విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఏపీఐఐసీ కాలనీలోని పార్కును సందర్శించి, అక్కడి సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పార్కుల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ప్రజలకు కేవలం ఆహ్లాదం అందించడమే కాకుండా, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కుల నిర్వహణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కమిషనర్ సూచించారు. పార్కులను తమ సొంత ఆస్తులుగా భావించి పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉండేలా పరిరక్షించడంతో పాటు, వాటి అభివృద్ధి, నిర్వహణకు తమ సమయాన్ని కేటాయించాలని కోరారు. ప్రజల సహకారంతో పార్కులను మరింత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరమైన వాతావరణానికి కేంద్రాలుగా తీర్చిదిద్దవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News