Breaking News

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

-త్వరలో ప్రత్యేక SME IPO స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు
-మే 25న రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుల ప్రారంభం
-ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త’ విధానంతో పారిశ్రామికాభివృద్ధి
-రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఎమ్ఎస్ఎమ్ఈ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ప్ శాఖ ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.

ఎమ్ఎస్ఎమ్ఈ (MSME)లను మూలధన మార్కెట్ మరియు వృద్ధి దిశగా సాధికారత కల్పించడంలో భాగంగా బుధవారం హోటల్ నోవోటెల్ లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NSE),
ఆంధ్రప్రదేశ్ ఎమ్ఎస్ఎమ్ఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ & కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సంయుక్త భాగస్వామ్యంతో ఎస్ఎంఈ ఐపిఓ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ… పరిశ్రమల స్థాపనను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా ఎమ్ఎస్ఎమ్ఈ, సెర్ప్ మరియు ఎన్ఆర్ఐ విభాగాలను సమన్వయం చేస్తూ కొత్త పారిశ్రామిక విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. తద్వారా పెట్టుబడులకు, ఉపాధికి పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు.

స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ – 2047:

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా, ‘స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047’లో భాగంగా ‘ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త’ అనే సరికొత్త కాన్సెప్ట్‌ను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు.

ఆర్థిక తోడ్పాటు & స్టాక్ ఎక్స్ఛేంజ్:

పరిశ్రమలకు నిధుల కొరత లేకుండా చూసేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా SME IPO స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి తెలిపారు. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మార్కెట్ నుంచి సులభంగా నిధులను సేకరించుకోవచ్చని చెప్పారు.

CGTMSE ద్వారా షూరిటీ లేని (Collateral Free) రుణాల కల్పన .

పరిశ్రమలకు అవసరమైన లీగల్ సపోర్ట్ మరియు డిస్ప్యూట్ రిజల్యూషన్ సదుపాయాలు.
వంద MSME పార్కుల అభివృద్ధి:

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్ఎస్ఎమ్ ఈ పార్కులను నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 100 పార్కుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. వీటికి అదనంగా మే 25న మరిన్ని పార్కులను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసి, స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని మంత్రి స్పష్టం చేశారు

ఆంధ్రప్రదేశ్ MSMEలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం

గత ఐదేళ్లలో ఎమ్ఎస్ఎమ్ఈ బ్యాంక్ క్రెడిట్ సాయం ₹1.16 లక్షల కోట్లకు పెరుగుదల

ఎంఎస్ఎమ్ఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో ఎమ్.విశ్వ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వీటిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఏపీ ఎంఎస్ఎమ్ఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో ఎమ్. విశ్వ స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ఎమ్ఎస్ఎమ్ఈ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రగతి పథంలో MSME

ఈ సందర్భంగా సీఈవో ఎమ్. విశ్వ మాట్లాడుతూ రాష్ట్రంలోని పారిశ్రామికాభివృద్ధిపై కీలక వివరాలను వెల్లడించారు:

ఉపాధి కల్పన:

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 21 లక్షల ఎమ్ఎస్ఎమ్ఈ లు పనిచేస్తూ లక్షలాది మందికి ఉపాధిని అందిస్తున్నాయి.

ఆర్థిక తోడ్పాటు:

2021-22లో ₹40,000 కోట్లుగా ఉన్న బ్యాంక్ క్రెడిట్ సాయం, 2025-26 నాటికి ₹1.16 లక్షల కోట్లకు చేరింది.

నైపుణ్యాభివృద్ధి:

‘ర్యాంప్’ (RAMP) పథకం ద్వారా 21 వేల పరిశ్రమలకు, లక్ష మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ అందించడం జరిగింది.
బడ్జెట్ కేటాయింపులు: క్లస్టర్ డెవలప్‌మెంట్ కోసం ₹200 కోట్లు, ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తల పథకం కింద ₹300 కోట్లు కేటాయించారు.

మానవ వ్యవహారాల శాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో అమలవుతున్న ‘ప్రాజెక్ట్ పునర్దీప్తి’ ద్వారా అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన కొనియాడారు.

SME IPOలపై దృష్టి సారించాలి

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయంగా రాణించే సత్తా ఉన్నవారన్నారు.

ఇన్సెంటివ్‌ల విడుదల:

2019-2024 మధ్య నిలిచిపోయిన టెక్స్‌టైల్ ఇన్సెంటివ్‌లను ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిందని, పరిశ్రమలకు ఊతమిచ్చేలా విద్యుత్ ధరలను తగ్గించిందని తెలిపారు.

IPO మార్కెట్:

2024లో దేశవ్యాప్తంగా 290 SMEలు IPOలకు వెళ్లగా, ఏపీ నుంచి కేవలం 3 మాత్రమే ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఖ్యను 12 నుండి 15కు పెంచాలని పిలుపునిచ్చారు.

NSEకి కీలక ప్రతిపాదనలు:

NSE సీఈవో ఆశిష్ చౌహాన్‌ను ఉద్దేశించి ఎంపీ పలు ప్రతిపాదనలు చేశారు:

డిజిటల్ స్టాక్ ఎక్స్ఛేంజ్:

ప్రాంతీయ స్థాయిలో డిజిటల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయాలి.

హ్యాండ్ హోల్డింగ్:

SMEలు IPO ప్రక్రియను సులభంగా పూర్తి చేసేలా ప్రత్యేక వ్యవస్థను నిర్మించాలి.

లెర్నింగ్ సెంటర్లు:

విశాఖపట్నం, అమరావతి, రాయలసీమల్లో NSE లెర్నింగ్ సెంటర్లు, అమరావతిలో ఫిన్‌టెక్ సాండ్‌బాక్స్ ఏర్పాటు చేయాలి.

MSMEలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే అపార అవకాశాలు

ఎన్ఎస్ఈ సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్

దేశంలో నిరుద్యోగ సమస్యను అధిగమించాలంటే ప్రతి సంవత్సరం 1.5 నుంచి 2 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని, ఇందులో ఎమ్ఎస్ ఎమ్ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NSE) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ తెలిపారు.

విజయవాడలో నిర్వహించిన ఎమ్ఎస్ఎమ్ఈ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ… ఎమ్ఎస్ ఎమ్ఈ లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడం ద్వారా కేవలం నిధుల సమీకరణ మాత్రమే కాకుండా, కంపెనీ విలువ (Valuation) పెరుగుతుందని పేర్కొన్నారు.

స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ వల్ల కంపెనీలకు ఉచిత ప్రచారం లభించడమే కాకుండా, వ్యాపార విస్తరణ, వారసత్వ ప్రణాళిక (Succession Planning) కు కూడా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొన్ని సంస్థలు ఇప్పటికే ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ అయ్యాయని, మరిన్ని ఎమ్ ఎస్ ఎమ్ ఈ లు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

విజయవాడలో ఉన్న NSE ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, రాష్ట్రంలో కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని ఆశిష్ కుమార్ చౌహాన్ హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశనేని శివనాథ్ (చిన్ని), ఆడిటర్లు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *