Breaking News

పర్యాటక రంగం మరింత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

-తిరుపతిలో రూ. 1,000 కోట్లతో ఐకానిక్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి
-రాష్ట్రంలో 2029 నాటికి 50 వేల గదుల (keys) లక్ష్యంగా ప్రణాళికలు
-తిరుపతిలో ‘రిజెంటా దేవరాయ’ ఫోర్ స్టార్ హోటల్‌ ప్రారంభోత్సవంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
-రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్న ప్రభుత్వం
-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

బుధవారం తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రిజెంటా దేవరాయ’ ఫోర్ స్టార్ హోటల్‌ను తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు మరియు తిరుమల టి.టి.డి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి లతో కలసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పర్యాటక శాఖ కందుల దుర్గేష్ మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ టూరిజం ప్రధాన భూమిక పోషిస్తోందని, కేవలం ఇక్కడికి వచ్చే యాత్రికులు దర్శనాలకే పరిమితం కాకుండా రెండు మూడు రోజులు ఇక్కడే బస చేసి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. గత 24 నెలల కాలంలో పర్యాటక రంగంలో సుమారు రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయులు (MOUs) కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని, దీని ద్వారా కొత్త పెట్టుబడిదారులకు ఎస్‌జిఎస్‌టి (SGST) రీయింబర్స్‌మెంట్, పరిశ్రమలతో సమానంగా విద్యుత్ టారిఫ్ వంటి రాయితీలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతి మరియు విశాఖపట్నంలను ‘ఐకానిక్ పర్యాటక కేంద్రాలు’గా అభివృద్ధి చేయబోతున్నామని, ఇందుకోసం ఒక్కో కేంద్రానికి రూ. 500 కోట్ల చొప్పున మొత్తం రూ. 1,000 కోట్లు వెచ్చించనున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో 2029 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 50 వేల హోటల్ గదులు (keys) అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి నెలా కనీసం రెండు కొత్త హోటల్స్ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో వస్తున్న ఇలాంటి హోటల్స్ పర్యాటకుల అవసరాలను తీర్చడమే కాకుండా, రాష్ట్ర పర్యాటక ముఖచిత్రాన్ని మారుస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ… తిరుపతిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గత రెండు సంవత్సరాలలో తిరుపతిలో హాస్పిటాలిటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. Marriott International, Lemon Tree Hotels, The Indian Hotels Company Limited వంటి ప్రముఖ హోటల్ బ్రాండ్లు తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించడం నగర అభివృద్ధికి నిదర్శనమన్నారు. ‘రిజెంటా బై దేవరాయ’ హోటల్ 56 గదులతో ప్రారంభం కావడం తిరుపతి పర్యాటక రంగంలో మరో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతం మొత్తం ఫోర్ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లకు అనుకూలమైన ఎకోసిస్టమ్‌గా రూపుదిద్దుకుంటోందన్నారు. భక్తుల బస వ్యవధిని రెండు రోజుల వరకు పెంచడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. తిరుమలలో గదుల విస్తరణకు పరిమితులు ఉన్న నేపథ్యంలో, తిరుపతిలో త్రీ స్టార్, ఫోర్ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్ గదుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. పర్యాటక రంగాన్ని పరిశ్రమల విభాగంగా గుర్తిస్తూ ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో దామినేడులో 21 ఎకరాల విస్తీర్ణంలో భారీ కన్వెన్షన్ కమ్ హోటల్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుందని వెల్లడించారు. అదేవిధంగా The Oberoi Group, Atmosphere Core తదితర అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు కూడా తిరుపతిలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. తిరుపతిలో పర్యాటక రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, డిమాండ్‌కు అనుగుణంగా హోటల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని హోటలియర్లను ఆయన ఆహ్వానించారు. పెట్టుబడిదారులకు భద్రత, పరిపాలనా సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ…. తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి పర్యాటక నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. భక్తులు తిరుమల దర్శనంతో పాటు తిరుపతిలో రెండు మూడు రోజులు గడిపేలా ఆధునిక వసతి, వినోద, కన్వెన్షన్ సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకొస్తున్న పర్యాటక అనుకూల విధానాల వల్ల ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ హోటల్ సంస్థలు తిరుపతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండటం ఆనందదాయకమని పేర్కొన్నారు. ‘రీజెంటా బై దేవరాయ’ వంటి నూతన ఫోర్ స్టార్ హోటల్స్ పర్యాటకులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాయని అన్నారు.పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక వ్యాపారాలు, రవాణా, హస్తకళలు మరియు సేవారంగం మరింత బలోపేతం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో తిరుపతి దేశంలోనే అత్యుత్తమ టెంపుల్ టూరిజం డెస్టినేషన్‌గా అవతరించబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి, టూరిజం ఆర్ డి రమణమూర్తి హోటల్ యాజమాన్య ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *