లను మంత్రి దుర్గేష్ ఆహ్వానించారు. ట్రావెల్ రంగానికి చెందిన భాగస్వాములతో బలమైన సంబంధాలు అవసరమని పేర్కొన్నారు. డెస్టినేషన్ ఫెమిలియరైజేషన్ విజిట్లు, ప్రచార మద్దతు, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ మరియు ఇతర భాగస్వాముల సదుపాయాల కల్పన ద్వారా టూర్ ఆపరేటర్లకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

గోదావరి పుష్కరాలు 2027 – అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం:

ఈ భేటీలో ప్రత్యేకించి 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలు గురించి సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఉత్సవాన్ని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాకుండా గోదావరి తీరప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, హస్తకళలు, ఆహార సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఉన్న వందలాది ఘాట్లలో నిర్వహించే ఈ పుష్కరాలు పర్యాటక మరియు హోటల్ రంగ వ్యాపారాలకు సరికొత్త అవకాశాలను తెచ్చిపెడతాయని పేర్కొన్నారు.గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఆధ్యాత్మిక సర్క్యూట్లు, పంచారామ క్షేత్రాల దర్శనం, రివర్ క్రూయిజ్ అనుభవాలు, విలేజ్ అండ్ నేచర్ టూరిజం,జిఐ ఉత్పత్తుల పర్యటనలు, గ్రామీణ, ప్రకృతి ఆధారిత పర్యాటకం వంటి ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించాలని టూర్ ఆపరేటర్లను మంత్రి దుర్గేష్ కోరారు. పుష్కరాల కోసం ఘాట్ల అభివృద్ధి, వసతి సౌకర్యాల పెంపు, రివర్ ఫ్రంట్ అందాలను తీర్చిదిద్దడం, డిజిటల్ సేవలు, మౌలిక వసతుల కల్పన, సమగ్ర ప్రచార కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు.ట్రావెల్ ట్రేడ్‌తో సుదీర్ఘకాల భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడానికి ఏపీ పర్యాటక శాఖ కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ పునరుద్ఘాటించారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా పరిచయం చేసేందుకు ఐఏటీఓ సభ్యులు కలసిరావాలని కోరారు. టూర్ ఆపరేటర్లు, ఇతర భాగస్వాముల మద్దతుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, గోదావరి పుష్కరాలు 2027ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక చారిత్రక పర్యాటక, సాంస్కృతిక ఉత్సవంగా తీర్చిదిద్దగలమని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు.

సెప్టెంబర్ లో విశాఖపట్నంలో ఐఏటీఓ వార్షిక సదస్సు:

ట్రావెల్ రంగానికి చేరువయ్యే కార్యక్రమంలో భాగంగా ఏపీ పర్యాటక శాఖ, ఐఏటీవో సంయుక్తంగా 2026 సెప్టెంబరు 10 నుండి 13 వరకు విశాఖపట్నంలో నిర్వహిస్తోన్న ఐఏటీఓ (IATO) వార్షిక సదస్సుకు రావాలని మంత్రి దుర్గేష్ టూర్ ఆపరేటర్లకు ఆహ్వానం పలికారు.. ఈ సదస్సు ద్వారా దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటక నిపుణులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అవకాశాలను ప్రత్యక్షంగా పరిశీలించి, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేందుకు మంచి వేదిక లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకరంగ అభివృద్ధికి ప్రైవేట్ భాగస్వాములు మరియు టూర్ ఆపరేటర్లకు కూటమి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం, ప్రచార మద్దతు అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు.

అనంతరం పాత్రికేయులతో జరిగిన సమావేశంలో ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పర్యాటక రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు సంబంధించిన పలు ప్రశ్నలకు మంత్రి దుర్గేష్ వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు.

ఈ సమావేశంలో ఐఏటీవో ప్రతినిధులు రవి గోసేన్, రాజ్ నిష్ కైస్తా, రాజీవ్ మెహ్రా, సంజయ్ రజ్దన్, సునీల్ మిశ్రా, దీపక్ భట్రాగర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *