-16 వేలకుపైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన లోకేష్‌ను చూసి ఓర్వలేక విషప్రచారం
-ఐదేళ్లలో డీఎస్సీ ఇవ్వలేని జగన్.. ఇప్పుడు నీతులు చెబుతారా?
-అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ లక్ష్యం
-గొడ్డలి పార్టీ వైఖరి పై మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమా
విజయవాడ (గొల్లపూడి), నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభకు రావడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌రెడ్డికి భయమెందుకని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. మండలి రద్దు చేస్తానని గతంలో చెప్పిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు మండలికి వెళ్తూ శాసనసభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు, అక్రమాలు, దోపిడీపై వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతోనే సభకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు.
డీఎస్సీలో అర్హత సాధించేందుకు ఏళ్ల తరబడి కష్టపడ్డ పేద, మధ్యతరగతి నిరుద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఉమా మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ పోస్టు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ 16 వేలకుపైగా టీచర్ పోస్టులను భర్తీ చేయడంతో ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అమరావతిని అడ్డుకోవడమే జగన్ విధానమని ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి సహా కీలక నిర్మాణాలను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని దేవినేని ఉమా తెలిపారు. అమరావతిని ‘న భూతో న భవిష్యత్’ అన్న రీతిలో దేశం గర్వించేలా ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అమరావతి అభివృద్ధిని చూసి ఓర్వలేకనే జగన్ అండ్ కో కడుపుమంటతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జీఏడీకి అప్పగించనున్నారని తెలిపారు.
చనిపోయిన వారిని పరామర్శించకుండా, చంపిన వారిని పరామర్శించడం జగన్‌రెడ్డి నైజానికి అద్దం పడుతోందని దేవినేని ఉమా విమర్శించారు. పల్నాడు ఘటనలపై ఫోన్ పరామర్శల వెనుక విద్వేషాలు సృష్టించాలన్న కుట్రలు బయటపడ్డాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఫేక్ ప్రచారాలకు వైసీపీ పరిమితమైందని, ఆ ప్రచారానికి శాసనసభ, మండలిలో కూటమి ప్రభుత్వం గట్టిగా సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు.
మొదటి ఏడాదిలోనే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తికాకుండా అడ్డుకునేందుకు జగన్‌రెడ్డి ప్రయత్నాలు చేశారని దేవినేని ఉమా ఆరోపించారు. తమ హయాంలో జరిగిన గ్రూప్-1 ప్రశ్నాపత్రాల లీకేజీ, ల్యాండ్, సాండ్, వైన్, మైన్ వ్యవహారాలు అంశాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే జగన్ శాసనసభకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలుగా గెలిపించిన ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న గొడ్డలి పార్టీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు
Prajavartha Online Telugu News