– సెప్టెంబర్ 7న వరల్డ్ డుచెన్ అవేర్‌నెస్ డే సందర్భంగా నిర్వహణ
– అరుదైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) అరుదైన జన్యుపరమైన వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 7న వరల్డ్ డుచెన్ అవేర్‌నెస్ డే సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహాయసహకారాలు అందించాలని అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శోభారాణి సుంకర జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. కార్యక్రమానికి అవసరమైన సంబంధిత శాఖల సమన్వయం, సహకారం అందిస్తామంటూ ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సానుకూలంగా స్పందించారు. ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా సమష్టి కృషితో లక్ష్యాల సాధనకు కృషిచేస్తున్నామని, ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. డీఎండీ అరుదైన జన్యుపరమైన వ్యాధి కాగా, సకాలంలో వ్యాధి నిర్ధారణ, జన్యు పరీక్షలు, వైద్య చికిత్స, పునరావాసం, సామాజిక సహాయ సేవలపై తల్లిదండ్రులు, సంరక్షకులు, ప్రజలు, వైద్య నిపుణుల్లో అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని శోభారాణి సుంకర ఈ సందర్భంగా తెలిపారు. యాక్సెస్ ఛేంజెస్ లైవ్స్ అనే 2026 సంవత్సరపు థీమ్‌కు అనుగుణంగా డీఎండీతో పాటు పాటు ఇతర అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు, కుటుంబాలకు సకాలంలో వైద్యం, పునరావాసం, విద్య, సామాజిక సహాయ సేవలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని కార్యక్రమం ద్వారా చాటిచెప్పనున్నట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News