Breaking News

ఆతిథ్య రంగానికి ఊరటనివ్వండి: కమర్షియల్ ఎల్పీజీపై జీఎస్టీని తగ్గించాలని ఏపీ ఛాంబర్స్ విజ్ఞప్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆతిథ్య రంగానికి (హాస్పిటాలిటీ సెక్టార్) ఊరటనిచ్చేలా వాణిజ్య వంటగ్యాస్ (కమర్షియల్ ఎల్పీజీ) సిలిండర్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.

కమర్షియల్ ఎల్పీజీ ధరలు నిరంతరంగా, విపరీతంగా పెరుగుతుండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ (MSME) సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఏపీ ఛాంబర్స్ తమ వినతిపత్రంలో పేర్కొంది. మే 1, 2026 నుంచి అమలులోకి వచ్చిన తాజా సవరణల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర దాదాపు రూ.3,200 కు చేరుకుందని, గడచిన నాలుగు నెలల కాలంలోనే సిలిండర్‌పై ఏకంగా రూ.1,500 మేర భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.

హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ వ్యయంలో కమర్షియల్ గ్యాస్‌దే ప్రధాన పాత్ర అని, తాజా ధరల పెరుగుదలతో ఆతిథ్య రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఏపీ ఛాంబర్స్ తెలిపింది. కేవలం ఈ గ్యాస్ ధరల పెంపు వల్ల ఒక మధ్యతరహా హోటల్‌పై నెలకు సుమారు రూ.90,000 నుంచి రూ.1.5 లక్షల వరకు అదనపు భారం పడుతోందని అంచనా వేసింది.

అంతేకాకుండా, చాలా హోటళ్లు, రెస్టారెంట్లు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ప్రయోజనాలు లేకుండా 5% జీఎస్టీ పరిధిలో సేవలు అందిస్తున్నాయని.. అయితే కమర్షియల్ గ్యాస్‌పై మాత్రం 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారని ఛాంబర్స్ గుర్తుచేసింది. ఈ విలోమ పన్ను భారం (Inverted Tax Burden) కారణంగా బడ్జెట్, మధ్యతరహా హోటళ్లు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ఆతిథ్య సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని స్పష్టం చేసింది.

గ్యాస్ ధరల పెరుగుదలకు తోడుగా ఆహార పదార్థాలు, ముడి సరుకుల వ్యయం కూడా పెరగడంతో అనేక సంస్థల నిర్వహణ ఖర్చులు దాదాపు 25 శాతం మేర పెరిగాయని తెలిపింది. దీంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మెనూలను కుదించుకుని, పరిమిత వనరులతో వ్యాపారం చేయాల్సి వస్తోందని.. కొన్ని చిన్న సంస్థలైతే ఏకంగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని వివరించింది.

అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో ఆతిథ్య రంగం ఒకటని.. పర్యాటకం, రవాణా, ఫుడ్ ప్రాసెసింగ్, ఈవెంట్స్, లాజిస్టిక్స్ తదితర అనుబంధ రంగాలకు ఇది వెన్నెముక అని ఛాంబర్స్ నొక్కిచెప్పింది. సంస్థల నిర్వహణ, ఉపాధి రక్షణ, పెట్టుబడుల ఆకర్షణ, పర్యాటక పర్యావరణ వ్యవస్థ బలోపేతానికి సకాలంలో ప్రభుత్వ విధానపరమైన మద్దతు అత్యవసరమని పేర్కొంది.

ఆతిథ్య రంగం, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించాలని, కమర్షియల్ గ్యాస్‌పై జీఎస్టీని తగ్గించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లకు తక్షణ ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని ఏపీ ఛాంబర్స్ కోరింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *