– అత్యంత పారదర్శక విచారణతో పరిష్కారం
– ఓటుహక్కు పరిరక్షణ కోసమే సమగ్ర ప్రక్రియ
– దోష రహిత ఓటర్ల జాబితా రూపకల్పనలో ప్రతిఒక్కరూ భాగస్వాములుకండి
– రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా జారీచేస్తున్న నోటీసులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి నోటీసుకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, విచారించి, అర్హత ఉన్న ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో కలెక్టర్ లక్ష్మీశ సమావేశం నిర్వహించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నోటీసు రావడం అంటే ఓటు హక్కు తొలగించినట్లు కాదని.. నోటీసు అందుకున్న వారు నిర్ణీత గడువులోగా తమ వద్ద ఉన్న ఆధారాలు, సంబంధిత పత్రాలను సమర్పించి తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చన్నారు. ప్రతి కేసును నిష్పక్షపాతంగా పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈఆర్‌వో స్థాయిలోనూ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాను దోష రహితంగా, కచ్చితత్వంతో రూపొందించడమే లక్ష్యంగా జరుగుతున్న ప్రక్రియలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటివరకు 1,85,718 నోటీసుల పంపిణీ జరిగిందని.. వీటిలో 32,996 మందికి విచారణ నిర్వహించడం జరిగిందన్నారు. 69,717 మందికి విచారణ షెడ్యూలు గడువు ముగియగా విచారణ కోసం రీషెడ్యూల్ చేయాల్సి ఉందన్నారు. ఈ నెల 22వ తేదీతో పాటు పాటు 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎవరికి ఏ సందేహమున్నా క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు సహాయసహకారాలకు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. కొత్తగా ఓటు నమోదుకు వీలుకల్పించే ఫారం-6తో పాటు ఫారం-7, ఫారం-8లు కూడా వారి వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని.. అర్హులైన ప్రతిఒక్కరూ కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు వై.రామయ్య (తెదేపా), పి.గోవింద (భాజపా), టి.హరికృష్ణ (ఏఏపీ), బి.మురళీకృష్ణ (ఐఎన్‌సీ), డీవీ కృష్ణ (సీపీఎం) తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News