Breaking News

విశాలాంధ్ర ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్యాన్ని తలకిందులు చేసే ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై అప్రమత్తం కావాలని, ఓటు హక్కుపై దాడిని తిప్పికొట్టాలని ప్రముఖ రాజకీయ, ఆర్థికవేత్త, రచయిత పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడేందుకు ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ పూర్తిస్థాయి పారదర్శకత, జవాబుదారీతనం, స్వతంత్ర పర్యవేక్షణతో జరగాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ గాంధీనగర్ రామా ఫంక్షన్ హాలులో విశాలాంధ్ర దినపత్రిక 74వ వార్షికోత్సవ సభ విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ‘ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ఆంతర్యం`సవాళ్లు’ అంశంపై పరకాల ప్రభాకర్ ప్రసంగించారు. ఎస్ఐఆర్, నియోజకవర్గాల పునర్విభజన, భౌగోళిక మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీపై ఆయన సమగ్రంగా విశ్లేషించారు. బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియతో భారీగా ఓట్ల తొలగింపుపైన, ఇంకా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై అనేక సందేహాలు, ఆందోళనలను ఆయన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్‌ను కేవలం ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమంగా ప్రజలకు ప్రచారం చేస్తున్నారని, దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, ప్రభావాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరముందని పరకాల చెప్పారు. 2002లో నిర్వహించిన ఎస్ఐఆర్ సమయంలో ఓటర్లు తమ అర్హతను నిరూపించేందుకు పత్రాలు సమర్పించాల్సిన అవసరం రాలేదని, ప్రస్తుతం పౌరులు తమ ఓటు హక్కును రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకురావడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్, నియోజకవర్గాల పునర్విభజన, భౌగోళిక మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ వంటి అంశాలను విడివిడిగా కాకుండా సమగ్ర ప్రణాళికలో భాగంగా చూడాలని సూచించారు. ప్రజాస్వామ్య హక్కులు, లౌకిక విలువలు, సమానత్వ సూత్రాలను కాపాడేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించాల్సిన అవసరముందని ఆయన నొక్కిచెప్పారు. ఎస్ఎస్ఆర్ సంతృప్తికరంగా జరగలేదన్న కారణంతో ఎస్ఐఆర్ చేపట్టామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ… సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు కోరినా, అలాంటి అధ్యయన నివేదికను ఎన్నికల సంఘం అందించలేదన్నారు. ఎసఐఆర్ నిర్వహించాలని నిర్ణయం ఎవరు తీసుకున్నారనే ప్రశ్నకు సైతం ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని, ఎన్నికల సంఘంలోని ఏ అధికారి కూడా ఆ నిర్ణయం తీసుకోలేదని ఆర్టీఐ సమాధానంలో పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. బీహార్‌లో ఎస్ఐఆర్ అనంతరం సుమారు 63 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించడంతో వివాదాలు చెలరేగినా… ఆ ప్రక్రియపై ఎన్నికల సంఘం ఎలాంటి సమీక్ష సమావేశం నిర్వహించలేదన్నారు. ఓటర్ల తొలగింపునకు ఎక్కువగా మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు, పేద కూలీలు, మహిళలు గురవుతున్నట్లు వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయని విశ్లేషించారు. ఓటరు జాబితాల్లో నమోదైన కొన్ని చిరునామాలపై పరిశీలన జరిపినప్ప్పుడు బీహార్‌లోని పిప్రా నియోజకవర్గంలోని గాలిపూర్ గ్రామంలో ఒకే ఇంటి చిరునామాలో 809 మంది ఓటర్లు నమోదైనట్లు కనిపించిందని, క్షేత్రస్థాయిలో పరిశీలించినప్ప్పుడు అలాంటి ఇల్లు అసలు అక్కడ లేదని ఆయన అన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ అమలైందని, దాదాపు 6.5 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు అంచనా వేస్తున్నామని, ఇదే విధానం కొనసాగితే దేశవ్యాప్తంగా తొలగింపు సంఖ్య 16.5 కోట్లకు చేరే ప్రమాదముందని పరకాల వివరించారు. తెలంగాణలోను భారీ సంఖ్యలో ఓటర్లను తొలగించే ప్రక్రియకు సన్నాహాలు కొనసాగుతున్నాయని అన్నారు. రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని కేవలం ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధించిన సమస్యగానే చూస్తున్నాయని, దీని ప్రభావం మరింత విస్తృతంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కొంతమంది నాయకులు తమకు అనుకూలమైన ఓట్లు తొలగించలేదని భావించి నిర్లక్ష్యం చేస్తున్నారని, మరికొందరు తమ మెజార్టీపై నమ్మకంతో దీనిని పెద్ద సమస్యగా పరిగణించడం లేదని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రభావం కేవలం ఒకటి లేదా రెండు ఎన్నికలకే పరిమితం కాదని, దీనివల్ల భవిష్యత్తులో ఓటు హక్కు ఉన్నవారూ, ఓటు హక్కు కోల్పోయినవారనే రెండు వర్గాల పౌరులుగా విభజన జరిగే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రాథమిక హక్కు అని, ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల విశ్వాసాన్ని కాపాడటం అత్యవసరమని సూచించారు. అంతకుముందు విశాలాంధ్రతో తనకున్న అనుబంధాన్ని పరకాల ప్రభాకర్ గుర్తుచేసుకున్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక విలువలను పరిరక్షించేందుకు కేవలం చర్చలు సరిపోవని, ప్రజలు కార్యాచరణకు సిద్ధం కావాల్సిన అవసరముందని, ఆ దిశగా ఎస్ఐఆర్ ప్రక్రియలో విశాలాంధ్ర ప్రత్యేక కృషి చేయాలని కోరారు. విశాలాంధ్ర ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ విశాలాంధ్ర ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఎస్ఐఆర్‌పై రాష్ట్రవ్యాప్తంగా సభలు, సదస్సులు నిర్వహించి… ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తామని చెప్పారు. ఇప్పటికే పొద్దుటూరు, కడపలో సదస్సులు నిర్వహించామన్నారు. ప్రజల గొంతుకగా ఉన్న విశాలాంధ్ర అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ… నిత్యం ప్రజల పక్షాన నిలిచిందని వివరించారు. దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవ్వడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, ఆహార కొరత తదితర సమస్యలతో నాడు ప్రధాని ఇందిరాగాంధీ పిలుపుతో దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణను పటిష్టంగా అమలు చేశారన్నారు. దీని కారణంగా కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నప్పటికీ… కూటమి పార్టీలు, ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయని మండిపడ్డారు. దీనిపై సీపీఐ మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతుందని వెల్లడించారు. సభకు అధ్యక్షత వహించిన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ గడ్డపై 74 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగిన ఏకైక తొలి తెలుగు దినపత్రిక విశాలాంధ్ర అని, దీనిని ఒక చరిత్రగా అభివర్ణించారు. విశాలాంధ్ర అభివృద్ధిలో ఎందరో ప్రముఖుల కృషి, త్యాగం దాగి ఉందంటూ వారి పేర్లు గుర్తు చేశారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ప్రసంగిస్తూ విశాలాంధ్ర 1977లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేదికగా రజతోత్సవాలు వైభవంగా నిర్వహించామని గుర్తుచేశారు. అనేక ప్రజా ఉద్యమాలలో విశాలాంధ్ర తనవంతు కీలకంగా నిలిచిందని చెప్పారు. విశాలాంధ్ర సంపాదకులు ఆర్‌వీ రామారావు మాట్లాడుతూ నాడు విశాలాంధ్ర ఏర్పాటులో శెట్టి ఈశ్వరరావు కృషి ఎనలేనిదని, ఆయన గురజాడ రచనలను తిరిగి సంకలనం చేశారన్నారు. అంతటి త్యాగం చేసిన శెట్టి ఈశ్వరరావు విశాలాంధ్ర వెనుక ఉండటం విశేషమని అన్నారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ పి.హరినాథ్‌రెడ్డి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ గడ్డం కోటేశ్వరరావు, విజ్ఞాన సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, పి.దుర్గాభవాని, చలసాని అజయ్ కుమార్ పాల్గొన్నారు. విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూన అజయ్‌బాబు వక్తలను వేదికపైకి ఆహ్వానించగా… విశాలాంధ్ర విజ్ఞాన సమితి డిప్యూటీ జనరల్ మేనేజర్ టి.మనోహర్ నాయుడు వందన సమర్పణ చేశారు. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులు పి.చంద్రనాయక్, ఆర్.పిచ్చయ్య తదితరులు అభ్యుదయ గేయాలు ఆలపించారు. చివరిగా ముఖ్య అతిథి పరకాల ప్రభాకర్‌ను శాలువాతో సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *