-సీమకు భారీగా డిఫెన్స్ ప్రాజెక్టులు
-రూ.15,803 వేల కోట్లతో AMCA ప్రాజెక్టుకు పుట్టపర్తిలో శంకుస్థాపన
-డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకూ భూమి పూజ
-శుక్రవారం రక్షణ మంత్రితో భూమి పూజ చేయనున్న సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయల సీమ రతనాల సీమ… ఇది చరిత్ర. ఉద్యాన సీమ… ఇది వర్తమానం. రక్షణ సీమ… ఇది భవిష్యత్. ఇరిగేషన్, హర్టీకల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ డెవలప్మెంట్ జర్నీలో మరో కీలక రంగం జత కానుంది. ఇకపై రాయలసీమ దేశ రక్షణ రంగంలోనూ తన ముద్రను వేయబోతోంది. ప్రత్యేకతను చాటుకోనుంది. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లాలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టును ఏరో నాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ-డీఆర్డీఏ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నారు. పుట్టపర్తిలో జరగనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్టును సుమారు రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో, 650 ఎకరాల్లో ఈ రూపుదిద్దుకోనుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి 5th Generation స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి హంగులతో యుద్ద విమానాలను అభివృద్ధి చేయనున్నారు. యుద్ద విమానాలను పుట్టపర్తిలోనే అభివృద్ధి చేయడంతోపాటు… టెస్టింగ్ కూడా చేపట్టేలా ప్రాజెక్టును రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. అలాగే, ఈ ప్రధాన ప్రాజెక్టుకు అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా మరో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 400 ఎకరాలు కేటాయించింది. వీటితో పాటు కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న ‘డ్రోన్ సిటీ’ ద్వారా భారతదేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఆ మేరకు పెట్టుబడులు భారీ ఎత్తున రానున్నాయి. మొత్తంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలో డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుడులు వచ్చేందుకు ప్రభుత్వం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. దీంట్లో భాగంగా డ్రోన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. AMCA ప్రాజెక్టుతో పాటే డిఫెన్స్ రంగానికి చెందిన 4 ప్రాజెక్టులు, 8 డ్రోన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగనుంది. ఈ 12 ప్రాజెక్టుల ద్వారా రూ. 4145 కోట్ల పెట్టుబడులు, 6071 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వీటిల్లో మడకశిరలో రెండు ప్రాజెక్టులు, దొనకొండ, నెల్లూరుల్లో ఒక్కో ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. మిగిలిన 8 డ్రోన్ ప్రాజెక్టులు కర్నూలు జిల్లా డ్రోన్ సిటీలో నిర్మాణాలు చేపట్టనున్నాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన పెట్టుబడులకు వివిధ సంస్థల నుంచి ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకోనుంది.
మరో 12 ప్రాజెక్టులకు శంకుస్థాపన…:
• కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ – రూ. 1430 కోట్ల పెట్టుబడి – 565 మందికి ఉపాధి
• భారత్ డైనమిక్స్ లిమిటెడ్ – రూ. 489 కోట్ల పెట్టుబడి – 500 మందికి ఉపాధి
• HFCL – రూ. 1040 కోట్ల పెట్టుబడి – 870 మందికి ఉపాధి
• ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ – రూ. 500 కోట్ల పెట్టుబడి – 2050 మందికి ఉపాధి
• అల్గోబాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ. 34 కోట్ల పెట్టుబడి – 52 మందికి ఉపాధి
• డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ. 255 కోట్ల పెట్టుబడి – 850 మందికి ఉపాధి
• డ్రోన్ ల్యాబ్ టెక్నాలజీస్ – రూ. 5 కోట్ల పెట్టుబడి – 14 మందికి ఉపాధి
• హెచ్ సి రోబోటిక్స్ – రూ. 100 కోట్ల పెట్టుబడి – 500 మందికి ఉపాధి
• సెన్స్ ఇమేజ్ టెక్నాలజీస్ – రూ. 68 కోట్ల పెట్టుబడి – 45 మందికి ఉపాధి
• ఎయిర్ పేస్ ఇండస్ట్రీస్ – రూ. 100 కోట్ల పెట్టుబడి – 150 మందికి ఉపాధి
• జేడీకే ఫ్లై డ్రోన్ వరల్డ్ – రూ. 114 కోట్ల పెట్టుబడి – 350 మందికి ఉపాధి
• లాట్రిక్ ఎయిరో స్పేస్ – రూ. 10 కోట్ల పెట్టుబడి – 125 మందికి ఉపాధి
ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్…
ముఖ్యమంత్రి పర్యటన ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10:15 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్ వెనుక ఏర్పాటు చేసిన ఉన్న శంకుస్థాపన కార్యక్రమ వేదికకు చేరుకుంటారు. ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ అథారిటీ (ADA) ఆధ్వర్యంలోని ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ – ఫ్లైట్ టెస్ట్ సెంటర్ శంకుస్థాపనతో పాటు, ఇతర రక్షణ, డ్రోన్ రంగ పరిశ్రమల భూమి పూజ కార్యక్రమాల్లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 02:20 గంటలకు తిరిగి అమరావతిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Prajavartha Online Telugu News