విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP): రాష్ట్రవ్యాప్తంగా 2026 సంవత్సరానికి సంబంధించి నిర్వహిస్తున్న వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంపులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 1,387 కోచింగ్ క్యాంపులు నిర్వహించబడగా, 43,636 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. క్రీడాకారులకు అవసరమైన క్రీడా సామగ్రితో పాటు పోషకాహార డైట్ అందించబడుతున్నది. డైట్లో భాగంగా చిక్కీ మరియు ఇతర పోషకాహార పదార్థాలు పంపిణీ చేయబడుతున్నాయి.
క్రీడాకారులకు అందజేస్తున్న చిక్కీలు మరియు ఇతర ఆహార పదార్థాలు సంబంధిత నాణ్యత ప్రమాణాలను అనుసరించి కొనుగోలు చేయబడుతున్నాయి. చిక్కీ మొదటి విడతలో ఇప్పటికే సరఫరా చేయబడగా, మిగిలిన పరిమాణం నమోదైన క్రీడాకారుల సంఖ్యకు అనుగుణంగా దశలవారీగా అందించబడుతుంది. జిల్లా స్థాయి అధికారులు, కోచ్లు మరియు పర్యవేక్షణ సిబ్బంది నిరంతరం క్యాంపులను పరిశీలిస్తూ, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు సమయానుకూలంగా అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
అదనంగా, సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో స్పాన్సర్ల సహకారంతో ప్రత్యేక పోషకాహార డైట్ కూడా క్రీడాకారులకు అందించబడుతున్నది. ఈ సందర్భంగా సహకారం అందిస్తున్న స్పాన్సర్లకు శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News