Breaking News

రక్తహీనత నివారణకు చర్యలు చేపట్టాలి .. జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రక్తహీనత నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని, కిశోర బాలికలు, గర్భిణీ స్త్రీలకు తగిన పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ లోని తన చాంబరు నుంచి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష, ప్రాధాన్యత భవన నిర్మాణాలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జగనన్నకు చెబుదాం, వ్యవసాయం, జగనన్న పాల వెల్లువ, జగనన్న ఇళ్ల నిర్మాణాలు, డాక్టర్ వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ, జాతీయ రహదారుల భూసేకరణ తదితర అంశాల పురోగతిపై ఆయన జిల్లాల వారీగా సమీక్షించారు. ఆయా అంశాలపై జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొని పురోగతి సాధించనున్నట్లు ఆయనకు కలెక్టర్ తెలిపారు.

ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని సంబంధిత శాఖాధికారులకు పలు సూచనలు చేశారు. 10-19 మధ్య వయసు గల 92 మంది కిశోర బాలికలు తీవ్రమైన రక్తహీనత(అనీమియా)తో బాధపడుతున్నారని, వారికి అవసరమైన ఐరన్ మాత్రలతో పాటు పోషకాహారాన్ని అందించాలన్నారు. పాఠశాలలు పున ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనత బాధితులకు ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను అందించాలన్నారు. దీన్ని వైద్య, విద్య శాఖాధికారులు నిత్యం పర్యవేక్షించాలని చెప్పారు. రీసర్వేకు సంబంధించి ఫైనల్ ఆర్ఓఆర్ తో పాటు స్టోన్ ప్లాంటేషన్ ఏకకాలంలో జరుగుతూ ఉండాలని, రెండవ దశలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాల పూర్తికి తగిన చర్యలు తీసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలని సూచించారు.

2023-24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను మంజూరు చేయాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ రాయితీలతో పాటు రుణాల మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం కిసాన్ ఈ-కేవైసీ నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకుగాను నీటి వసతి, విద్యుత్ తో పాటు అప్రోచ్, అంతర్గత రహదారులను పూర్తి చేయాలన్నారు. జిల్లాకు మంజూరైన 89,279 ఇళ్లకు గాను ఇప్పటివరకు 18,449 ఇళ్లను పూర్తి చేయగలిగామని దీనిని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్య, వైద్య శాఖల జిల్లా అధికారులు తాహెర సుల్తానా, డాక్టర్ జి గీతాబాయి, ఐసిడిఎస్ పీడీ సువర్ణ, డ్వామా పిడి జీవీ సూర్యనారాయణ, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శివనారాయణ రెడ్డి, జిల్లా పరిశ్రమల జిఎం ఆర్.వెంకట్రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి పద్మావతి తదితరులు కలెక్టర్ తో పాటు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *