-యుద్ధ ప్రాతిపదికన పంటనష్టం అంచనా… పరిహారం చెల్లింపు
-కృష్ణా జిల్లాలో మీడియా సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
-పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా వేసామని, ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46వేల హెక్టార్లలో నష్టం కలిగిందనీ చెప్పారు. ఈ జిల్లాలో దాదాపు 56 వేల మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. గురువారం కృష్ణా జిల్లా పెనమలూరు, పామర్రు నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, కుమార్ రాజాలతో కలసి పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు… మొంథా తుపాను వల్ల దెబ్బతిన్న కంద, అరటి, వరి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు సన్నద్దత మూలంగా మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. పక్కా ప్రణాళికతో నష్టం తీవ్రతను తగ్గించాం. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు కారణంగానే తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వీడియో కాన్ఫరెన్సులు, ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటలు పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. అటు యంత్రాంగాన్ని, ఇటు గ్రామ స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేశాం. ఈ విపత్తులో కౌలు రైతులు కూడా నష్టపోయారు, వారిని కూడా ఆదుకుంటాం అని హమీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పంటలకు రూ.829 కోట్లు, ఉద్యాన రంగంలో రూ.39 కోట్లు, సెరీకల్చర్ రూ.65 కోట్లు, ఆక్వా రంగంలో రూ.1,270 కోట్లు, పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షలు నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయని వివరించారు. త్వరలోనే నష్టం అంచనాలను తయారు చేసి కేంద్రానికి పంపిస్తామని స్పష్టం చేశారు. గతంలో తుఫాన్ ప్రభావం తగ్గిన వారం రోజుల వరకూ కోలుకునే పరిస్థితి ఉండేది కాదు. తుఫాన్లు, వర్షాలను ఆపలేం కానీ అప్రమత్తత, ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని అన్నారు.
రైతులకు తగిన న్యాయం చేస్తాం
తుఫాన్ ప్రభావంతో చేతికొచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వరి, వాణిజ్య పంటలు విస్తృతంగా నష్టపోయాయని పేర్కొన్నారు. రైతులకు తగిన న్యాయం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. వ్యవసాయ, హార్టికల్చర్ శాస్త్రవేత్తలను రంగంలోకి దించి, మిగిలిన పంటలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయి సర్వే పూర్తవుతుందని, కేంద్రం సహకారంతో రైతులకు తగిన నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కాలంలో 20 వేల రూపాయల నష్టపరిహారాన్ని 17 వేల రూపాయలకు తగ్గించిందని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నష్టపరిహారాన్ని 20 వేల నుండి 25 వేల రూపాయలకు పెంచామని గుర్తుచేశారు. కేంద్రం నిర్ణయించిన దానికంటే అధికంగా పరిహారం అందజేస్తున్నామని చెప్పారు. రైతులు మళ్లీ పంటలు వేసేందుకు సిద్ధమైతే విత్తనాలను ప్రభుత్వం అందజేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 95 శాతం ఈ-క్రాప్ నమోదు పూర్తయిందని, మిగిలిన 5 శాతం కూడా నవంబర్ 12 లోపు పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలనే సంకల్పంతో ఉన్నామని అన్నారు. ప్రతి గ్రామం, ప్రతి జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలను న్యాయబద్ధంగా నమోదు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనలతోనే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామనీ, కాని పంట నష్టం జరిగినదని తెలిపారు. బుడమేరు వరద బాధితులకు 15 రోజుల్లో పరిహారం అందజేశామని, రైతుల పట్ల ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
జగన్ బహిరంగ చర్చకు రావాలి
జగన్‌కు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే వ్యవసాయశాఖ తీసుకున్న అభివృద్ధి చర్యలు, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మంత్రి అచ్చెన్నాయుడు సవాలు విసిరారు. గతంలో విపత్తులు వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తిలా కాకుండా, అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వాటా భీమా నగదును చెల్లించలేదని స్వయంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పార్లమెంట్‌లో వెల్లడి చేశారని గుర్తు చేశారు. ఇది జగన్ పాలన ఎంత అసమర్థమో చూపించే నిదర్శనమని ఎద్దేవా చేశారు. వైసీపీ మాటలు తప్ప రైతులకు మేలు చేసిన పని ఏదీ లేదని విమర్శించారు. పొరుగు రాష్ట్రంలో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడటం కాదని క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.
Prajavartha Online Telugu News