Breaking News

తిరుపతి, విశాఖపట్నంలు ‘ఐకానిక్ టూరిజం హబ్స్’గా అభివృద్ధి: మంత్రి కందుల దుర్గేష్

-తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న మంత్రి కందుల దుర్గేష్.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థన
-ఏపీలో కొత్త పర్యాటక పాలసీ 2024-29 ద్వారా ప్రైవేట్ పెట్టుబడులకు పెద్దపీట..పారిశ్రామిక హోదాతో పర్యాటకానికి ఊతం..ఏపీని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటన
-తిరుపతిలో 6 భారీ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు…ఎకో,అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు..
-తిరుపతి, రాయలసీమను పర్యాటక హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం
-తిరుపతి రీజియన్‌లోని పర్యాటక ప్రాంతాల స్థితిగతులపై నేడు జిల్లా పర్యాటక శాఖ అధికారులతో కీలక సమీక్ష..పాల్గొననున్న మంత్రి దుర్గేష్..హోటల్ రీజెంట్ దేవరాయకు శంకుస్థాపన చేయనున్నామని వెల్లడి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక,పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అన్నారు. భక్తులకు కేవలం దర్శనమే కాకుండా, ఆధ్యాత్మిక అనుభూతిని పెంపొందించేలా ఎకో మరియు అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామన్నారు. బుధవారం ఉదయం మంత్రి దుర్గేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిడదవోలు నియోజకవర్గ నేతలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ కి టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు. తీర్థప్రసాదాలను అందజేశారు.

అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మంత్రి దుర్గేష్ “తెల్లవారుజామునే ఆ శ్రీనివాసుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకోవడం జన్మధన్యంగా భావిస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నాను” అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు.స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, తిరుపతిలో అధునాతన వసతులు, స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో తిరుపతి, విశాఖపట్నం నగరాలను అంతర్జాతీయ స్థాయి ‘ఐకానిక్ టూరిజం హబ్స్’గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాయలసీమను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు.రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29ని అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే తిరుపతిలో సుమారు ఆరు ‘స్టార్ హోటళ్ల’ నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు.తిరుపతికి వచ్చే భక్తులు కేవలం ఒక రోజుకే పరిమితం కాకుండా, 2-3 రోజుల పాటు ఇక్కడే బస చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడం కోసం ఎకో టూరిజం, సాహస క్రీడలు ఏర్పాటుచేస్తూ అడ్వెంచర్ టూరిజం వంటి వినూత్న అంశాలను అభివృద్ధి చేస్తామన్నారు.పర్యాటకులు ఇక్కడ ఎక్కువ కాలం గడిపేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక స్వర్గధామంగా మారుస్తామని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతకుముందు బాపట్ల పర్యటన ముగించుకుని తిరుపతి చేరుకున్న మంత్రి దుర్గేష్ కి కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా తిరుపతి రీజియన్‌లోని పర్యాటక ప్రాంతాల స్థితిగతులపై జిల్లా పర్యాటక శాఖ అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశంలో క్షేత్రస్థాయి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. అదే విధంగా హోటల్ రీజెంట్ దేవరాయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.ఏపీని ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *