– “MIVAN షట్టరింగ్” విధానంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో టవర్ల నిర్మాణం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరిగేందుకు APCRDA అధునాతన విధానాలను అమలు చేస్తోంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో పలు దేశాలలో అమలులో ఉన్న, నిర్మాణ రంగ నిపుణులు సైతం సూచిస్తున్న “MIVAN షట్టరింగ్” విధానాన్ని నిర్మాణ పనులలో వినియోగించడం ప్రారంభించింది.
MIVAN షట్టరింగ్ విధానంలోని ముఖ్యాంశాలు:
MIVAN షట్టరింగ్ అనేది ఆధునిక అల్యూమినియం ఫార్మ్‌వర్క్ సిస్టమ్. ఇది ముఖ్యంగా ఎత్తైన భవనాలు, భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులు, టౌన్‌షిప్‌ల నిర్మాణంలో వేగవంతమైన ఆర్‌సీసీ నిర్మాణ పనులకు ఉపయోగిస్తారు. Mivan Company Ltd. అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నిర్మాణ సంస్థలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి.
సాంప్రదాయ షట్టరింగ్ విధానంలో బీమ్‌లు, స్లాబ్‌లు, కాలమ్‌లు, ఇటుక గోడలు వేర్వేరుగా నిర్మించబడతాయి. అయితే MIVAN సిస్టమ్‌లో గోడలు & స్లాబ్‌లను ఒకేసారి కాంక్రీటుతో నిర్మించడం ద్వారా ఒకే సమగ్ర ఆర్‌సీసీ నిర్మాణం రూపొందుతుంది.
MIVAN నిర్మాణ ప్రక్రియలో ముందుగా అల్యూమినియం ఫార్మ్‌వర్క్ ప్యానెల్‌లను అమర్చడం జరుగుతుంది. అనంతరం రీన్‌ఫోర్స్‌మెంట్ స్టీల్ అమర్చడం, విద్యుత్ & ప్లంబింగ్ కండక్ట్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. తరువాత గోడలు & స్లాబ్‌కు ఒకేసారి కాంక్రీట్ పోయడం జరుగుతుంది. సుమారు 12 నుంచి 24 గంటల్లో డీ-షట్టరింగ్ పూర్తి చేసి, అదే ప్యానెల్‌లను తదుపరి అంతస్తు నిర్మాణానికి మళ్లీ వినియోగించే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా చాలా వేగంగా అంతస్తుల నిర్మాణం పూర్తి చేయవచ్చు.
MIVAN షట్టరింగ్‌లో ఉండే ముఖ్యమైన భాగాలు:
MIVAN ఫార్మ్‌వర్క్‌లో ప్రధాన భాగాలుగా వాల్ ప్యానెల్‌లు, స్లాబ్ ప్యానెల్‌లు, బీమ్ ప్యానెల్‌లు, ప్రాప్స్, పిన్స్ & వెడ్జ్‌లు, సాఫిట్ ప్యానెల్‌లు, టై రాడ్లు & స్పేసర్లు ఉంటాయి.
MIVAN షట్టరింగ్ విధానంతో లభించే ప్రయోజనాలు:
ఈ సాంకేతికత వల్ల నిర్మాణ వేగం గణనీయంగా పెరుగుతుంది. సాధారణ ఆర్‌సీసీ నిర్మాణంలో ఒక అంతస్తు పూర్తి కావడానికి సుమారు 15 నుంచి 21 రోజులు పట్టగా, MIVAN విధానంలో అదే పని 7 నుంచి 10 రోజుల్లో పూర్తవుతుంది. ముఖ్యంగా భారీ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు, ప్రభుత్వ గృహ నిర్మాణాలు, ఒకే విధమైన ఫ్లోర్ ప్లాన్‌లు ఉన్న ప్రాజెక్టులకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని నిర్మాణ రంగ నిపుణులు సైతం కితాబిచ్చారు.
MIVAN ద్వారా నిర్మించిన గోడలు & స్లాబ్‌లు సమతుల్యంగా, మృదువుగా నిర్మాణమవుతాయి. దీంతో ప్లాస్టరింగ్, పుట్టీ పనులు తగ్గడంతో పాటు నిర్మాణ నాణ్యత సైతం మెరుగుపడుతుంది. ఈ విధానంలో వినియోగించిన అల్యూమినియం ప్యానెల్‌లను సరైన నిర్వహణతో సుమారు 200 నుంచి 300 సార్లు మళ్లీ వినియోగించవచ్చు. దీని వల్ల దీర్ఘకాలంలో నిర్మాణ వ్యయం తగ్గుతుంది.
ఈ విధానంలో భవన నిర్మాణం ఒకే సమగ్ర ఆర్‌సీసీ రూపంలో ఉండటం వల్ల భూకంప నిరోధకత స్థాయి గణనీయంగా మెరుగుపడుతుంది. అలాగే జాయింట్లు తగ్గడం వల్ల లీకేజీ సమస్యలు సైతం తక్కువగా ఉంటాయి. అలాగే నిర్మాణ పనులలో చెక్క/ టింబర్ వినియోగం తగ్గడం, నిర్మాణ వ్యర్థాలు తగ్గడం, కాంక్రీట్ వినియోగం నియంత్రణలో ఉండడం వంటి ప్రయోజనాలు సైతం లభిస్తాయి.
హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కోసం MIVAN షట్టరింగ్ వ్యవస్థను M/s Genesis Planners Pvt. Ltd. ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఈ ఫార్మ్‌వర్క్‌ను మలేషియాకు చెందిన MFE Formwork Technology సంస్థ తయారు చేసి సరఫరా చేస్తోంది. ప్రస్తుతం హ్యాపీనెస్ట్‌లోని రెండు టవర్ల నిర్మాణ పనుల నిమిత్తం రెండు సెట్ల ఫార్మ్‌వర్క్ సామాగ్రి.. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు సైట్‌కు చేరుకుంది. త్వరలోనే మిగతా టవర్లకు సంబంధించి MIVAN షట్టరింగ్ ఎక్విప్మెంట్ అమరావతికి రానుంది.
Prajavartha Online Telugu News