-సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన షాపులు, షేడ్ నెట్స్, వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
-నర్సరీ రైతుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి..నర్సరీ రైతులకు త్వరలోనే బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ హామీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచానికి అందమైన ప్రకృతిని పరిచయం చేయడంలో కడియం నర్సరీ రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి నర్సరీ రైతులే జీవకర్ర అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. కేవలం 20 మందితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 2,000 మంది సభ్యులతో మహా వృక్షంలా ఎదగడం అభినందనీయమన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియపులంక గ్రామంలోని సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ హాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పురుగుమందులు, ఎరువుల షాపులు, షేడ్ నెట్స్ విక్రయ కేంద్రాలు మరియు వాటర్ ప్లాంట్‌ను రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. నర్సరీ రైతులకు అవసరమైన పురుగుమందులు, ఎరువులు, షేడ్ నెట్స్, కవర్లు (పోలీ బ్యాగ్స్) ఒకే చోట, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీల నుంచే తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడంలో అసోసియేషన్ కృషి ప్రశంసనీయమని అభినందించారు. రాజానగరం ప్రాంతం నుండి కడియంకు మట్టిని తరలించడంలో రైతులు ఎదుర్కొంటున్న వ్యయభారాన్ని తగ్గించేందుకు అధికారులతో మాట్లాడి రవాణా ఖర్చులు తగ్గేలా చర్యలు తీసుకున్నామని మంత్రి గుర్తుచేశారు.నర్సరీ రంగం అందరి రైతులకు లాభసాటిగా మారేలా, వారికి బ్యాంకుల నుంచి ఇతోధికంగా ఆర్థిక సహాయం అందేలా త్వరలోనే బ్యాంకర్లతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.వాల్టా చట్టం, ఉచిత విద్యుత్ అంశాలను ప్రస్తావిస్తూ… గతంలో తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నర్సరీలకు ఉచిత విద్యుత్ సాధించిన విషయాన్ని తద్వారా రైతులకు కలిగిన మేలును మంత్రి గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ‘పీఎం సూర్యఘర్’ పథకం ద్వారా సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవాలని, నర్సరీ రైతులకు సోలార్ మోటార్లు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ద్వారా ‘కడియం నర్సరీ అసోసియేషన్’ (కేఎన్ఏ) బ్రాండ్ పేరిట నీటి బాటిళ్లను తయారు చేయడం విశేషమని, ఈ బ్రాండింగ్ ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు, సందర్శకులకు, వ్యాపారులకు కడియం గొప్పతనాన్ని, అసోసియేషన్ గుర్తింపును మరింత పెంచుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రకృతికి ప్రాణం పోస్తూ, కడియం పేరును ప్రపంచ పటంలో నిలిపిన నర్సరీ కార్మికుల అంకితభావాన్ని, శ్రమను ప్రత్యేకంగా అభినందించారు.నర్సరీ అసోసియేషన్ అంటే నాలుగు గోడల భవనం మాత్రమే కాదు… రైతులకు అవసరమైన ప్రతీ సేవనూ ఒకే గొడుగు కిందకు తెచ్చే వ్యవస్థ అని పేర్కొన్నారు.నర్సరీ రైతులు, కూలీల ముఖాల్లో సంతోషం చూసినప్పుడే తమకు ఆనందం కలుగుతుందని, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి నర్సరీ రైతుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.రైతులు వాస్తవ పరిస్థితులను, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలను సమర్థవంతంగా వాడుకుంటూ నర్సరీ రంగాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రైతులు ఉత్పత్తులు సాగు చేయాలని, అవసరం లేని పంటలు పండించి నష్టపోవద్దని రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు పూర్తి సహకారం అందుతుందని, వామ్థా చట్టం, నీటి కేటాయింపులు, డ్రిప్ ఇరిగేషన్, షేడ్నెట్ల వంటి సదుపాయాలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. రైతు ఆదాయం పెరగాలంటే ఉత్పత్తి మాత్రమే కాకుండా మార్కెట్ అనుసంధానం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వ్యవసాయ వ్యయాలను తగ్గించేందుకు సబ్సిడీ లేదా ఉచిత విద్యుత్ కనెక్షన్లు, స్థానిక పూల మార్కెట్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. మిగులు లేదా వ్యర్థంగా మారే ఉత్పత్తులను ఔషధాలు, సువాసన ద్రవ్యాలు వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు రైతులకు సరైన శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులు విలువ ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేస్తే ఆదాయం మరింత పెరుగుతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం అయ్యప్ప, కార్యవర్గ సభ్యులు బోడపాటి గోపి, కొండెపూడి రాఘవ, నాగేశ్వరరావు, రత్తయ్య, వరలక్ష్మీనాయుడు, పిల్లా శ్రీనివాస్, శేషుకుమార్, సత్యనారాయణ, రమేశ్, శివన్నారాయణ, గాదె నాగేశ్వరరావు, ప్రవీణ్ వాసులతో పాటు ప్రత్యేక అతిథులు మార్గాని సత్యనారాయణ, పుల్లా ఆంజనేయులు, నర్సయ్య, చంటి, గణపతి, గోవింద్, స్థానిక నాయకులు, నర్సరీ రైతులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News