-ప్రజలను తప్పుదోవ పట్టించే అసత్య ప్రచారాన్ని వెంటనే విరమించాలి
-రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పన అనే లక్ష్యాలతో అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న Public-Private Partnership (PPP) విధానంపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేకించి రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నారని వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో అపోహలు, భయాందోళనలు సృష్టించడం తప్ప దీనిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ PPP అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం కాదు, ప్రభుత్వ హక్కులను వదులుకోవడం అసలే కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ యాజమాన్యంలోని మౌలిక వసతులను మరింత సమర్థవంతంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్వహించేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పరిపాలనా విధానమే PPP అని వివరించారు.
PPP విధానంలో ప్రభుత్వ హక్కులకు ఎలాంటి భంగం ఉండదు…
PPP (Public-Private Partnership) విధానంలో పోర్టు యాజమాన్యం, భూమి, సముద్రతీర హక్కులు, భద్రత, విధాన నిర్ణయాలు, టారిఫ్‌లు, చట్టబద్ధ నియంత్రణలు, పర్యావరణ ప్రమాణాలు సహా అన్ని కీలక అధికారాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయన్నారు. ప్రైవేట్ భాగస్వామి ప్రభుత్వ నిర్దేశించిన షరతులకు లోబడి Operations & Maintenance (O&M) నిర్వహణ బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తాడన్నారు. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినట్లయితే జరిమానాలు విధించే అధికారం, అవసరమైతే ఒప్పందాన్ని రద్దు చేసే పూర్తి హక్కు కూడా ప్రభుత్వానికే ఉంటుందన్నారు. అందువల్ల PPP విధానంలో ప్రభుత్వ హక్కులు ఏ విధంగానూ తగ్గవని, ప్రైవేటీకరణకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న విధానమే PPP…
దేశంలోని విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, మెట్రో రైలు వ్యవస్థలు, పారిశ్రామిక పార్కులు, ప్రధాన పోర్టులు సహా అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు PPP విధానంలో విజయవంతంగా కొనసాగుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన పోర్టుల విజయానికి ప్రభుత్వ పర్యవేక్షణ, ఆధునిక సాంకేతికత, సమర్థ నిర్వహణ, ప్రైవేట్ పెట్టుబడుల సమన్వయమే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
PPP విధానంతో రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు…
PPP విధానం ద్వారా ప్రభుత్వంపై నిర్వహణ భారం తగ్గడంతో పాటు ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక నిర్వహణ వ్యవస్థలు పోర్టులకు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. దీంతో పోర్టుల నిర్వహణ సామర్థ్యం గణనీయంగా పెరిగి, నౌకల టర్న్‌రౌండ్ సమయం తగ్గడంతో లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియలు మరింత వేగవంతమవుతాయని పేర్కొన్నారు. అలాగే దేశీయ, విదేశీ పెట్టుబడులు పెద్దఎత్తున ఆకర్షితమై, పోర్టుల పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్‌లు, ఎగుమతి కేంద్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దీనివల్ల స్థానిక యువతకు వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి దీర్ఘకాలికంగా గణనీయమైన ఆదాయం సమకూరుతుందని మంత్రి వివరించారు.
రామాయపట్నం పోర్టుపై అవాస్తవ ప్రచారానికి చెక్…
రామాయపట్నం పోర్టు నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం 95 శాతం పనులు పూర్తయ్యాయని ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. వాస్తవానికి 2024 జూన్ నాటికి కేవలం 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి అని తెలిపారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత రెండేళ్లలో మరో 30 శాతం పైగా పనులను పూర్తి చేయడంతో ప్రస్తుతం మొత్తం పనుల పురోగతి సుమారు 80.50 శాతానికి చేరుకుందని వెల్లడించారు. అంతేకాక, గత ప్రభుత్వం మధ్యలో వదిలేసిన భూసేకరణ ప్రక్రియను పూర్తిస్థాయిలో పూర్తి చేసి ప్రాజెక్టుకు అవసరమైన భూములన్నింటినీ కూటమి ప్రభుత్వమే సమకూర్చిందని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే ఆర్థిక నిర్మాణం…
PPP విధానంలో రాష్ట్ర ప్రభుత్వానికి దీర్ఘకాలికంగా అత్యధిక ఆర్థిక ప్రయోజనం చేకూరేలా ఒప్పంద నిబంధనలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ప్రైవేట్ నిర్వాహకులు రూ.1,500 కోట్ల ముందస్తు ప్రీమియాన్ని రెండు విడతలుగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా, వేలంలో కోట్ చేసిన ఆదాయ వాటా (Revenue Share) ప్రభుత్వానికి లభించడంతో పాటు, 20వ సంవత్సరం నుంచి ప్రతి మూడు సంవత్సరాలకు ఆ వాటా 1 శాతం చొప్పున పెరుగుతూ గరిష్టంగా 25 శాతానికి చేరుతుంది. అలాగే, కనీస హామీ ఆదాయం (MGR) కింద పోర్టు నిర్వాహకులు ప్రతి ఏడాది కనీసం రూ.10 కోట్ల నుంచి ప్రారంభమై కాలక్రమేణా రూ.150 కోట్ల వరకు ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించే విధంగా నిబంధనలు రూపొందించడం ద్వారా రాష్ట్రానికి స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయం అందేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు.
ప్రభుత్వ వాటా, హక్కులు యథాతథంగా కొనసాగుతాయి…
రామాయపట్నం పోర్టు ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ బోర్డు (APMB) అన్ని దశల్లోనూ, మొత్తం 19 బెర్తులపై 12 శాతం నాన్-డైల్యూటబుల్ ఈక్విటీ వాటాను శాశ్వతంగా కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వాటా తగ్గదని, భూమిని ప్రైవేట్ సంస్థకు విక్రయించడం కాకుండా లీజు ప్రాతిపదికన మాత్రమే వినియోగ హక్కులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే, పోర్టు విస్తరణకు ప్రైవేట్ సంస్థ చేసే ప్రతి పెట్టుబడిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని, కాబట్టి దీనిని ప్రైవేటీకరణగా చిత్రీకరించడం ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడమేనని మంత్రి పేర్కొన్నారు.
వైసీపీకి మంత్రి సూటి ప్రశ్నలు…
ప్రస్తుతం PPP విధానంపై అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ, తమ పాలనలో తీసుకున్న నిర్ణయాలకు ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను అదానీ గ్రూప్‌కు విక్రయించింది అప్పటి వైసీపీ ప్రభుత్వమే కాదా? అలాగే 2023లో JSWకు రెండు బెర్తులను ఏ ప్రాతిపదికన కేటాయించారు? ఆ ప్రక్రియలో బహిరంగ బిడ్డింగ్ ఎక్కడ నిర్వహించారని, ప్రభుత్వానికి లభించే ఆదాయంపై ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారని ప్రశ్నించారు. ఆ సమయంలో మౌనం పాటించిన వారు, ఇప్పుడు PPP విధానంపై అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొంటూ, ఈ ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పిన తర్వాతే ప్రభుత్వంపై విమర్శలు చేయాలని మంత్రి సూచించారు.
వైసీపీకి అసలు సమస్య అభివృద్ధే…
PPP విధానం వైసీపీకి సమస్య కాదని, రాష్ట్ర అభివృద్ధే అసలు సమస్య అని మంత్రి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వారికి ఇష్టం లేదన్నారు. పరిశ్రమలు రావడం ఇష్టం లేదన్నారు. యువతకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేదన్నారు. ప్రభుత్వ ఆదాయం పెరగడం ఇష్టం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో పోటీ రాష్ట్రంగా ఎదగడం వారికి నచ్చడం లేదన్నారు. అందుకే ప్రతి అభివృద్ధి కార్యక్రమంపై అసత్య ప్రచారం చేయడం, ప్రజలను భయపెట్టడం, పెట్టుబడిదారులను నిరుత్సాహపరచడం వైసీపీ రాజకీయ అజెండాగా మారిందని విమర్శించారు.
అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం…
రాష్ట్ర ప్రభుత్వం పోర్టులను విక్రయించడం కాదని, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా, ప్రజల ప్రయోజనాలు, ప్రభుత్వ ఆదాయం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగేలా సమర్థవంతమైన PPP విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అసత్య ప్రచారాలతో అభివృద్ధిని అడ్డుకోవడం కాదు, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత శక్తివంతమైన పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు.
2026 డిసెంబర్ నాటికి మూడు పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యము…
రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రస్తుతం 80.50 శాతం పూర్తయ్యాయని, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణం కూడా వేగంగా కొనసాగుతోందని, 2026 డిసెంబర్ నాటికి మూడు పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
రామాయపట్నం పోర్టును ప్రపంచస్థాయి ఆల్-వెదర్, మల్టీ-కార్గో పోర్టుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పోర్టు యాజమాన్యం, భూమి, విధానపరమైన నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు (APMB) అన్ని దశల్లో 12 శాతం నాన్-డైల్యూటబుల్ ఈక్విటీ వాటాను కలిగి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించేందుకు రూ.1,500 కోట్ల ముందస్తు ప్రీమియం, ఆదాయ భాగస్వామ్యం (Revenue Share), కనీస హామీ ఆదాయం (MGR) వంటి ప్రభుత్వ ప్రయోజనాలను పరిరక్షించే నిబంధనలతో పారదర్శక PPP విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
2,538.42 ఎకరాల్లో, 19 బెర్తులతో, 138.54 MMTPA సామర్థ్యంతో అభివృద్ధి చెందుతున్న రామాయపట్నం పోర్టు ద్వారా సుమారు రూ.20,000 కోట్ల పెట్టుబడులు, 25 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఈ పోర్టు ఎగుమతి-దిగుమతి వాణిజ్యాన్ని విస్తరించడంతో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగం అభివృద్ధికి ఊతమిచ్చి, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి సముద్ర ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మ్యారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణాదిత్య పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News