Breaking News

పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఎక్సైజ్ విధానం

-ఎక్సైజ్ శాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం
-ప్రజల ఆరోగ్యానికీ పెద్దపీట… పెరిగిన ఆదాయం
-మద్యం నాణ్యతపై ల్యాబుల్లో పెద్ద ఎత్తున పరీక్షలు
-ట్రాక్ అండ్ ట్రేస్, ఎక్సైజ్ సురక్ష యాప్‌లతో పారదర్శకత
-అవినీతికి తావు లేకుండా కలెక్టర్ల ఆధ్వర్యంలో షాపుల కేటాయింపు
-ఎన్నికల హామీ మేరకు కల్లుగీత కార్మికులకు 10శాతం షాపులు
-23 నెలల పాలనలో ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు
-ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనపై పూర్తి ఫోకస్ పెట్టి గాడిలో పెట్టిన సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రెండేళ్ల క్రితం ఏపీలో మద్యం అంటే భయం… అనుమానం… అసంతృప్తి…. దోపిడీ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అదే ఎక్సైజ్ శాఖలో పారదర్శకత, నాణ్యత, టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ… ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అనేక సంస్కరణలతో ఎక్సైజ్ శాఖ గాడిలో పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే సంస్కరణలు తీసుకురావాలని భావించిన శాఖల్లో ఎక్సైజ్ శాఖ ప్రధానంగా ఉంది. దీంతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఆ దిశగా ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంది. SEBను రద్దు చేసి ఎక్సైజ్ శాఖ మొత్తాన్ని ఏకీకృతం చేసింది. ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంపై శ్వేత పత్రాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. గతంలో అమలు చేసిన ఆన్ లైన్ ఆర్డర్ ఫర్ సప్లై విధానాన్ని ఎక్సైజ్ శాఖ తీసుకొచ్చింది. ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో SIT ఏర్పాటు చేసి అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలిచ్చింది. నూతన మద్యం పాలసీ (2024-2026) ప్రకటించి లాటరీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించారు. పారదర్శకమైన విధానాల ఫలితంగా దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.1800 కోట్ల ఆదాయం సమకూరింది. 10 శాతం మేర షాపులు అంటే… 354 దుకాణాలను కల్లుగీత కార్మికులకు కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో ARET పేరుతో ప్రజలపై భారం మోపారు. ఆ భారాన్ని తగ్గిస్తూ ARETని ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు 0.6 శాతం మాత్రమే ఉంటే ప్రస్తుతం 45శాతానికి చేర్చడం ద్వారా పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది ఎక్సైజ్ శాఖ.

అందుబాటులోకి ప్రీమియం బ్రాండ్లు..

అన్ని బ్రాండ్లకు పారదర్శకంగా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా టెండర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎక్సైజ్ శాఖ అవకాశం కల్పిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్లను కూడా అందుబాటులోకి తెచ్చే లక్షంతో రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రీమియం స్టోర్‌లను ఏర్పాటు చేసింది ఎక్సైజ్ శాఖ. నాటు సారా, కల్తీ మద్యం వైపు ఎవరూ వెళ్లకుండా చేయడం లక్ష్యంగా రూ.99 బ్రాండ్ అందుబాటులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వ హయాంలో పారదర్శకమైన విధానం అమలు చేయడం, జాతీయ, అంతర్జాతీయ, ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి తీసుకురావడం, పొరుగు రాష్ట్రాలతో సమానంగా ధరలు ఉండడంతో అక్రమ రవాణా దాదాపు నిలిచిపోయిందనే చెప్పాలి. ఫలితంగా 2024-25లో రూ.28,846 కోట్లు, 2025-26లో రూ.29,042 కోట్ల మేర ఎక్సైజ్ రెవెన్యూ వచ్చింది. మద్యం షాపుల నుండి బార్‌లకు మద్యం అక్రమ రవాణా నివారించేలా బార్‌లలో కూడా ఎమ్మార్పీ విధానాన్ని అవలంభించేలా చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. డిస్టిలరీల నుంచి షాపుల వరకు ప్రతి మద్యం బాటిల్ ట్రాక్ అండ్ ట్రేస్ విధానంలో పర్యవేక్షించేలా ఎక్సైజ్ శాఖ జాగ్రత్తలు తీసుకుంది.

13 రకాల పరీక్షలు… 30 వేల శాంపిళ్ల టెస్టులు

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మద్యం బ్యాచ్‌ను 13 రకాలైన పరీక్షలు నిర్వహించిన అనంతరమే మార్కెట్లోకి వెళ్లేలా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టారు. అందుకోసం విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, చిత్తూరు, కర్నూలులో అత్యాధునిక ల్యాబరేటరీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గతంలో ఏటా సగటున 14 వేల పరీక్షలు మాత్రమే నిర్వహిస్తే, ప్రస్తుతం ప్రతి నెల సగటున 30 వేల పరీక్షలు చేస్తూ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటోంది. గంజాయి నిర్మూలన కోసం ఈగిల్ టీమ్స్ ఏర్పాటు చేయడం… మద్యం ఆదాయంలో 2 శాతం బడ్జెట్ ఈగిల్ వ్యవస్థకు కేటాయించడం వంటి చర్యలు ఎక్సైజ్ శాఖ చేపడుతోంది. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం వినియోగ దారులు ఎవరైనా, ఎక్కడైనా బాటిళ్లను స్కాన్ చేసే అవకాశం కల్పించారు. మద్యం బాటిళ్ల తయారీ నుంచి షాపుకు వచ్చే వరకు ప్రతి సమాచారం తెలుసుకునే వెసులుబాటును ఎక్సైజ్ శాఖ కల్పించింది. ఎక్సైజ్ ఐ యాప్ ద్వారా మద్యం షాపుల్లోని సీసీ కెమెరాలన్నింటినీ అనుసంధానించి ఏ షాపును ఎప్పుడు తెరుస్తున్నారు, ఎప్పుడు మూస్తున్నారోననే అంశంపై నిరంతరం మానిటర్ చేస్తున్నారు.

ఎక్సైజ్ వ్యవస్థను హైజాక్ చేసిన నాటి ప్రభుత్వం

రాష్ట్రంలో దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని… మద్యం విక్రయాలను కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మద్యం నిర్మూలన కాదు నియంత్రణ అన్నారు. తర్వాత ప్రభుత్వ మద్యం షాపులు అన్నారు. అప్పటి వరకు ఉన్న మద్యం బ్రాండ్లను నాటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు తొలగించారు. ప్రపంచంలో ఎక్కడా లేని, ఎప్పుడూ కనీ వినీ ఎరుగని బూం బూం, ప్రెసిడెంట్ మెడల్ లాంటి బ్రాండ్లు తీసుకొచ్చారు. వినియోగదారుడు తనకు నచ్చిన బ్రాండ్ కాకుండా.. తాము అమ్మే బ్రాండ్ తాగాల్సిందే అనే పరిస్థితి తీసుకొచ్చి ఎక్సైజ్ వ్యవస్థ మొత్తాన్ని నాటి ప్రభుత్వ పెద్దలు హైజాక్ చేశారు. కల్తీ, నకిలీ మద్యాన్ని ప్రభుత్వ షాపుల్లోనే అమ్మారు. చిన్న బడ్డీ కొట్టులో డిజిటల్ పేమెంట్ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా ఏ మద్యం షాపులోనూ డిజిటల్ లావాదేవీలను గత ప్రభుత్వం జరగనివ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో 99.38 శాతం లావాదేవీలు క్యాష్ అండ్ క్యారీ విధానంలోనే జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. నాడు నాణ్యమైన మద్యం అందుబాటులో లేకపోవడం, ధరలు భారీగా ఉండడంతో తమిళనాడు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా అడ్డగోలుగా పెరిగింది. మద్యం అక్రమాలను ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదు అన్నట్లు ఎక్సైజ్ శాఖను విడగొట్టి సరైన నిఘా లేకుండా చేశారు. ఒక్కో మద్యం బ్రాండు సరఫరాపై కేసుకు అనధికారికంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. మద్యం తయారీ సంస్థల నుంచి, బీర్ తయారీ కంపెనీల నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నారని దర్యాప్తు సంస్థలు సైతం నిర్ధారించిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 76% మంది మహిళలు మానసిక, శారీరక, లైంగిక వేధింపులకు గురయ్యారు. 2019తో పోలిస్తే 2023 నాటికి 52 శాతం లివర్ సమస్యలు, 54 శాతం కిడ్నీ సమస్యలు పెరిగాయి. గుంటూరు జీజీహెచ్‌లో ఉండే డీ అడిక్షన్ కేంద్రంలో 2019 నాటికి 343 కేసులు ఉంటే.. 2023 నాటికి ఏకంగా 4913కి పెరిగారు. ఇలాంటి పరిస్థితులకు చెక్ చెప్పేలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంది. ప్రజారోగ్య రక్షణకు పెద్ద పీట వేసింది.

*ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం..: ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర *

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్ల కాలంలో ఎక్సైజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు. ప్రజలకు నాణ్యమైన మద్యం అందించే లక్ష్యంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. గతంలో కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని… కానీ నేడు ప్రతి డిస్టిలరీలో తయారయ్యే మద్యాన్ని ENA నుంచి డిస్టిలింగ్, బాటిలింగ్ వంటి పలు దశల్లో పరీక్షించడమే కాకుండా.. మద్యం షాపులు, బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే బ్రాండ్ మిక్సింగ్ వంటి ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో డిజిటల్ లావాదేవీలు 1శాతం మేర కూడా లేదని… కానీ నేడు 40 శాతానికి పైగా డిటిటల్ లావాదేవీలు నిర్వహిస్తుండమనేది ప్రభుత్వ, ఎక్సైజ్ శాఖ పారదర్శకతకు నిదర్శనమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *