Breaking News

విశాఖ మత్స్యకార పడవ ప్రమాదంపై యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం

-తొలి సమాచారం అందిన క్షణం నుంచే యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ ప్రాంభం
-బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం
-రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ మత్స్యకార పడవ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి తొలి సమాచారం అందిన క్షణం నుంచే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలిచిందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ & RTGS సీఈఓ ప్రకర్ జైన్, విశాఖపట్నం రేంజ్ మరియు కోస్టల్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టితో కలసి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ దుర్గటనకు సంబందించి వాస్తవ సమాచారాన్ని విరించారు.

విశాఖపట్నం తీరంలో యాంత్రిక మత్స్యకార పడవ ప్రమాద ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం, భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం, మెరైన్ పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖలతో సమన్వయం చేస్తూ 72 గంటలకు పైగా విస్తృత స్థాయిలో గాలింపు, రక్షణ, సహాయక చర్యలను చేపట్టడం జరిగిందని మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ తెలిపారు. ఒక మత్స్యకారుడిని సురక్షితంగా రక్షించి వైద్యసేవలు అందించడంతో పాటు, ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆరు బాధిత కుటుంబాలకు రూ.60 లక్షల తక్షణ ఆర్థిక సహాయం, రక్షించబడిన మత్స్యకారుడికి రూ.50 వేల ప్రత్యేక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. నిర్దేశిత ప్రక్రియ పూర్తైన అనంతరం ప్రతి బాదిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, బీమా సహాయం అందించనుండగా, భవిష్యత్తులో సముద్ర భద్రత, అత్యవసర స్పందన వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

ప్రమాద ఘటన…
2026 జూలై 4న విశాఖపట్నం తీరానికి చెందిన IND-AP-MM-V5-83 యాంత్రిక మత్స్యకార పడవలో మొత్తం ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారన్నారు. మధ్యాహ్నం సుమారు 3.45 గంటలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, బలమైన ఈదురుగాలుల కారణంగా పడవ ప్రమాదానికి గురైందన్నారు. ఒక మత్స్యకారుడు వెంటనే సముద్రంలో గల్లంతు కాగా, మిగిలిన ఆరుగురు మునిగిపోతున్న పడవపై రాత్రి వరకు ఆశ్రయం పొందారన్నారు. అనంతరం థర్మాకోల్ సహాయంతో ఈదుకుంటూ ప్రాణాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. వారిలో కారి చిన్న సమీపంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకను చేరుకొని ప్రాణాలతో బయటపడగా, మిగిలిన ఐదుగురు సముద్రంలో గల్లంతయ్యారన్నారు.

సమాచారం అందిన వెంటనే ప్రారంభమైన అధికారిక స్పందన…
కుటుంబ సభ్యులు, మత్స్యకార సంఘాల ద్వారా సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు, కోస్ట్ గార్డ్, నౌకాదళం, జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించడం జరిగిందన్నారు. అదే రాత్రి అత్యవసర సమాచార వ్యవస్థను పూర్తిగా వినియోగిస్తూ అన్ని సంబంధిత శాఖలను అప్రమత్తం చేసి గాలింపు చర్యలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

విస్తృత గాలింపు ఆపరేషన్…
విశాఖపట్నంలోని కోస్ట్ గార్డ్ నౌక మరమ్మతుల్లో ఉండటంతో వెంటనే కాకినాడ నుంచి సహాయక నౌకలను తరలించడం జరిగిందన్నారు. జూలై 5 ఉదయం నుంచే భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ సంయుక్తంగా సముద్రంలో విస్తృత గాలింపు చేపట్టాయన్నారు. 72 గంటలకు పైగా నిరంతరాయంగా గాలింపు కొనసాగిస్తూ సముద్రంలోని విస్తృత ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందన్నారు.

ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడికి వైద్య సహాయం…
వాణిజ్య నౌకలో రక్షించబడిన కారి చిన్నకు తక్షణమే ఆహారం, తాగునీరు, ప్రాథమిక వైద్యసహాయం అందించడం జరిగిందన్నారు. భారత తీర రక్షక దళం హెలికాప్టర్ ద్వారా ఆయనను ఒడ్డుకు తరలించి కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలినట్లు ఆయన తెలిపారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ…
బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, అధికారిక ధృవీకరణ ప్రక్రియ పూర్తికాకముందే ప్రభుత్వం మానవతా దృక్పథంతో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున, మొత్తం ఆరు కుటుంబాలకు రూ.60 లక్షల తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. అదే విధంగా ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు కారి చిన్నకు అత్యవసర వైద్య అవసరాల కోసం రూ.50,000 ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మత్స్యశాఖ మంజూరు చేసిందన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా కూడా వైద్య సహాయం అందించే చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

తదుపరి అందించనున్న పరిహారం…
నిర్దేశిత విధానాలు పూర్తయిన అనంతరం అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి మత్స్యశాఖ ఎక్స్‌గ్రేషియా (రూ.5 లక్షలు) మరియు PMMSY–NFDB గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GAIS) కింద బీమా (రూ.5 లక్షలు) కలిపి మొత్తం రూ.10 లక్షల అదనపు ఆర్థిక సహాయం అందించబడుతుందని ఆయన తెలిపారు.

సముద్ర భద్రత, గాలింపు చర్యలు, బాధితులకు అందించిన సహాయం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సమగ్ర సమీక్ష నిర్వహించి, అన్ని శాఖల సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ సముద్ర ప్రమాదాల సమయంలో అత్యవసర స్పందన వ్యవస్థను ఇంకా వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

విశాఖ రేంజ్ & కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ…
విశాఖ రేంజ్ & కోస్టల్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ, జూలై 4వ తేదీ రాత్రి సుమారు 10.30 గంటలకు సాయంత్రానికే తీరానికి చేరుకోవాల్సిన మత్స్యకార పడవ ఇంకా ఒడ్డుకు చేరలేదని మెరైన్ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందిందన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే మెరైన్ సీఐ స్పందించి, ఫిషింగ్ బోట్ యజమానులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులతో మాట్లాడి సంఘటనను నిర్ధారించారని తెలిపారు. అనంతరం రాత్రి సుమారు 10.50 గంటలకు సమాచారం అందించిన వ్యక్తిని మరోసారి సంప్రదించి, సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల పూర్తి వివరాలు, పడవ వివరాలు, ప్రయాణించిన ప్రాంతం తదితర సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు.

సేకరించిన వివరాలను సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రోటోకాల్ ప్రకారం నమోదు చేసి, అర్ధరాత్రి 12.15 గంటల నుంచి 12.30 గంటల మధ్య భారత నౌకాదళం (Navy), భారత తీర రక్షక దళం (Coast Guard)లకు అధికారిక ఈ-మెయిల్స్ పంపినట్లు వెల్లడించారు.

సమాచారం అందుకున్న వెంటనే నౌకాదళం, కోస్ట్ గార్డ్ సముద్రంలో సంచరిస్తున్న అన్ని వాణిజ్య, రక్షణ నౌకలకు గల్లంతైన మత్స్యకారుల వివరాలను చేరవేశాయని తెలిపారు. ఈ సమాచారంతోనే మరుసటి రోజు ఉదయం 7.00 నుంచి 7.30 గంటల మధ్య పనామా రిజిస్ట్రేషన్ కలిగిన ఒక వాణిజ్య నౌక యాంకర్‌ను పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్న కర్రి చిన్నాను గుర్తించి సురక్షితంగా రక్షించగలిగినట్లు వివరించారు.

అదే సమయంలో సముద్రంలో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కాకినాడ కోస్ట్ గార్డ్ నౌకకు కూడా సమాచారం అందించగా, అది వెంటనే ప్రమాద ప్రాంతానికి మళ్లించి గాలింపు చర్యలు ప్రారంభించిందన్నారు. అనంతరం జూలై 5వ తేదీ ఉదయం నుంచి కోస్ట్ గార్డ్, నౌకాదళం, మెరైన్ పోలీసుల అదనపు నౌకలు గల్లంతైన మత్స్యకారుల కోసం విస్తృత గాలింపు చేపట్టాయని తెలిపారు.

గాలింపు కార్యక్రమంలో కోస్ట్ గార్డ్, నౌకాదళానికి చెందిన నౌకలు, షిప్‌లతో పాటు హెలికాప్టర్లు కూడా పాల్గొన్నాయని చెప్పారు. తీవ్ర ప్రతికూల వాతావరణం, నాలుగు మీటర్లకు పైగా ఎత్తైన అలలు ఉన్నప్పటికీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగించామని పేర్కొన్నారు.

పనామా రిజిస్ట్రేషన్ నౌకపై ఉన్న కర్రి చిన్నాను ఆ సమయంలో అలల తీవ్రత కారణంగా చిన్న పడవల ద్వారా సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడం సాధ్యం కాలేదన్నారు. మరుసటి రోజు వాతావరణం కొంత అనుకూలించడంతో భారత నౌకాదళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఎయిర్‌లిఫ్ట్ చేసి సురక్షితంగా ఒడ్డుకు తరలించామని వివరించారు.

గల్లంతైన మత్స్యకారుల కోసం 72 గంటల పాటు, అంటే జూలై 8వ తేదీ వరకు నిరంతర గాలింపు, రక్షణ చర్యలు కొనసాగించి, అనంతరం సంబంధిత నివేదికను సమర్పించామని తెలిపారు. తదుపరి ప్రభుత్వ నిబంధనల మేరకు త్రిసభ్య కమిటీ ద్వారా విచారణ, తదనంతర ప్రక్రియలు చేపట్టినట్లు గోపీనాథ్ జెట్టి వెల్లడించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *