విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఈ నెల 14వ తేదీన (బుధవారం) గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శన పర్యటన షెడ్యూల్ మరియు ఆలయ మహానివేదన సమయాలపై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వాస్తవాలను వెల్లడిస్తోంది.
భారత రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి రాష్ట్రపతి భవన్ సెక్రటేరియట్, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (GAD), పోలీస్ మరియు జిల్లా యంత్రాంగంతో ప్రాథమిక సమన్వయం జరుగుతోంది వారి పర్యటన అధికారిక, తుది మినిట్-టు-మినిట్ షెడ్యూల్ ఉన్నత స్థాయిలో నిర్ణయించబడుతుందని
తెలియజేస్తున్నాము.
దేవస్థానంలో ప్రతీరోజూ సాయంత్రం 06:00 గంటల నుండి 07:00 గంటల వరకు శ్రీ అమ్మవారికి మహానివేదన మరియు పంచహారతులు జరగడం ఆనవాయితీ కాగా 6 నుండి 6.30కు అమ్మవారి నివేదన పూర్తిఅయి,అనంతరం పంచ హారతులు సేవలో కొన్ని దర్శనం క్యూలైన్లు నడుపుతామని తెలియజేయడమైనది.
మహానివేదన, పంచహారతుల క్రతువు సాయంత్రం 07:00 గంటలకే పూర్తవుతుంది.
కావున, సాయంత్రం 07:15 నుండి 07:30 గంటల మధ్య రాష్ట్రపతి దర్శనం జరిగినా అది నివేదన అనంతరం జరిగేదే తప్ప, నివేదన సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శనాలు నిర్వహించబడదని, దేవస్థానం ఆగమ విధానాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమములు జరుగుతాయని తెలియజేయడమైనది.
దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి పర్యటనను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ప్రధానార్చకులు, స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులతో దేవస్థాన అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. వైదిక కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మనవి చేస్తూ దేవస్థానం వైదిక పండితుల మార్గదర్శకత్వంలో, శాస్త్రోక్త విధివిధానాలకు ఏమాత్రం భంగం కలగకుండానే రాష్ట్రపతి గారికి వేదాశీర్వచనం, దివ్య దర్శనం కల్పించేలా ఏర్పాట్లు రూపొందిస్తున్నాము.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల వేళ దేవస్థానం, జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ సమన్వయంతో సామాన్య భక్తుల దర్శనాలతో పాటు అత్యున్నత ప్రముఖుల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.
ఇటువంటి ఉత్సవాల సమయంలో నిరాధార వార్తలతో భక్తులలో అయోమయం, అపోహలు సృష్టించవద్దని ప్రసార మాధ్యమాలకు దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది.
Prajavartha Online Telugu News