-బ్యాంకు రుణాల మంజూరులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలి
-బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో వివిధ బ్యాంకర్లతో టీడ్కో గృహాల రుణాల మంజూరు మరియు నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో టీడ్కో గృహాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం వేగవంతంగా పూర్తయ్యేందుకు బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
టీడ్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలను తక్షణమే మంజూరు చేసి నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. కాంట్రాక్టర్లు చేపడుతున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తూ, వారు పూర్తి చేసిన పనుల మేరకు ఇన్స్టాల్మెంట్లను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని బ్యాంకర్లను కోరారు. ఇలా చేయడం ద్వారా గృహ నిర్మాణాలు వేగవంతమై, ప్రజల సొంతింటి కల త్వరగా నెరవేరుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమం విజయవంతం కావడానికి బ్యాంకులు, అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రుణాల మంజూరు ప్రక్రియను సరళతరం చేయాలని సూచించారు.
అదేవిధంగా లబ్ధిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించి గృహాల నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అన్ని విభాగాలు సమిష్టిగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News